బిహార్ ఎన్నికల ఫలితాలు: ఎన్‌డీఏ‌కి సంపూర్ణ ఆధిక్యం.. ఇప్పుడిక నితీశ్ ‘పెద్దన్న’ కాదు

మోదీ, నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ కూటమికి సంపూర్ణ ఆధిక్యం లభించింది.

మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా.. బీజేపీ మిత్ర పక్షాలకు 125 సీట్లు వచ్చాయి.

అయితే.. రాష్ట్రంలో 75 సీట్లు గెలుచుకున్న ఆర్‌జేడీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. 74 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకూ ఎన్‌డీఏలో రాష్ట్రంలో ‘పెద్దన్న’గా ఉన్న జేడీయూ బలం 43 సీట్లకు పడిపోయింది.

బిహార్ ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Ec

భారతదేశంలో కరోనావైరస్ కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మొదటి రాష్ట్రం బిహార్. రాష్ట్రంలోని 243 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి.

ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు చెందిన జేడీయూ‌, బీజేపీలతో కూడిన అధికార ఎన్‌డీఏ కూటమితో.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) యువనేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని అయిదు పార్టీల మహాకూటమి తలపడింది.

పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితిశ్ కుమార్ నాలుగోసారి ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఓట్ల లెక్కింపు బుధవారం అర్థరాత్రికి ముగిసి పూర్తి ఫలితాలు వెలువడ్డాయి.

బిహార్ ఎన్నికల ఫలితాలు

బీజేపీ, ఆర్జేడీ కూటముల మధ్య సాగిన పోరులో బీజేపీ కూటమి విజయం సాధించింది.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 122 స్థానాలను గెల్చుకోవాలి. ఎన్‌డీఏ 125 సీట్లు సంపాదించుకుంది. మహాకూటమికి 110 సీట్లు వచ్చాయి.

అయితే ఎన్‌డీఏలో బీజేపీకి 74 సీట్లు వస్తే.. జేడీయూకి కేవలం 43 సీట్లు మాత్రమే వచ్చాయి.

మహాకూటమిలో ఆర్‌జేడీ 75 స్థానాల్లో గెలవగాగా.. 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది.

ఇక సీపీఐ (ఎంఎల్) ఈసారి 12 సీట్లు గెలవటం విశేషం. సీపీఎం, సీపీఐ చెరో రెండు సీట్లలో గెలిచాయి.

అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం ఐదు చోట్ల గెలిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)