సీతారాం ఏచూరి: కన్నుమూసిన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత

ఫొటో సోర్స్, Sitaram Yechury/FB
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించారు. ఆయన వయసు 72 ఏళ్లు.
గత కొద్దిరోజులుగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడిన ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.
సీతారాం ఏచూరి మృతి చెందిన విషయాన్ని సీపీఐ (ఎం) వర్గాలు ధ్రువీకరించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, ఆయన లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీతారాం ఏచూరి మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సాధారణ వ్యక్తి నుంచి భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయులైన గొంతుకలలో ఒకరిగా సీతారాం ఏచూరి ఎదిగారని ఆయన అన్నారు.
ఏచూరి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు

ఫొటో సోర్స్, ChandrababauNaidu Nara/X

సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న జన్మించారు. ఆయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. వీరిది మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబం.
తుది శ్వాస విడిచే సమయానికి ఆయన సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు.
2015లో విశాఖపట్నంలో జరిగిన సీపీఐ (ఎం) మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 2018లో రెండోసారి, 2022లో మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
సీతారాం ఏచూరి హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆయన దిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు.
అక్కడ సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. అనంతరం సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఆర్ధిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టు కావడంతో జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా, డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా ఆయనకు సొంత మేనమామ. సీతారాం ఏచూరి తల్లి కల్పకం, మోహన్ కందాకు సోదరి. ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ శిష్యురాలు.

ఫొటో సోర్స్, Getty Images
సీతారాం ఏచూరి జేఎన్‌యూలో ఉండగా, 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్ఐ)లో చేరారు. 1975లో సీపీఐ(ఎం)లో చేరారు. తక్కువ కాలంలోనే ఏచూరి ఎస్‌ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు.
1984లో ఏచూరి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి, ఆ తర్వాత 1992లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. సమర్ధవంతమైన భావ వ్యక్తీకరణ, పార్టీ పట్ల అంకితభావంతో ఆయన తక్కువ కాలంలోనే పార్టీలో గుర్తింపు పొందారు.
ఎమర్జెన్సీ తర్వాత, ఆయన ఒక సంవత్సరంలో (1977-78) మూడుసార్లు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారని చెబుతారు.
జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్న ఏచూరి ఆనాడు జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా ఉన్న ఇందిరా గాంధీపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఆ పదవికి రాజీనామా చేయించడంలో కీలకంగా వ్యవహరించారు.
ఇందిరా గాంధీతో చర్చలు
1977లో ఎమర్జెన్సీ ముగిసి, ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయినా, ఆమె జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా కొనసాగారు. దీనిని వ్యతిరేకిస్తూ, సీతారాం ఏచూరి నేతృత్వంలో దాదాపు 500 మంది విద్యార్థులు ఇందిరా గాంధీ ఇంటి వద్దకు వెళ్లి నిరసన ప్రదర్శన చేపట్టారు.
దీంతో ఆమె సిబ్బంది వచ్చి ఐదుగురు విద్యార్థులు లోపలికి వెళ్లి ఆమెతో మాట్లాడవచ్చని తెలిపారు. అయితే ఆమే బయటకు వచ్చి తమను కలవాలని విద్యార్థులు పట్టుబట్టడంతో ఇందిరా గాంధీ బయటకు వచ్చి విద్యార్థులను కలిశారు.
యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవికి ఎందుకు రాజీనామా చేయాలో ఇందిరా గాంధీకి ఒక మెమోరాండాన్ని చదివి వినిపించారు ఏచూరి.
ఏచూరి ఆ పేపర్ చదువుతుండగా ఇందిరా గాంధీ ఎలాంటి భావమూ లేకుండా పూర్తిగా విన్నారు. తర్వాత విద్యార్థులు అదే మెమొరాండంను ఆమెకు సమర్పించడంతో ఇందిరా గాంధీ దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీతారాం ఏచూరి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. మొదటిసారి 2005లో, రెండోసారి 2011లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
రైతాంగం, శ్రామిక ప్రజల కష్టాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలు, విదేశీ విధానాలు, మతతత్వ ముప్పు సమస్యలపై రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రశంసలు పొందాయి.
ఆయన గతంలో రవాణా, పర్యాటకం, సంస్కృతికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా కూడా పని చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే 2004లోనూ యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు.
‘వాటీజ్ దిస్ హిందూ రాష్ట్ర’, ‘సూడో హిందూయిజం ఎక్స్‌పోజ్డ్’, ‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘ఆయిల్ పూల్ డెఫిసిట్ ఆర్ సెస్ పూల్ ఆఫ్ డిసీట్’ మొదలైన పుస్తకాలు రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదట ఇంద్రాణీ మజుందార్‌ను వివాహం చేసుకున్న ఏచూరి, ఆమెతో విడిపోయాక జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఇంద్రాణీ మజుందార్‌తో ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు.
ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి 34 ఏళ్ల వయసులో 2021 ఏప్రిల్‌లో కరోనా సమయంలో కన్నుమూశారు. ఆయన కూతురు అఖిలా ఏచూరి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














