సీజేఐ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడంపై వివాదం ఏమిటి? న్యాయమూర్తులకు ‘ప్రవర్తనా నియమావళి’ ఉందా

ఫొటో సోర్స్, X/BJP4INDIA
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో వినాయక పూజకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘‘చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేశ్ పూజకు హాజరయ్యాను. గణేశుడు మనందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్నీ ప్రసాదించుగాక’’ అని ఆ పోస్టులో మోదీ రాశారు.
అయితే, చీఫ్ జస్టిస్ ఇంట్లో జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి ప్రధాని హాజరుకావడం వివాదానికి దారితీసింది.
భారత రాజ్యాంగంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల విభజన.. స్వతంత్రతపై అనేకమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
‘‘చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రధాని మోదీని ఆహ్వానించడం, ప్రధాని దానిని ఆమోదించడం రెండూ తప్పే’’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు.
కానీ మరో సీనియర్ న్యాయవాది ఆనంద్ పింకీ మాట్లాడుతూ ప్రధాని చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లడం మంచిదే అన్నారు. ‘‘గతంలో జరగలేదు అంటే దానర్థం ఎప్పటికీ జరగకూడదు అని కాదు’’ అని అన్నారు.
‘‘కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న అధికార విభజన సూత్రాల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రాజీపడ్డారు.. ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రతపై విశ్వాసం సడలిపోయింది’’ అని ప్రసిద్ధ న్యాయవాది ఇందిరా జైసింగ్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఈ విషయాన్ని ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ ఏడాది నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పలు కీలక కేసులను విచారించారు.

క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ (సీజేఏఆర్) కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
"రాజ్యాంగ సంరక్షణతో పాటు, ఎలాంటి రాగద్వేషాలు, భయం లేకుండా న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థతో సంబంధం లేని స్వతంత్ర వ్యవస్థగా న్యాయవ్యవస్థ ఉండాలి" అని సీజేఏఆర్ తన ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు..
ప్రధాని మోదీ, సీజేఐ చంద్రచూడ్ ఇంటికి వెళ్లడంపై అభ్యంతరాలు లేవనెత్తడం సరైనది కాదని కొందరు అంటున్నారు.
శివసేన శిందే వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవరా తన ‘ఎక్స్’ఖాతాలో ఈ వివాదంపై స్పందిస్తూ ‘‘తీర్పులు తమకు అనుకూలంగా వచ్చినప్పుడు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు విశ్వసనీయతను కీర్తిస్తాయి. కానీ వారికి ఏదైనా ప్రతికూలత ఎదురైతే, న్యాయవ్యవస్ధ తన విశ్వసనీయతతో రాజీపడిందని ఆరోపిస్తాయి. సుప్రీంకోర్టుపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ప్రమాదకర సంప్రదాయాలకు బీజం వేసినట్లవుతుంది’’ అన్నారు.
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నేత సంజయ్‌రౌత్ మాట్లాడుతూ "గణపతి పండుగ సందర్భంగా ప్రజలు ఒకరి ఇళ్లకు ఒకరు వెళుతుంటారు, అయితే ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎన్ని ఇళ్లను సందర్శించారు" అని ప్రశ్నించారు.
‘‘రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులను ఈ విధంగా కలవడం ప్రజలలో అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు సీజేఐ చంద్రచూడ్ ముందు విచారణ జరుగుతోంది. మాకు ఈ కేసులో న్యాయం జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది. మా కేసులో కేంద్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉంది. ఆ ప్రభుత్వానికి మోదీ నాయకుడిగా ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలి. ఓ అనధికార ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన కేసులో వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. న్యాయం చేయాల్సిన సీజేఐకు ప్రధానితో ఉన్న బంధం కళ్లెదుటే కనిపించడం మహారాష్ట్ర ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తోంది’’ అన్నారు.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ మధ్య చీలిక తర్వాత ఏర్పడిన శిందే ప్రభుత్వ చట్టబద్ధత అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
సంజయ్ రౌత్ ఆరోపణలపై బీజేపీ అధికార ప్రతినిధి శహజాద్ పూనావాలా స్పందించారు.
గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారని గుర్తుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘వ్యవస్థలు శత్రుత్వంతో ఉండాలా?’
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మానన్ కుమార్ మిశ్రా ఈ వివాదంపై స్పందించారు.
‘‘అదో ఆధ్యాత్మిక కార్యక్రమం. మన ప్రధాని అక్కడ పూజ చేశారు. అది మరో రకమైన సమావేశమే అయి ఉంటే అది రహస్యంగా జరిగి ఉండేది. దీనిపై అనవసరంగా వ్యాఖ్యానించేవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే... తీర్పులపై ఈ వ్యవహారం ఎలాంటి ప్రభావం చూపదని’’ అని చెప్పారు.
మరోపక్క బీజేపీ నేత సంబిత్ పాత్ర ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
ఈ దేశ ప్రధాని సీజేఐను కలవడం మీకు అభ్యంతరకరంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు పరస్పరం శత్రుత్వంతో ఉండాలా, చేతులు కలపకూడదా అని ప్రశ్నించారు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇఫ్తార్ విందుకు అప్పటి సీజేఐ వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై ఆయన ప్రతిపక్షాలకు అనేక ప్రశ్నలు సంధించారు.
అయితే ప్రధాని మోదీ సీజేఐ నివాసానికి వెళ్లడాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయమూర్తుల ‘ప్రవర్తనా నియమావళి’తో ముడిపెట్టారు.
‘‘ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం సముచితం కాదు. మతపరమైన ఆ కార్యక్రమాన్ని బహిరంగపరచడం ప్రధానికి, సీజేఐకు తగదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా?
న్యాయమూర్తులు అనుసరించాల్సిన నియమాల గురించి జస్టిస్ వెంకటాచలయ్య ఓ ‘ప్రవర్తనా నియమావళి’ రూపొందించారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బీబీసీతో చెప్పారు.
న్యాయమూర్తులంతా దీనిని పాటిస్తున్నారని దవే అన్నారు.
జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య 1993-94 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
"మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందు ఓ బహిరంగ కార్యక్రమమని, దీనికి అందరినీ ఆహ్వానించారు. కానీ గతంలో ఎప్పుడూ ఏ ప్రధానీ లేదా రాజకీయ నాయకుడు చీఫ్ జస్టిస్ ఇంట్లో కార్యక్రమానికి ఈ విధంగా హాజరుకాలేదు" అని దవే తెలిపారు.
సీజేఐ చంద్రచూడ్ తండ్రి కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేసిన దుష్యంత్ దవే.. ఆయన ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా, స్వతంత్రంగా వ్యవహరించడమే కాదు... న్యాయం జరగాలి, న్యాయం జరిగినట్లు కనిపించేలా చూడాలి అని దవే అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ గతంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
ఈ వివాదంపై బీజేపీ సీనియర్ లాయర్ పింకీ ఆనంద్‌తో బీబీసీ మాట్లాడింది. న్యాయమూర్తులకు ‘ప్రవర్తనా నియమావళి’లాంటిదేమీ లేదని ఆమె అన్నారు.
ప్రధాని, సీజేఐ వేర్వేరు కార్యక్రమాల్లో కలుస్తున్నారని.. ఇప్పుడు కూడా ప్రధాని గణేశ్ పూజకు హాజరయ్యేందుకు సీజేఐ ప్రైవేటు నివాసానికి కాకుండా ప్రభుత్వ నివాసానికే వెళ్లారని , ఇది బహిరంగమేనని పింకీ ఆనంద్ తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ పీఎన్ భగవతి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారని.. ఆ తర్వాత దీనిపై పెద్ద దుమారమే రేగిందని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు.
ఎన్నికల్లో విజయం సాధించిన ఇందిరాగాంధీని అభినందిస్తూ ఆ సమయంలో జస్టిస్ భగవతి ఓ లేఖ రాశారు.
ప్రధానికి మోదీకి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆహ్వానం పంపడం, ప్రధాని ఆయన నివాసానికి వెళ్లడం.. రెండూ తప్పేనని దుష్యంత్ దవే అభిప్రాయపడ్డారు. ఆ ఫొటోను పంచుకోవడమూ తప్పేనన్నారు.
ఇలా చేసే ముందు సీజేఐ చంద్రచూడ్ వెయ్యిసార్లు ఆలోచించి ఉండాల్సిందని దవే అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














