జార్ఖండ్: జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకేసు మిస్టరీగా మారిందా? సీబీఐ ఎందుకు ఛేదించలేకపోతోంది?

జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకేసు

ఫొటో సోర్స్, RAVI PRAKASH\BBC

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, రాంచీ నుంచి బీబీసీ కోసం

'మీరు అప్రయోజకులు.'

'మీ చార్జిషీటు మూసపద్ధతిలో ఉంది.'

'మీ డైరెక్టర్‌ను కూడా పిలవాల్సి ఉంటుంది.'

'మీరు రోజుకో కొత్త కథ అల్లుతున్నారు.'

'మీరు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.'

పైన పేర్కొన్న వ్యాఖ్యలన్నీ నిజానికి జార్ఖండ్ హైకోర్టు చేసినవి. జార్ఖండ్ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రవి రంజన్, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ధన్‌బాద్‌లో జడ్జిగా పనిచేసిన న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసును జార్ఖండ్ హైకోర్టు విచారిస్తోంది. పలు దఫాల్లో ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది.

సుప్రీం కోర్టుతో పాటు మద్రాస్ హైకోర్టు కూడా సీబీఐని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో జార్ఖండ్ హైకోర్టు వ్యాఖ్యలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ రెండు కోర్టులు కూడా సీబీఐని పంజరంలో చిలుకగా అభివర్ణించాయి.

దేశంలోనే అత్యంత ప్రొఫెషనల్ దర్యాప్తు ఏజెన్సీగా పరిగణించే సీబీఐపై కోర్టులు చేసిన ఈ వ్యాఖ్యలతో దాని పనితీరు, విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఉత్తమ్ ఆనంద్ మృతి కేసులో జనవరి 14న వర్చువల్‌ విచారణ జరిగింది. జార్ఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి రంజన్, జస్టిస్ సుజిత్ నారాయణ్ ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''సీబీఐ దర్యాప్తును చూస్తుంటే, ఈ అంశం 'వివరింపబడని రహస్యం' దిశగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ దగ్గర ఎలాంటి పక్కా ఆధారాలు లేవు'' అని అన్నారు.

ఈ కేసు తదుపరి విచారణ జనవరి 21న జరుగనుంది. అప్పుడు, నిందితుల నార్కో టెస్టు, ఇతర దర్యాప్తు నివేదికలను సీబీఐ, కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకేసు

ఫొటో సోర్స్, RAVI PRAKASH\BBC

ఈ కేసులో అరెస్టు అయిన లఖన్ వర్మ, రాహుల్ వర్మలకు సీబీఐ రెండుసార్లు చొప్పున నార్కోటెస్టును నిర్వహించింది. వీటితో పాటు బ్రెయిన్ మ్యాపింగ్, ఫోరెన్సిక్ నివేదిక విశ్లేషణ, లేయర్డ్ వాయిస్ అనాలిసిస్, ఫోరెన్సిక్ సైకలాజికల్ అనాలిసిస్, పాలిగ్రాఫ్ పరీక్షలను కూడా నిర్వహించారు.

ఇన్ని పరీక్షలు చేసిన సీబీఐ, చార్జిషీటులో మాత్రం... జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణం, సాధారణ ప్రమాదం కాదని, కుట్రతో జరిగిన హత్య అని మాత్రమే చెప్పగలిగింది. కానీ హత్యకు దారి తీసిన సంఘటనలను, కచ్చితమైన కారణాలను చెప్పడంలో సీబీఐ విఫలమైంది.

దీనిపై జార్ఖండ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు ఒక నవలను తలపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ చార్జిషీటును గత అక్టోబర్ 20న ధన్‌బాద్ కోర్టుకు అందజేశారు. ఇందులో ఐపీసీ సెక్షన్లు 302, 201, 34 ప్రకారం ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని పేర్కొన్నారు.

సీబీఐ

ఫొటో సోర్స్, RAVI PRAKASH\BBC

జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఎలా చనిపోయారు?

28 జూలై 2021న, ధన్‌బాద్ తాత్కాలిక ఏడీజే, జడ్జి ఉత్తమ్ ఆనంద్ మార్నింగ్ వాక్ ముగించుకొని జడ్జి కాలనీలోని తన ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంటికి కేవలం 500మీ. దూరంలో ఒక ఆటో రిక్షా వెనక నుంచి ఆయన్ను ఢీకొట్టింది.

దీంతో ముఖానికి దెబ్బతగిలేలా కిందపడిన ఆయన మరణించారు. ఒక నాలుగు లైన్ల రోడ్డులో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడే రోడ్డు మధ్యలో ఆటో ఉంది. అకస్మాత్తుగా డ్రైవర్, ఆటోను జడ్జి వైపుకు తిప్పారు. ఆయనను ఢీకొట్టి అక్కడ నుంచి పారిపోయారు. ఉదయం కావడంతో రోడ్డుపై కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

దీని తర్వాత, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణం సాధారణ ప్రమాదం కాదని కావాలనే కుట్ర పన్ని ఆయన్ను చంపేశారనే చర్చలు నడిచాయి. జడ్జిని ఢీకొట్టాలనే ఉద్దేశంతోనే డ్రైవర్ ఆటోను నడిపాడనేది సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది.

ఆయన మరణించి ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఆయన డెత్ మిస్టరీ కొలిక్కి రాలేదు. ఆయన హత్య వెనక ఎవరున్నారో? ఎవరు ఆయన్ను చంపారో ఇంకా తెలియలేదు.

జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకేసు

ఫొటో సోర్స్, RAVI PRAKASH\BBC

జడ్జి ఉత్తమ్ ఆనంద్ వ్యక్తిత్వం

49 ఏళ్ల న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్, ఢిల్లీ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఆయన తండ్రి సదానంద్ ప్రసాద్, భార్య కృతి సిన్హా, బావ ప్రభాత్ కుమార్ సిన్హా కూడా న్యాయవాదులే. న్యాయమూర్తిగా ఉత్తమ్ ఆనంద్ ఇచ్చిన పలు తీర్పులు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.

ఆయన 36 తీర్పుల్ని వెలువరించారు. ఇందులో 34 కేసులు బెయిల్‌కు సంబంధిచినవే. నిందితుల కస్టడీ వ్యవధి ఆధారంగా ఆయన కేవలం ఆరు బెయిల్ దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు.

మిగిలిన బెయిల్ దరఖాస్తులన్నింటినీ ఆయన తిరస్కరించారు. ఇవన్నీ హత్య, బొగ్గు స్మగ్లింగ్, లైంగిక హింస, చట్టవిరుద్ధంగా లాటరీలు నిర్వహించడం వంటి నేరాలకు సంబంధించినవి. ఇలాంటి డజన్ల కొద్దీ కేసులను ఆయన విచారించారు.

వీడియో క్యాప్షన్, ‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’

తొలుత ఈ కేసును విచారించిన జార్ఖండ్ పోలీసులు

జార్ఖండ్ పోలీసులు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్)కు అప్పగించారు.

ధన్‌బాద్‌లో నమోదైన సుమారు 16వేల ఆటోరిక్షాల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. పలువురు ఆటోడ్రైవర్లు సహా 250 మందిని విచారించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీనితర్వాతే జడ్జి మరణానికి కారణమైన 'జేహెచ్ 10ఆర్ 0461' ఆటోరిక్షాను పోలీసులు పట్టుకోగలిగారు.

మరోవైపు ఆటో డ్రైవర్ లఖన్ వర్మతో పాటు అతనికి సహకరించిన రాహుల్ వర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అనేక సార్లు విచారించారు. కానీ వీరిద్దరూ వేర్వేరు కథలు చెబుతూనే ఉంది. వీరిద్దరూ వృత్తిరీత్యా దొంగలని పోలీసుల విచారణలో తేలింది.

దొంగతనం చేసిన ఆటోనే జడ్జి హత్యకు ఉపయోగించారని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఆటో యజమాని సుగ్ని దేవి, తన ఆటో దొంగతనానికి గురైనట్లు పథార్డిహ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూలై 27, రాత్రి ఆటో చోరీకి గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 29న పోలీసులు తమ నివేదికను సమర్పించారు.

ఆలోగానే జడ్జి ఉత్తమ్ ఆనంద్ యాక్సిడెంట్ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆలస్యంగా రిపోర్ట్ చేసినందుకు గానూ ధన్‌బాద్ ఎస్‌ఎస్‌పీ, అప్పటి స్టేషన్ ఇన్‌చార్జి ఉమేశ్ మాంఝీని సస్పెండ్ చేశారు.

పూర్ణేందు విశ్వకర్మ అనే వ్యక్తి రాహుల్ వర్మపై మొబైల్ ఫోన్ దొంగతనానికి సంబంధించిన ఫిర్యాదు కూడా చేశారు.

సీబీఐ

ఫొటో సోర్స్, RAVI PRAKASH\BBC

హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ

జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసును జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు ఆదేశాల అనంతరం ఆగస్టులో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.

అప్పటి నుంచి సీబీఐ జాయింట్ డైరెక్టర్ శరద్ అగర్వాల్ నేతృత్వంలోని ఒక టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ అధికారి వీకే శుక్లా దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఘటనా స్థలంలో సీన్ రీక్రియేట్ చేయడం ద్వారా సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఘటన జరిగిన 90 రోజుల్లోగా చార్జిషీటును నమోదు చేసిన సీబీఐ అధికారులు, అంతకుమించి ఈ కేసులో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ, హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది.

మొబైల్ చోరీ చేసేందుకే ఆటో డ్రైవర్, ఉత్తమ్ ఆనంద్‌ను ఢీకొట్టాడని సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ చేస్తోన్న ఈ వాదనను అంగీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఇప్పటికీ జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసు అంతుపట్టని పజిల్‌లాగే మిగిలిపోయింది. ఈకేసును ఛేదించడానికి మరికొంత సమయం పట్టొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)