సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హతలు ఏమిటి? సీజేఐ నియామకం ఎలా జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు సీనియారిటీలో ముందున్నజస్టిస్ ఎన్.వి.రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధానన్యాయమూర్తికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను బహిరంగం చేయడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు, రాజ్యాంగ సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తుంది అంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ జగన్ చర్యను ఖండించింది.
ఈ నేపథ్యంలో అసలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలు ఎలా జరుగుతాయో పరిశీలిద్దాం.
సుప్రీం కోర్టు భారతదేశంలోని అత్యున్నత న్యాయ స్థానం. ఇది దేశంలోని అన్ని న్యాయస్థానాలపై నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది.
1950 జనవరి 28న సుప్రీం కోర్టు స్థాపన జరిగింది. రాజ్యాంగంలోని 124 నుంచి 147 అధికరణలు భారత న్యాయ వ్యవస్థ కూర్పు, విధి విధానాలు, అధికార పరిధిని నిర్దేశించాయి.
ప్రధానంగా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా గానీ లేదా కొన్ని తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైనవివాదాలకు సంబంధించిన కేసులను గానీ సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తుంది.
తొలుత ప్రధాన న్యాయమూర్తితో కలిపి 8 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన సుప్రీం కోర్టు క్రమేణా 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి, 1986లో 26కి, 2008లో 31 మంది న్యాయమూర్తులకు పెరిగింది.
అక్టోబరు 2020 నాటికి సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 30 మంది జడ్జీలు ఉన్నారు. అయితే, వీరి సంఖ్య 34 వరకు ఉండవచ్చు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హతలు ఏమిటి?
- భారత పౌరులై ఉండాలి.
- కనీసం 5 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి.
- లేదా 10 సంవత్సరాల పాటు హైకోర్టులో న్యాయవాద వృత్తి నిర్వహించి ఉండాలి.
- లేదా ప్రముఖ న్యాయ నిపుణులు అయి, రాష్ట్రపతి దృష్టిలో ఆ వ్యక్తి ఒక విలక్షణ న్యాయవేత్తగా పరిగణించిన వారై ఉండాలి.
అయితే, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో న్యాయ నిపుణులను ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు లేవని బెనెట్ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, SCI.GOV.IN
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం ఎలా జరుగుతుంది?
సుప్రీం కోర్టు జడ్జీల నియామకం భారత రాజ్యాంగంలోని 124 వ అధికరణం సెక్షన్ 2లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి జరుగుతుంది.
సాధారణంగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన సీనియర్ జడ్జిని ఈ పదవిలో నియమిస్తారు.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖకు తన సూచన పంపిస్తారు.
కేంద్ర న్యాయ శాఖ ఆ సూచనను ప్రధాన మంత్రి ప్రతిపాదనకు పంపిస్తుంది. దానిని పరిశీలించిన ప్రధాన మంత్రి.. ప్రధాన న్యాయమూర్తి పేరును రాష్ట్రపతికి సూచిస్తారు.
ఉన్నత న్యాయస్థానాలలో జరిగే నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో జరగాలన్న అంశాన్నిఅంబేడ్కర్ నిరాకరించినట్లు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు విశ్రాంత ప్రధానన్యాయమూర్తి ఎం ఎన్ రావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
"ప్రధాన న్యాయమూర్తి చాలా సమర్థుడైన వ్యక్తేనని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నప్పటికీ, ఆయనకు కూడా మనుషులందరికీ ఉండే భావాలే ఉంటాయి" అని అంబేడ్కర్ అభిప్రాయపడినట్లుచెప్పారు.
"రాజ్యాంగంలో ఎక్కడా కేవలం సీనియర్ న్యాయాధికారులనే ప్రధాన న్యాయమూర్తిగా చేయాలని పొందు పరచలేదు. ఇది కేవలం కార్య నిర్వాహక సౌలభ్యం కోసం రాజ్యాంగ సంప్రదాయంగాకొనసాగుతూ వస్తోంది" అని శ్రీధర్ చెప్పారు.
రాజ్యాంగ నియమాలు రాజ్యాంగంలో రాత పూర్వకంగా పొందుపరిస్తే, కొంత కాలంగా పాటిస్తూ వస్తున్న రాజ్యాంగ సంప్రదాయాలు మాత్రం ఎక్కడాలిఖిత పూర్వకంగా ఉండవని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం కోర్టులో సీనియారిటీని కాదని ప్రధాన న్యాయమూర్తి నియామకాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయా?
"భారతదేశ చరిత్రలో రెండు సార్లు సీనియర్ జడ్జీలను కాదని ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సీనియర్లుగా ఉన్న ముగ్గురు జడ్జీలను కాదని నాలుగవ వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అప్పుడు మిగిలిన ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు జడ్జీలు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా తీర్పునివ్వడమే వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకపోవడానికి ముఖ్యమైన కారణం" అని శ్రీధర్ చెప్పారు.
మరొక సారి హెచ్ ఆర్ ఖన్నా ఎమర్జెన్సీ తరువాత ఒక తీర్పును ఇవ్వబోతూ వారి సోదరికి ఫోను చేసి, నేను ఇవ్వబోయే తీర్పు నా పదవోన్నతి పై ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా చెప్పినట్లు శ్రీధర్ తెలిపారు. ఆయన నియామకం విషయంలో కూడా సీనియారిటీని పాటించలేదు అని తెలిపారు.
వీటిని పరిశీలిస్తే ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసే వ్యక్తి గురించి ప్రధానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని ఆయన అన్నారు.
అయితే, ఈ పదవీ నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏక పక్షంగా తీసుకుంటారా?
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలతో ఏర్పాటు చేసిన కొలీజియంతో చర్చించి ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి నిర్ణయం తీసుకుంటారనిశ్రీధరాచార్యులు వివరించారు.
కొలీజియం న్యాయమూర్తుల నియామకంలో చట్టబద్ధమైన అధికారం కలిగి ఉంటుంది. కొలీజియం సిఫారసులను కొట్టివేసే అధికారం ఏ కోర్టుకు లేదు.
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే వ్యక్తి నైపుణ్యం గురించి సుప్రీం కోర్టు జడ్జీలకు అవగాహన లేని పక్షంలో ఆ వ్యక్తి గతంలో విధులు నిర్వహించిన హై కోర్టుకు సంబంధించిన ఇతర సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలను సంప్రదిస్తారు.
అంతే కాకుండా, ప్రస్తుతం అదే హై కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న వారిని కూడా సంప్రదించి జడ్జి ప్రతిభా పాటవాల గురించి అభిప్రాయాలు సేకరించవచ్చు.
అయితే, "న్యాయమూర్తుల నియామకంలో న్యాయ శాఖ రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా లాంఛనంగా మారింది" అని ఎం ఎన్ రావు అంటారు.
కొలీజియంలో సభ్యులందరూ ఇచ్చిన అభిప్రాయాలతో పాటు సదరు జడ్జి పని చేసిన హై కోర్టు సీనియర్ జడ్జి ఇచ్చిన అభిప్రాయాలతో కలిపి సేకరించిన సూచనను సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి భారత ప్రభుత్వానికి రాత పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది.
సదరు జడ్జి గురించి ఒక వేళ న్యాయవ్యవస్థ బయట నుంచి అభిప్రాయాలు సేకరిస్తే వాటిని ప్రభుత్వానికి తెలియచేయవలసి ఉంటుంది కానీ, అది రాతపూర్వకంగా సమర్పించాల్సిన పని లేదు.
సుప్రీం కోర్టు చేసిన తుది సూచనలను న్యాయ శాఖ ప్రధాన మంత్రికి సమర్పిస్తుంది. ప్రధాన మంత్రి ఆ సూచనను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఆ సూచననుసరించి రాష్ట్రపతి ప్రధానన్యాయమూర్తిని నియమిస్తారు.
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరు ఖరారు అవ్వగానే న్యాయ శాఖ కార్యదర్శి ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి తెలియచేస్తారు.
రాష్ట్రపతి ఆమోదం తెలపగానే న్యాయ శాఖ కార్యదర్శి ఈ నియామకాన్ని ప్రకటించి, సంబంధిత నోటిఫికేషన్ గజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురణకు పంపిస్తారు.
కేశవానందభారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం (1973) కేసులో స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటని 13 మంది సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.
"న్యాయమూర్తుల నియామకంలో ప్రతిభ కాకుండా మిగిలిన అంశాలు నిర్వహించిన పాత్ర అప్రాధాన్యమైనదని చెప్పలేమని అంటూ కొన్ని కేసులలో రాజకీయ ప్రమేయం, ప్రాంతీయ, మతపరమైన మనోభావాలు ప్రధానంగా ప్రభావం చూపాయి" అని ఎం ఎన్ రావు అన్నారు.
"ప్రఖ్యాత భారత రాజ్యాంగ వ్యాఖ్యాత గ్రన్విల్లే ఆస్టిన్ కూడా నియామకాలలో పైకి చెప్పని ఉద్దేశాలు ఉన్నాయి" అని అన్నారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, PTI
కొలీజియం పాత్ర ఏమిటి?
కొలీజియం పని విధానాన్ని మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యల గురించి పరిశీలించాలని కోరుతూ 2015 డిసెంబరులో రాజ్యాంగ ధర్మాసనం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరారు. ఈ సలహాలను గ్రంథస్థం చేయడానికి ఒక సంఘాన్ని కూడా నియమించారు.
న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం అర్హత ప్రమాణాలు, నియామక విధానంలో పారదర్శకత, సరైన విధాన అవగాహన నిర్వహణకు ఒక సచివాలయం ఏర్పాటు లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకోవాలని భావించారు.
అయితే కొలీజియం వ్యవహార సరళి, ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకం గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొలీజియం సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ భారత ప్రధాన న్యాయమూర్తికి సెప్టెంబర్ 2016లో ఒక లేఖ రాశారు. ఈ లేఖ అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ.. అన్ని మీడియా సంస్థలూ దీనిని ప్రచురించాయి.
"దేశంలో సాగుతున్న పాలన, శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సున్నిత సమతౌల్యం మీద, ప్రభుత్వ జోక్యం చూపుతున్న ప్రభావం గురించి కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ఆ లేఖ లేవనెత్తింది".
"అయితే ఆ న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలను పరిష్కరించారో లేదో మాత్రం తెలియదు. కొలీజియం వ్యవహారాలేవీ ప్రజలకు తెలియవు. ఆఖరికి కొలీజియంలో సభ్యులు కాని ఉన్నత న్యాయమూర్తులకు కూడా అక్కడ జరిగిన చర్చల వివరాలు తెలియవు" అని ఎం ఎన్ రావు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
జస్టిస్ జేఎస్ వర్మ న్యాయమూర్తుల నియామకాలను జాతీయ జ్యుడీషియల్ కమిషన్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి, ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఇందులో సభ్యులుగా ఉండాలని ఆయన చెప్పారు.
న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థదే పై చేయి అన్న సంగతి సెకెండ్ జడ్జస్ కేసుతోనే నిర్ధరణ అయిందని నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, జస్టిస్ గోయెల్, జస్టిస్ మదన్ సి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మెజారిటీ తీర్పులో పునరుద్ఘాటించారు.
సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1993 (4) ఎస్సీసీ 441) కేసులో జస్టిస్ ఏ ఎం అహ్మదీ ఇచ్చిన మైనారిటీ కేసునే సెకెండ్ జడ్జస్ కేసుఅని అంటారు.
న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేయదలిచిన వ్యక్తులలో ప్రతికూల లక్షణాలు ఉంటే వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లడమనే పాత్రకు మాత్రమే కార్యనిర్వాహకవ్యవస్థ పరిమితం కావాలని ఈ తీర్పును విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం ఎలా జరుగుతుంది?
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర హై కోర్టులో పని చేసిన సుప్రీం కోర్టు జడ్జీని సంప్రదిస్తారు.
2017లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుకి ప్రధాన న్యాయ మూర్తిగా డివిఎస్ సోమయాజులు నియామకం సమయంలో సుప్రీం కోర్టు జడ్జి రమణను సంప్రదించారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, జస్టిస్ రమణ ఒకే రకమైన అభిప్రాయం ఇవ్వడం వలన వారిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాన్ని జడ్జి చలమేశ్వర్ లేవదీశారు. వారిచ్చిన నివేదికలు పరిశీలించే అవకాశం కొలీజియం సభ్యులకు మాత్రమే ఉంటుంది.
సోమయాజుల నియామకాన్ని చంద్రబాబు, రమణ కూడా సమర్ధించనప్పటికీ, కొలీజియం నిర్ణయంపై ఆయన నియామకం జరిగిందని శ్రీధర్ చెబుతున్నారు.
యాక్టింగ్ జడ్జి నియామకాలకు ఎటువంటి పద్ధతిని పాటిస్తారు?
రాజ్యాంగంలోని 126వ అధికారణాన్ని అనుసరించి భారతదేశ అధ్యక్షుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని చేపడతారు.
సాధారణంగా ప్రధాన న్యాయమూర్తి పదవిని భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు సుప్రీం కోర్టులో సీనియర్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని ఆ స్థానంలో పని చేసేందుకు నియమిస్తారు.
తాత్కాలిక న్యాయమూర్తిగా ఎప్పుడు నియామకాలు జరుగుతాయి?
సుప్రీం కోర్టు విధులు నిర్వహించడానికి ఏ పరిస్థితుల్లోనైనా తగినంత మంది జడ్జీలు లేని పక్షంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి.. దేశాధ్యక్షుని ఆమోదం తీసుకుని, సదరు హై కోర్టు ప్రధానన్యాయమూర్తిని సంప్రదిస్తారు.
సుప్రీం కోర్టులో తాత్కాలికంగా విధులు నిర్వర్తించడానికి జడ్జీల నియామకం చేపడతారు. సదరు హై కోర్టు న్యాయమూర్తి సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి తన అంగీకారాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తెలియచేస్తారు.
ఈ నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ తిరిగి ప్రధాన మంత్రికి సమర్పిస్తుంది. ప్రధాన మంత్రి ఈ నియామకాన్ని రాష్ట్రపతికి సూచిస్తారు. ఈ నియామకం గురించి కూడా గెజిట్‌లో ప్రచురిస్తారు.
పదవీ విరమణ చేసిన జడ్జీలను తిరిగి నియమిస్తారా?
రాజ్యాంగంలోని 128 వ అధికారణాన్ని అనుసరించి రాష్ట్రపతి అంగీకారం తీసుకుని పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్ట్ జడ్జిని ఎవరినైనా సుప్రీం కోర్టులో తాత్కాలిక విధులను నిర్వహించేందుకునియామకం చేయవచ్చు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పదవిలో కొనసాగుతారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అనుచిత ప్రవర్తన, అసమర్ధత కారణాలతో పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభలలో మూడింట రెండువంతులకు తగ్గకుండా సభ్యుల మద్దతుఉండాలి. అలాగే, ఓటింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం లోక్ సభలో 100 మంది సభ్యులు, రాజ్య సభలో అయితే 50 మంది సభ్యులు కావాలి. "ఇదిపూర్తిగా రాజకీయ అధికారం మీద ఆధారపడి ఉంటుంది" అని శ్రీధర్ అన్నారు.
"ఒక జడ్జి మీద తలెత్తిన ఆరోపణలను విచారించకుండా ప్రధాన న్యాయమూర్తిగా నియమించవచ్చా లేదా అనేది ఇప్పుడున్న కొత్త సమస్య అని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూతలెత్తలేదు" అని ఆయన అన్నారు.
ఇటువంటి అంశాలపై దేశ ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కలిసి నిర్ణయం ఆయన అన్నారు.
కానీ, ఆరోపణల పై విచారణ జరపడం అనేది తప్పకుండా చేపట్టవలసిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్ని దశాబ్ధాల క్రితం జస్టిస్ చంద్రారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కూడా ఫిర్యాదు పత్రం దిల్లీకి పంపారు.
జగన్ లేఖ పై సుప్రీం కోర్టు, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ జగన్: సుప్రీంకోర్టు జడ్జిపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ఏపీ సీఎం
- సుప్రీంకోర్టు ‘సంక్షోభం’: న్యాయమూర్తుల లేఖలో ఏముందంటే..
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం
- ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు తీర్పులు వివాదాలకు దారి తీస్తున్నాయా
- "సీజేఐ వేధించారంటున్న ఆ మహిళ మరి సుప్రీంకోర్టునే ఎందుకు నమ్మారు"
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








