భారత్‌లోకి చైనా వెల్లుల్లి ఎలా వచ్చింది, రైతులు ఎందుకు భయపడుతున్నారు?

చైనా వెల్లుల్లి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్ష్మీ పటేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వంటల్లో ముఖ్యమైన దినుసుగా ఉపయోగించే వెల్లుల్లి విషయంపై గుజరాత్‌లో కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. నిషేధిత చైనీస్ వెల్లుల్లిని భారత్‌లో విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తుండడమే దీనికి కారణం.

రాజ్‌కోట్ జిల్లా గోండాల్ మార్కెట్‌ యార్డులో 'చైనీస్ వెల్లుల్లి'ని విక్రయిస్తున్నారంటూ వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు, వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆ వెల్లుల్లి నమూనాలను పరీక్షల నిమిత్తం వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు సెంట్రల్ ల్యాబరేటరీకి పంపారు.

గోండాల్‌లో పట్టుబడిన వెల్లుల్లి చైనాదా, కాదా? అది గోండాల్‌కు ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

చైనీస్ వెల్లుల్లిలాంటి వెల్లుల్లి, భారతదేశంలోని పర్వత ప్రాంతాలలోనూ లభిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చైనా వెల్లుల్లి

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

ఫొటో క్యాప్షన్, దేశీ వెల్లుల్లి కంటే చైనా వెల్లుల్లి ధర తక్కువ

రైతుల నిరసన దేనికి?

చైనీస్ వెల్లుల్లి సమస్య భారతీయ రైతుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా కనిపిస్తోందంటూ, వాటి విక్రయానికి నిరసనగా గుజరాత్‌లోని వ్యాపారులు, రైతులు ఒకరోజు వేలం ప్రక్రియకు దూరంగా ఉన్నారు.

దేశీ వెల్లుల్లి కంటే చైనా వెల్లుల్లి ధర తక్కువ కావడం వల్ల, అది రాష్ట్ర మార్కెట్లలోకి వస్తే స్థానిక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదని వ్యాపారులు, రైతులు భయపడుతున్నారు.

రాజ్‌కోట్‌కు చెందిన జయంతిభాయ్ వాఘాసియా అనే రైతు బీబీసీతో మాట్లాడుతూ, ‘‘కొన్నేళ్ల క్రితం వరకు దాదాపు 12 ఎకరాల భూమిలో వెల్లుల్లి పండించేవాళ్లం. అప్పట్లో 20 కిలోలకు 500 నుంచి 1,000 రూపాయల వరకు వచ్చేది. దాంతో సాగును తగ్గించాం. మూడేళ్లుగా ధరలు మళ్లీ పెరుగుతుండటంతో ఎక్కువ సాగుచేస్తున్నాం. కానీ ఈ చైనా వెల్లుల్లి మార్కెట్‌లోకి వస్తే మా పంటకు ధర లభించక, నష్టపోవాల్సి వస్తుంది" అన్నారు

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ప్రాంతానికి వెల్లుల్లి ఎక్కువగా పండించే ప్రదేశంగా పేరుంది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో వెల్లుల్లి అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ పంట ఉత్పత్తిలో దేశంలో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది.

34 ఏళ్లుగా రాజ్‌కోట్ మార్కెట్‌యార్డులో వ్యాపారం చేస్తున్న కిషోర్‌భాయ్ వాఘాసియా మాట్లాడుతూ, “వెల్లుల్లి ధర తక్కువగా ఉన్నప్పుడు చైనా వెల్లుల్లి మార్కెట్‌లో కనిపించలేదు. ఇప్పుడు రైతులకు కొంత ధర రావడం ప్రారంభించినప్పుడే ఈ వెల్లుల్లి ఎలా వచ్చిందనేది విచారణ జరపాల్సిన విషయం’’ అన్నారు.

వెల్లుల్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెల్లుల్లి పొడి, వెల్లుల్లి చిప్స్, వెల్లుల్లి పేస్ట్ ఉత్పత్తులఎగుమతిలో భారత్ అగ్రగామిగా ఉంది

తేడా ఏమిటి?

దేశీ వెల్లుల్లి, చైనీస్ వెల్లుల్లి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వీటి మధ్య తేడాల గురించి జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఏఎస్ జేత్వా మాట్లాడుతూ "చైనా వెల్లుల్లి సైజు, దేశీ వెల్లుల్లి కంటే పెద్దగా ఉంటుంది. వాటి రెబ్బలు కొంచెం దూరంగా ఉంటే, స్థానిక వెల్లుల్లి రెబ్బలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి" అన్నారు.

"చైనీస్ వెల్లుల్లి ఘాటు తక్కువగా ఉంటుంది. అదే దేశీ వెల్లుల్లి చాలా ఘాటైన వాసన వస్తుంది. దేశీయ వెల్లుల్లితో పోలిస్తే, చైనీస్ వెల్లుల్లి ధర 30 నుంచి 40 శాతం తక్కువ ఉంటుంది. చైనీస్ వెల్లుల్లి కంటే దేశీ వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది."

వెల్లుల్లి ధరలలో హెచ్చుతగ్గులకు గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఫుడ్ అండ్ డెయిరీ కమిటీ మాజీ ఛైర్మన్ హీరేన్ గాంధీ కారణాలు వివరించారు.

"వెల్లుల్లి ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా, ధరలు పెరుగుతున్నాయి. వెల్లుల్లి పొడి, చిప్స్, పేస్ట్ వంటి ఉత్పత్తులను ఎగుమతి చేయడంలోనూ భారతదేశం అగ్రగామి’’ అన్నారు.

"గుజరాత్‌లోని మహువ నుంచి ప్రతి సంవత్సరం 90,000 మెట్రిక్ టన్నుల వెల్లుల్లి ఎగుమతి అవుతుంది. దీని విలువ సుమారు రూ. 400 కోట్లు. భారతదేశంలో శీతాకాలం, పండుగల సీజన్‌లో ఈ పంటకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ధరలు పెరుగుతున్నాయి’’ అన్నారు.

చైనీస్ వెల్లుల్లిలా పెద్ద రెబ్బలు, తక్కువ ఘాటు ఉన్న వెల్లుల్లి, భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో ఉత్పత్తి అవుతుందని పుణెలోని ఉల్లి, వెల్లుల్లి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విజయ్ మహాజన్ స్పష్టం చేశారు.

"ఈ వెల్లుల్లి రకాలు తక్కువ రోజుల్లో చేతికి వస్తాయి. ఆయా ప్రాంతాలలోని వాతావరణాన్ని బట్టి, ఈ వెల్లుల్లిలో గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మొదలైన రకాలు ఉన్నాయి.’’

వెల్లుల్లి బస్తాలు

ఫొటో సోర్స్, BIPIN TANKARIA

ఫొటో క్యాప్షన్, గోండాల్ మార్కెట్‌యార్డ్‌లో దొరికిన వెల్లుల్లిని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ పండిస్తారని, దీనిని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

పోలీసులు ఏమంటున్నారు?

గోండాల్‌లో చైనీస్ వెల్లుల్లి విక్రయాలపై రైతులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన మార్కెట్‌యార్డు పోలీసులు, వెల్లుల్లి నమూనాలను పరీక్షలకు పంపారు.

"వ్యాపారులు ఈ వెల్లుల్లిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆరా తీస్తే, ముంబై నుంచి ఆర్డర్ చేసినట్లు తెలిసింది. ఆ వ్యాపారి వెల్లుల్లిని ఆర్డర్ చేసిన బిల్లులు, ఇతర పత్రాలను చూపించారు. తదుపరి విచారణ కోసం మేం ముంబైకి ఒక బృందాన్ని పంపాం.’’ అని గోండాల్‌ బి డివిజన్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ జేపీ గోసాయ్ అన్నారు.

"గోండాల్ మార్కెట్‌యార్డ్‌లో దొరికిన అదే రకమైన వెల్లుల్లిని మన దేశంలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ పండిస్తారు. కాబట్టి ఇది ఏ రకమైన వెల్లుల్లో పరిశీలిస్తున్నాం. అలాగే ఇందులో ఏదైనా ఫంగస్ లేదా హానికరమైన పురుగుమందుల అవశేషాలు ఉన్నాయేమో పరిశోధిస్తున్నాం’’ అని చెప్పారు.

భారతదేశంలో రెండు రకాల వెల్లుల్లి పండుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో రెండు రకాల వెల్లుల్లిని సాగు చేస్తారు.

అమెరికాలోనూ ఆందోళన

చైనీస్ వెల్లుల్లి ఆరోగ్యానికి హానికరమని గతంలో అమెరికాలోనూ వివాదం చెలరేగింది. డిసెంబర్ 2023లో చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వెల్లుల్లిపై దర్యాప్తు చేయాలని జో బైడెన్ ప్రభుత్వాన్ని సెనేటర్ రిక్ స్కాట్ కోరారు.

ఆ ఆరోపణల ప్రకారం, చైనా వెల్లుల్లి సాగులో శుద్ధి చేయని మురుగు నీటిని ఉపయోగిస్తున్నారు. చైనీస్ వెల్లుల్లి భద్రత, నాణ్యతను నిర్ధరించే వరకు వాటి వినియోగాన్ని అనుమతించకూడదని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, క్యూబెక్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీకి చెందిన ఆఫీస్ ఫర్ సైన్స్ అండ్ సొసైటీ 2017లో ప్రచురించిన పరిశోధనా పత్రం ప్రకారం, చైనీస్ వెల్లుల్లి ఆహార వినియోగానికి సురక్షితం కాదని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

చైనీస్ వెల్లుల్లిని ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే వంట చేయడానికి ఉపయోగించే ముందు నీటితో సరిగ్గా శుభ్రం చేయాలని ఈ పత్రంలో సూచించారు. మరింత రక్షణ కావాలంటే, వాడుకునే ముందు వేడినీటిలో కడిగితే సరిపోతుందని అన్నారు.

ఉల్లి, వెల్లుల్లి పరిశోధన కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో రెండు రకాల వెల్లుల్లి పండుతుంది. మొదటి రకం వెల్లుల్లి పంట 120 నుంచి 175 రోజులలో చేతికి వస్తే, రెండో రకం 180 నుంచి 200 రోజులలో చేతికి వస్తుంది.

చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్ దేశాలు వెల్లుల్లిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటే, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, యూకే, అమెరికా దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)