మ్యాజిక్ డస్ట్: పొలంలో ఈ పొడి చల్లితే గాలిలోని కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది.. మీ ప్రాంతంలోనూ దొరుకుతుంది
- రచయిత, కెవిన్ కీనే
- హోదా, బీబీసీ స్కాట్లాండ్ పర్యావరణ ప్రతినిధి

స్కాట్లాండ్ దేశం క్లురాస్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో టన్నుల కొద్ది ‘మ్యాజిక్ డస్ట్’ను రాయన్ నెల్సన్ చల్లుతున్నారు.
ఈ పొడి బసాల్ట్ రాయి నుంచి లభిస్తుంది. బసాల్ట్ అనేది ఓ అగ్ని పర్వత శిల. నల్ల రాయిలా కనిపిస్తుంది. ఈ శిలను పొడి చేయొచ్చు.
ఈ రాళ్లు స్కాట్లాండ్ దేశంలోని అనేక క్వారీలలో విస్తారంగా దొరుకుతాయి.
ఈ రాళ్లను పొడిగా చేసి పొలంలో వేయడం వల్ల వాతారణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను ఇది సంగ్రహించుకోవడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది. దీన్ని రాక్ వెదరింగ్ అంటారు.
వాతావరణం నుంచి లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తొలగించాలనుకుంటున్న ఈ కంపెనీ రైతులకు ఈ పొడిని ఉచితంగా అందిస్తోంది.


ఫొటో సోర్స్, BBC/Tern TV
ఈ తరహా సాగు గురించి ఓ వ్యవసాయ మ్యాగజీన్‌లో ప్రకటనను రాయన్ నెల్సన్ చూశారు. తమ పొలాల్లో ఈ రాతి పొడిని చల్లడానికి ఆసక్తిగలవారు ముందుకు రావాలని ఆ ప్రకటనలో ఉంది.
‘20 ఏళ్ల కిందట బీబీసీ బీచ్‌గ్రోవ్ గార్డెన్ ప్రోగ్రామ్‌లో ఈ రాయిని బ్లాస్టింగ్ చేయడం, ఆ టీవీ షో ప్రజెంటర్ జిమ్ మెకాల్ ఈ పొడిని పొలంలో చల్లడం నాకు గుర్తొచ్చింది’ అని రాయన్ నెల్సన్ చెప్పారు.
పొలాల్లో బసాల్ట్ రాతి పొడిని ఎరువులా వాడడం వల్ల కూరగాయలు, పండ్ల సాగులో అధిక దిగుబడి వస్తోందని రాయన్ చెప్పారు.
ఇలా కార్బన్‌ను పొలంలో నిల్వ చేయడం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా, నాణ్యమైన పంట కూడా లభిస్తుందని ట్రయల్స్‌లో భాగంగా తేలిందని రాయన్ నెల్సన్ చెప్పారు.
కార్బన్‌ను సంగ్రహించేందుకు వందల ఏళ్లుగా ఎన్నో విధానాలు అనుసరిస్తున్నారు.
వాటితో పోల్చితే ప్రస్తుతం వీరు ఉపయోగిస్తున్న ఈ విధానం సహజ సిద్ధంగా ఉండటంతో పాటు వాతావరణంలో కర్బన ఉద్గారాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
పొలంలో దీన్ని చల్లేటప్పుడు మంచి ఫలితం రావాలంటే వీలైనంత ఎక్కువ విస్తీర్ణం కవరయ్యేలా ఈ రాయిని బాగా చూర్ణం చేసి చల్లాలి.

సాధారణంగా వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను కొంత మోతాదులో గ్రహించుకుని నేరుగా భూమిపై పడతాయి.
అలా పడిన ఆ వర్షపు చినుకులు ఈ పొడిని తాకగానే రసాయన చర్య జరిగి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ఈ పొడిలో కలిసిపోతుంది.
దాంతో ఆ మేరకు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తొలగిపోతుంది.
'అన్‌డూ'(Undo) కంపెనీ ఈ బసాల్ట్ రాయిని రైతులకు ఉచితంగా అందిస్తోంది. అలాగే, తమ కాంట్రాక్టర్స్‌ను పంపి ఆయా రైతుల పొలాల్లో ఈ పొడిని చల్లిస్తోంది.
పెద్ద పెద్ద కంపెనీలు వాతావరణంలోని కర్బనాన్ని తగ్గించే ప్రాజెక్టులకు నిధులు అందిస్తుంటాయి.
రాతి పొడితో కర్బన సంగ్రహణం ప్రాజెక్ట్ చేపట్టిన ‘అన్‌డూ’కు కూడా బ్రిటిష్ ఎయిర్‌వేస్, మైక్రోసాఫ్ట్, మెక్‌లారెన్ రేసింగ్ వంటి సంస్థలు నిధులు అందిస్తున్నాయి.

వాతావరణ మార్పులపై చేసే పోరాటంలో ఇదో గొప్ప పరిణామంగా 'అన్ డూ' సైన్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ షిన్‌రన్ లియో అభివర్ణిస్తున్నారు.
‘పర్యావరణ మార్పుల కోసం చేస్తున్న కృషిని ఈ టెక్నాలజీ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రాళ్లు విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఖండంలోనూ వ్యవసాయ భూముల్లో వీటిని ఉపయోగించవచ్చు.ఈ టెక్నాలజీ వల్ల వాతావరణంలో నుంచి వందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను అత్యంత వేగంగా తొలగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సిలికా రాయి విరివిగా దొరుకుతుంది. కాబట్టి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాల్సిన అవసరం కూడా ఉండదు’ అని షిన్‌రన్ లియో అన్నారు.
రోడ్లు, భవనాల నిర్మాణానికి కావాల్సిన రాతి కోసం తవ్వకాలు జరిపే గనులలో ఇది ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.
ఈ రాతి పొడిని వీలైనంత మేర రైతుల పొలాల్లో చల్లించి వాతావరణంలో నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడమే తమ లక్ష్యమని 'అన్ డూ' కంపెనీ చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














