వార్ ఆఫ్ ది వరల్డ్స్: రెజ్లర్‌తో వందకు పైగా ‘తన్నులు’ తిని ఆసుపత్రిపాలైన స్టార్ బాక్సర్ ముహమ్మద్ అలీ, అసలు ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే....

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేక్ జోన్స్
- హోదా, బీబీసీ స్పోర్ట్స్
ముహమ్మద్ అలీ. ఈ బాక్సింగ్ చాంపియన్ ఓ మ్యాచ్‌లో వందకుపైగా తన్నులు తిని, ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చిందంటే ఆశ్చర్యం వేస్తుంది. అది కూడా ప్రొఫెషనల్ బాక్సర్‌తో కాకుండా, రెజ్లర్‌తో ఈ తన్నులు తిన్నారంటే వింతగానే ఉంటుంది.
కానీ ఈ మ్యాచే ప్రపంచంలో క్రాస్ ఓవర్ బాక్సింగ్ పోటీలకు బీజం చేసింది. క్రాస్ ఓవర్ బాక్సింగ్ అంటే బాక్సర్‌తో వేరు వేరు రంగాలకు చెందినవారు తలపడటం. ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్‌లకు ముహమ్మద్ అలీ 1976లో ఓ జపాన్ రెజ్లర్‌తో జరిపిన పోరాటమే మూలం.
అందుకే మనం ఇప్పుడు ఫ్లాయిడ్ మేవెదర్ వర్సెస్ కానర్ మెక్‌గ్రెగర్, ఫ్రాన్సిస్ ఎన్‌గానౌ వర్సెస్ టైసన్ ఫ్యూరీ, నేట్ డియాజ్ వర్సెస్ జేక్ పాల్ లాంటి వారి మధ్యన క్రాస్‌ఓవర్ బాక్సింగ్ చూసే అవకాశం కలుగుతోంది.
1976లో జూన్ 26న, అప్పటికే రెండుసార్లు ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయిన ముహమ్మద్ అలీ, టోక్యోలోని బుడోకాన్ ఎరీనాలో 14,500 మంది అభిమానుల సమక్షంలో జపనీస్ రెజ్లర్ ఆంటోనియో ఇనోకితో తలపడ్డారు.
ఈ మ్యాచ్‌కు ముందు చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది.
1975లో అలీకి జపనీస్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచిరో హతా పరిచమయ్యారు.
‘ఓ పదిలక్షల డాలర్ల ఫీజు చెల్లించి, నాతో తలపడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా’ అని అలీ ఆయనను అడిగారు.
ఆ వార్త జపాన్‌లో సంచనలంగా మారడంతో, జపాన్‌లో పేరొందిన రెజ్లర్ ఇనోకి, అతని మద్దతుదారులు అలీతో పోరాటానికి 60 లక్షల డాలర్లను ఇస్తామని ప్రకటించారు.
ఈ ఆసక్తికరమైన ఈవెంట్ గురంచి ‘స్పోర్టింగ్ విట్‌నెస్ పాడ్‌కాస్ట్’కు చెందిన సీన్ ఆల్సోప్, 'వార్ ఆఫ్ ది వరల్డ్స్'గా పేరొందిన ఆ పోటీ గురించి, ఫోటోగ్రాఫర్ క్లాడ్ చార్లియర్‌తో మాట్లాడారు. ఆ పోటీ జరిగిన సమయంలో, 23 ఏళ్ల చార్లియర్ టోక్యోలో నివసిస్తున్నారు.
‘‘ముహమ్మద్ అలీ, ఆంటోనియో ఇనోకిని చూడాలనే ఆశతో బుడోకాన్ ఎరీనా బయట లక్షల మంది ప్రజలు నిలబడ్డారు’’ అని చార్లియర్ ఈ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
చార్లియర్ ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, "ఇనోకి ఎప్పటిలాగే ఊదారంగు వస్త్రాన్ని ధరించి వచ్చాడు. అలీ చేయి ఊపుతూ, అరుస్తూ ఎరీనాలోకి వచ్చాడు. ప్రారంభంలో ఆ పోటీ చాలా ఉత్సాహంగా సాగింది’’ అన్నారు.

రిహార్సల్స్ అనుకుంటే..
అప్పటికే జోఫ్రేజియర్‌తో తలపడిన అలీ మూడు పోటీలు గెలిచారు. దీంతో ఈ పోటీ ప్రపంచంలోనే గొప్ప బాక్సర్‌గా, అత్యుత్తమ అథ్లెట్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అలీకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది.
మొదట ఆ పోటీని రిహార్సల్స్‌గా చేద్దామనుకున్నా, చివరికి అది నిజమైన పోరాటంగా మారింది.
అలీ అప్పటికే టోక్యోలో ఇనోకి ట్రైనింగ్‌ను చూసి ఉన్నాడు. దాంతో ప్రమాదాన్ని పసిగట్టి, పోటీలో కొత్త నియమాలు తీసుకొచ్చారు.
"ఇనోకి నాకొక ఆసక్తికరమైన విషయం చెప్పాడు" అని చార్లియర్ ఈ పాడ్‌కాస్ట్‌లో వివరించారు.
‘‘అలీ ఈ ఫైట్‌ను సీరియస్‌గా తీసుకోవడంలేదని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం షో మాత్రమే అని అతను భావిస్తున్నాడు. కానీ ఇది షో కాదు, మేం నిజంగా పోరాడబోతున్నాం. నేను అతని చేయో, కాలో విరిచేసినా విరిచేస్తాను అని ఇనోకి నాతో అన్నారు. ఇనోకి చాలా శక్తిమంతమైన ఫైటర్’’ అని చార్లియర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలివిగా వ్యవహరించిన రెజ్లర్
అలీ ప్రతినిధులు అంగీకరించిన నిబంధనల ప్రకారం, ఇనోకి ట్యాక్లింగ్, గ్రాప్లింగ్ లేదా స్టాండింగ్ కిక్‌లను ఉపయోగించకూడదు.
కానీ ఇనోకి ఒక లొసుగును కనిపెట్టాడు. నియమాల ప్రకారం అతను నేలపై ఉన్నప్పుడు అలీని కాలితో తన్నొచ్చు.
ఈ నియమాల గురించి ప్రజలకు చెప్పలేదు. దీంతో ఇనోకి తాను కిందపడినప్పుడు, అలీని కాళ్లతో తంతుంటే వాళ్లు గందరగోళానికి గురయ్యారు.
"ఇనోకికి దూరంగా ఉండమని అలీకి ఆయన మనుషులు చెప్పారు. ఎందుకంటే ఇనోకి నిజంగానే అలీపై దాడి చేశాడు. అయితే అలీ ఇది తన షో గా మార్చాలనే ఉద్దేశంతో ఇనోకిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు" అని చార్లియర్ వివరించారు.
"అలీని పదేపదే కాలితో తన్నాడు ఇనోకి. రెండో రౌండ్‌లో, ఆ తర్వాత మూడో రౌండ్‌లో ఇలాగే జరిగింది. ఇనోకి తాను దెబ్బలు తినకుండా మ్యాట్ మీద ఉంటూ, అలీని తన్నడానికి ప్రయత్నించాడు.’’ అని చార్లియర్ చెప్పారు.
"దీంతో అలీకి పిచ్చి కోపం వచ్చింది. అతను ఇనోకితో, 'నువ్వు గొప్ప రెజ్లర్ అనుకున్నాను. కానీ, అసలు ఫైట్ కూడా చేయడం లేదు’ అన్నాడు’’ అని చార్లియర్ గుర్తు చేసుకున్నారు.
ఆరో రౌండ్‌లో, అలీ కాళ్లను దొరకబుచ్చుకుని నేలపైకి లాగేశాడు ఇనోకి. అది నేడు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో కనిపించే ఎత్తుగడే.
‘‘10వ రౌండ్ అయ్యేసరికి అలీ చాలా నొప్పితో బాధపడుతున్నాడు. అతని కాలు దారుణంగా వాచిపోయింది’’ అని చార్లియర్ చెప్పారు.
ఇంతా జరిగాక, 15 రౌండ్ల తర్వాత పాయింట్లు సమానంగా ఉన్నాయని నిర్ణయించి, పోటీని డ్రాగా ప్రకటించారు.
దీంతో ప్రేక్షకులు చాలా అసహనానికి గురయ్యారు. ఈ పోటీని చూడటానికి ఆ రోజుల్లో వారు 5వేల డాలర్లు చెల్లించారు. కానీ మ్యాచ్‌ను ఇలా ముగించడం వారికి అన్యాయంగా అనిపించింది. దాదాపు 14,500మంది ప్రేక్షకులు ఆ మ్యాచ్ చూడటానికి వచ్చారు.
"పోటీ ముగిసే సమయానికి, ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న డబ్బాలు, మిగతా వస్తువులను రింగ్‌లోకి విసిరేయడం ప్రారంభించారు" అని చార్లియర్ చెప్పారు.
ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ పోటీలో కేవలం కేవలం ఆరు పంచ్‌లు మాత్రమే విసిరి, 100 కంటే ఎక్కువసార్లు తన్నులు తిన్న అలీని ఆసుపత్రికి తరలించారు.
'వార్ ఆఫ్ ది వరల్డ్స్' అభిమానులను మెప్పించకపోయినా, అప్పటి నుంచి కాసులు కురిపించే క్రాస్ ఓవర్ బాక్సింగ్ మొదలైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














