ఈ బుజ్జి హిప్పోకు అందరూ ఫిదా, ఎందుకంటే..

మూ డెంగ్

ఫొటో సోర్స్, Khao Kheow Open Zoo/X

ఫొటో క్యాప్షన్, మూ డెంగ్‌ పుట్టినప్పటి నుంచి జూలో సందర్శకుల సంఖ్య రెట్టింపు అయినట్లు నిర్వాహకులు తెలిపారు
    • రచయిత, నిక్ మార్ష్
    • హోదా, బీబీసీ న్యూస్

థాయ్‌లాండ్‌లో ఒక బుజ్జి హిప్పోపొటమస్ అందరినీ అలరిస్తోంది.

రెండు నెలల వయసున్న ఈ ఆడ పిగ్మీ హిప్పో పేరు మూ డెంగ్.

ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోన్న ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు.

జులైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మూ డెంగ్

ఫొటో సోర్స్, Khao Kheow Open Zoo/X

ఫొటో క్యాప్షన్, మూ డెంగ్‌ను చూడటానికి వచ్చే సందర్శకులు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు

మూ డెంగ్‌ను చూడటానికి వచ్చే సందర్శకులు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు. ఆ బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఆయన ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘ఇలా ప్రవర్తించడం క్రూరత్వమే కాదు, ప్రమాదకరం కూడా. మనం ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటికి సురక్షితమైన, సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి’’ అని జూ డైరెక్టర్ నరోంగ్విట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిద్రలో ఉన్న ఆ బుజ్జి హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి.

మూ డెంగ్

ఫొటో సోర్స్, Khao Kheow Open Zoo/X

మూ డెంగ్ స్థావరం చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరోంగ్విట్ తెలిపారు.

అది మేల్కొని ఉన్నప్పుడే దానిని చూడాలని ఆయన కోరారు.

పిగ్మీ హిప్పోలను మరుగుజ్జు హిప్పోలు అని కూడా పిలుస్తారు. ఇవి పశ్చిమ ఆఫ్రికాకు చెందినవి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఈ హిప్పోలను అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో వీటి సంఖ్య 3,000 కంటే తక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా, చాలా చిన్నగా ఉండటంతో ఆన్‌లైన్‌లో చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు.

మూ డెంగ్

ఫొటో సోర్స్, Sephora Thailand/Instagram

ఫొటో క్యాప్షన్, మూ డెంగ్‌ను చూపిస్తూ సౌందర్య ఉత్పత్తుల సంస్థ సోఫెరా ఒక బ్లష్‌ను విడుదల చేసింది

‘‘నాకు మూ డెంగ్(బుజ్జి హిప్పో) పిచ్చి పట్టుకుంది. రోజంతా నేను దాని గురించే ఆలోచిస్తున్నా’’ అని ఎక్స్‌లో ఒక యూజర్ పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం మూ డెంగ్ గురించి తప్పా, ఈ ప్రపంచంలో ఇంకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు’’ అని మరో యూజర్ రాశారు.

బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా 100 కి.మీ దూరంలో ఈ ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ ఉంది. ఈ సెలెబ్రిటీ హిప్పోకు ప్రజల్లో ఉన్న ఆదరణను జూ నిర్వాహకులు వాడుకున్నారు.

అది పుట్టినప్పటి నుంచి వారు చేసిన 150 సోషల్ మీడియా పోస్టుల్లో 128 మూ డెంగ్‌కు సంబంధించినవే.

మూ డెంగ్

ఫొటో సోర్స్, Khao Kheow Open Zoo/X

ఫొటో క్యాప్షన్, మూ డెంగ్ పాపులారిటీ ఇంటర్నేషనల్ మీడియాను ఆకర్షించింది

ఈ హిప్పో చిత్రం ముద్రించిన చొక్కాలు, ప్యాంటులు వంటి రకరకాల వస్తువులు జూ వద్ద అమ్ముతున్నారు. ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

కొన్ని ప్రముఖ సంస్థలు కూడా మూ డెంగ్‌కు ఉన్న ఆకర్షణను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

ప్రధాన స్రవంతి మీడియాలో కూడా మూ డెంగ్ హల్‌చల్ చేస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)