సునీత విలియమ్స్ కోసం వెలుగుతున్న అఖండ దీపం.. సురక్షితంగా భూమికి చేరాలని కోరుకుంటూ సొంతూరిలో పూజలు

ఫొటో సోర్స్, Kushal Batunge
- రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎనిమిది రోజుల కోసం అంతరిక్షం వెళ్లి మూడు నెలలుగా అక్కడే ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ విల్‌మోర్ 2025 ఫిబ్రవరిలో భూమి మీదికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.
వాళ్లిద్దరూ బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
అయితే, దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాళ్ల తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసింది.
వాళ్ల రాక కోసం అమెరికాలోని వాళ్ల కుటుంబాలు, కోట్లాది మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కూడా సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామమైన ఝులాసన్‌లో బంధువులు, అభిమానులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.
సెప్టెంబర్ 19న సునీత విలియమ్స్ 59వ పుట్టినరోజు. ఈ సందర్భంగా వారు ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ ఆమె క్షేమంగా భూమిపైకి రావాలని కోరుకుంటున్నారు.


ఫొటో సోర్స్, Kushal Batunge
"ఆమెకు ఏం జరుగుతుందో మాకు తెలీదు" అని సునీత విలియమ్స్ బంధువులలో ఒకరైన నవీన్ పాండ్యా అన్నారు.
“కొందరు ఆమె క్షేమంగా ఉందని చెబుతుంటే, మరికొందరు ఆమె సురక్షితంగా తిరిగి రాకపోవచ్చని అంటున్నారు. ఆమె ఎప్పుడు, ఎలా తిరిగి వస్తారనే విషయంలో మాకు సరైన సమాచారం లేదు” అని చెప్పారు.
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝులాసన్‌లో దాదాపు 7,000 మంది జనాభా ఉన్నారు.
సునీత విలియమ్స్ తన అంతరిక్ష యాత్రల తర్వాత 2007, 2013లో రెండుసార్లు ఝులాసన్‌కు వచ్చారు.
సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా ఇక్కడే జన్మించారు. ఎంబీబీఎస్ తర్వాత తన ఉన్నత చదువుల కోసం ఆయన 1957లో అమెరికా వెళ్లారు.
ఆయన ఉర్సులిన్ బోనీని వివాహం చేసుకున్నారు. వారికి 1965లో సునీత విలియమ్స్ జన్మించారు.
ఇప్పుడు సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉండిపోవడంతో.. ఝులాసన్ ప్రజలు ఆమె కోసం పూజలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Kushal Batunge
సునీత కోసం ఆలయాలలో పూజలు
2013లో సునీత విలియమ్స్ తన సొంతూరిలోని డోలా మాత ఆలయాన్ని సందర్శించారు. గ్రామస్తులు ఇప్పుడు ఆమె కోసం అదే ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు.
డోలా మాత అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుందని వీరు విశ్వసిస్తారు.
"ఆమె దీర్ఘాయువుతో క్షేమంగా తిరిగి రావాలని మేం ప్రార్థిస్తున్నాం" అని సునీత విలియమ్స్ బంధువు, ఆలయ పూజారి దినేష్ పాండ్యా అన్నారు.
ఆమె క్షేమంగా ఉండాలంటూ పూజలు, హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆమె సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఆలయంలో ఈ ఏడాది జులైలో ఒక దీపం వెలిగించారు. అప్పటి నుంచి అది నిరంతరం అక్కడ వెలుగుతూనే ఉంది.
ప్రతి సాయంత్రం సునీత విలియమ్స్ కోసం ప్రార్థనలు చేసేందుకు మహిళా భక్తులు బృందంగా ఆలయానికి వస్తున్నారు.

ఫొటో సోర్స్, Kushal Batunge
“మాకు మా దేవత మీద చాలా నమ్మకం ఉంది. త్వరలో సునీతను సురక్షితంగా తిరిగి తీసుకువస్తుందని మాకు తెలుసు” అని గ్రామానికి చెందిన గోమతి పటేల్ అన్నారు.
“ఆమె సాధించిన విజయాలను చూసి మేం గర్విస్తున్నాం. నాసా, ప్రభుత్వం కలిసి మా కుమార్తెను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి వాళ్లు చేయగలిగినదంతా చేయాలి" అని డోలా మాతను స్తుతిస్తూ మధు పటేల్ ఒక శ్లోకాన్ని పఠించారు.
సునీత విలియమ్స్ వల్ల గ్రామానికి, భారతీయ సమాజానికి చాలా గౌరవం వచ్చిందని ఆ ఊరివారు చెప్పారు.
గ్రామంలోని స్థానిక పాఠశాల ఆమె పుట్టిన రోజు గుర్తుగా సునీత విలియమ్స్ ఫొటో, ఒక స్పేస్ షటిల్ నమూనాతో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. ఆమెపై ఒక వక్తృత్వ పోటీ నిర్వహించాలని యోచిస్తోంది.
స్కూలు బయట ఒక పెద్ద బోర్డుపై ‘సునీతా పాండ్యా (విలియమ్స్)’ అని ఆమె పేరు గుజరాతీ భాషలో రాసి ఉంది.

ఫొటో సోర్స్, Kushal Batunge

ఫొటో సోర్స్, Kushal Batunge
సునీత చిన్నప్పుడు గ్రామానికి వచ్చినప్పుడు..
ఝులాసన్ సిమెంట్ రోడ్లు, ఆధునిక బంగ్లాలు, సంప్రదాయ గృహాల సమ్మేళనం. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలలాగే ఇక్కడా విదేశాల నుంచి వచ్చిన డబ్బు ప్రభావం కనిపిస్తుంది.
గ్రామానికి చెందిన సుమారు 2,000 మంది అమెరికాలో స్థిరపడ్డారని ఒక అంచనా. 1957లో సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా అమెరికాకు వెళ్లినప్పుడు వలసలు ప్రారంభమైనట్లు చెబుతారు.
1972లో పాండ్యా, ఆయన కుటుంబం మొదటిసారి గ్రామానికి వచ్చినప్పుడు నిర్వహించిన పెద్ద ఊరేగింపు కార్యక్రమాన్ని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
దీపక్ పాండ్యా, మిగతావాళ్లు ఒంటెపై గ్రామంలో ఎలా తిరిగారో 68 ఏళ్ల భరత్ గజ్జర్ గుర్తు చేసుకున్నారు.
“అప్పటికీ చిన్నగా ఉన్న సునీత, మిగతావాళ్లు ఒంటె మీద స్వారీ చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. వాళ్లు గ్రామం అంతా తిరిగారు. ఈ ఊరేగింపు మిగతావారిలోనూ అమెరికా వెళ్లాలనే ఆలోచనను కలిగించింది” అని సునీతా విలియమ్స్ బంధువు, 64 ఏళ్ల నవీన్ పాండ్యా గుర్తు చేసుకున్నారు.
ఈ గ్రామంలో ఉన్న కొద్దిమంది సునీత కుటుంబ సభ్యులలో ఆయన ఒకరు.
ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు.
"ప్రస్తుతం నాకు వాళ్ల కుటుంబంతో సంబంధాలు లేవు. కానీ, మేమంతా ఆమె గురించి ఆందోళన చెందుతున్నాం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Kushal Batunge
కుటుంబ వారసత్వం
సునీత విలియమ్స్ కుటుంబం పేరు మీద ఝులాసన్‌లో ఆస్తులు ఉన్నాయి.
సునీత నానమ్మ, తాతయ్యల పేరు మీద 60వ దశకం చివరలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని దీపక్ పాండ్యా పూర్వీకుల ఇల్లు శిథిలావస్థలో ఉంది.
లైబ్రరీని ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. కానీ, దాని ఖర్చులు, జీతాల కోసం ఒక భాగాన్ని డిపార్ట్‌మెంటల్ స్టోర్‌గా మార్చి అద్దెకు ఇచ్చారు.
దాతల జాబితాలో సునీత విలియమ్స్ పేరు ఉన్న పాఠశాల ప్రార్థనా మందిరంలో ఆమె గ్రాండ్ పేరెంట్స్ ఫొటో ఉంది.
"ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాలకు రూ. 2.50 లక్షలు విరాళంగా ఇచ్చారు" అని పాఠశాల ప్రిన్సిపల్ అంబాలాల్ పటేల్ చెప్పారు.
2007లో ఆ పాఠశాల ఆవరణలో సునీత విలియమ్స్‌ను సత్కరించారు.

ఫొటో సోర్స్, Dinesh Patel
“నేను ఆమె వద్దకు వెళ్లి, నాకున్న పరిమితమైన ఇంగ్లిష్ పరిజ్ఞానంతో నేను మీ సోదరుణ్ని అని చెప్పా. ఆమె నాతో కరచాలనం చేసి, ఓహ్! మీరు నా సోదరులా అన్నారు. నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని చాలాసార్లు గుర్తు చేసుకుంటాను” అని సునీతా విలియమ్స్ బంధువు కిషోర్ పాండ్యా తన 2007 నాటి కలయికను గుర్తు చేసుకున్నారు.
"మేం సునీత కుటుంబంతో మాట్లాడడానికి ప్రయత్నించాం. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. దీపక్ మామయ్య (సునీతా విలియమ్స్ తండ్రి) జీవించి ఉన్నంత వరకు, మేం ఆయనతో ఎప్పుడూ మాట్లాడేవాళ్లం. కానీ ఆయన మరణం తర్వాత వారితో మాట్లాడటం కష్టంగా మారింది” అన్నారు.
ఫిబ్రవరిలో సునీతవిలియమ్స్ స్వదేశానికి తిరిగి రావాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆమె విజయాలు, మాటలు ఇక్కడ చాలా మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
ఆమె వల్లే మా ఊరి పేరు ప్రపంచంలో చాలామందికి తెలిసిందని ఆ గ్రామంలోని యువ న్యాయవాది తరుణ్ లెయువా అన్నారు.
“ఆమె ఒకసారి తన ప్రసంగంలో, మనం ఏ పని చేసినా దాన్ని ప్రేమించాలి. అప్పుడే మనం విజయం సాధిస్తామన్నారు. ఆమెది అమెరికా జీవనశైలి అయినా, ఇప్పటికీ ఝులాసన్‌లోని సాధారణ నివాసిలాగానే ఉన్నారని నేను భావిస్తాను. అందుకే ఆమె మాలో చాలామందికి ప్రేరణగా మారారు” అని తన చార్టర్డ్ అకౌంటింగ్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న మంథన్ లెయువా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














