సునీతా విలియమ్స్-విల్‌మోర్: అమెరికా ఎన్నికల్లో వీళ్లిద్దరు ఎలా ఓటేస్తారంటే...

ఫొటో సోర్స్, EPA
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న అమెరికన్ ఆస్ట్రోనాట్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వీరు ఓటు వెయ్యడం, అది భూమికి చేరుకుని లెక్కించే ఓట్లలోకి చేరడం వెనుక పెద్ద ప్రక్రియ ఉంది.
దీని కోసం ఆబ్సెంటీ బ్యాలెట్ లేదా ముందుగానే ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.
అమెరికాలో వ్యోమగాములు నివసించే ప్రాంతానికి చెందిన కంట్రీ క్లర్క్, నాసా సహకారంతో ఆస్ట్రోనాట్ల ఓటు రిజిస్టర్ అవుతుందని నాసా వెబ్‌సైట్ తెలిపింది.
అంతరిక్షం నుంచి ఓటు వెయ్యడానికి నాసాకు చెందిన “స్పేస్ కమ్యునికేషన్ అండ్ నావిగేషన్(SCaN) ప్రోగ్రామ్”ను ఉపయోగిస్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ సెంటర్‌కు డేటాను పంపించినట్లే అంతరిక్షం నుంచి ఓటు వేసిన బ్యాలెట్లను కూడా పంపిస్తారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే ఆస్ట్రోనాట్లు వేసిన ఓటు నాసాకు చెందిన స్పేస్‌నెట్ వర్క్ సెంటర్‌కు చేరుతుంది. ఇది మేరీల్యాండ్ రాష్ట్రంలోని గ్రీన్‌బెల్ట్‌లో ఉంది.
ఈ నెట్‌వర్క్ ద్వారా భూమి మీద నుంచి 12 లక్షల మైళ్ల దూరంలో ఉన్న మిషన్లతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సమాచారాన్ని పంపించడం, సేకరించే కార్యక్రమం జరుగుతోంది.
ఇంటికి దూరంగా ఉన్న మిగతా అమెరికన్ల మాదిరిగానే ఆబ్సెన్స్ బ్యాలెట్ కోసం ఆస్ట్రోనాట్లు కూడా ఫెడరల్ పోస్ట్ కార్డు దరఖాస్తుని పూర్తి చేసి పంపించాల్సి ఉంటుంది.
అంతరిక్ష కేంద్రంలో తాము ఉన్న ప్రాంతం నుంచి వ్యోమగాములు ఈ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ దరఖాస్తు నింపిన తర్వాత అది నాసాకు చెందిన ట్రాకింగ్ అండ్ డాటా రిలే శాటిలైట్ వ్యవస్థ ద్వారా న్యూ మెక్సికోలోని లాస్ క్రూసెస్‌లో ఉన్న వైట్ శాండ్స్ టెస్ట్ ఫెసిలిటీలో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఏంటెన్నాకు చేరుతుంది.
ఆ బ్యాలెట్ న్యూ మెక్సికో నుంచి జాన్సన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. అక్కడ నుంచి కౌంటీక్లర్క్‌కు చేరుతుంది.
ఓటుకున్న సమగ్రతను కాపాడేందుకు ఆ డేటాను రహస్యంగా ఉంచుతారు. అందులో ఉన్న వివరాలు కౌంటీ క్లర్క్‌కు, అప్లికేషన్ పంపించిన ఆస్ట్రోనాట్‌కు మాత్రమే తెలుస్తాయి.


ఫొటో సోర్స్, NASA
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు ఆస్ట్రోనాట్లు బ్యారీ బుచ్ విల్‌మోర్, సునీత విలియమ్స్ ఉన్నారు.
వీరిద్దరూ 2024 జూన్ 5న ఎనిమిది రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ లో స్పేస్ లోకి ప్రయాణించారు. కానీ ఐఎస్ఎస్‌కి వెళ్లే మార్గంలో వారి అంతరిక్ష నౌకలో హీలియం లీక్ సమస్యను ఎదుర్కొవడంతో తిరిగి అదే మిషన్‌లో తిరిగి రావడం క్షేమం కాదని తేలడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
2025 ఫిబ్రవరిలో వీరిని స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమి మీదకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది నాసా.
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీళ్లిద్దరూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.
“ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం. అమెరికన్ పౌరులుగా అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నాం. నా బ్యాలెట్ కోసం రిక్వెస్ట్ పెట్టాను” అని మిషన్ కమాండర్ బుచ్ విల్‌మోర్ శుక్రవారం అంతరిక్ష కేంద్రం నుంచి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
“నేను ప్రజాస్వామ్యంలో పాల్గొనాలని అనుకుంటున్నాను” అని మిషన్ పైలట్ సునీత విలియమ్స్ అన్నారు.
నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈ-మెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపిస్తుంది.
వాళ్లు దాన్ని పూర్తి చేసి తిరిగి నాసాకు పంపుతారు. నాసా వాటిని ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో, ఆయా ప్రాంతాలకు చెందిన కౌంటీ క్లర్క్‌కు పంపిస్తుంది. ఎన్నికలు పూర్తైన తర్వాత మిగతా ఓట్ల మాదిరిగానే ఈ ఓట్లను కూడా లెక్కిస్తారు.

ఫొటో సోర్స్, NASA
అంతరిక్షంలో ఉన్నవారు ఓటు వేసేందుకు 1997లో టెక్సస్ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. అప్పటి నుంచి అంతరిక్షంలో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్లు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
1997లో నాసా అస్ట్రోనాట్ డేవిడ్ ఓల్ఫ్ మిర్ స్పేస్ స్టేషన్ నుంచి తొలిసారిగా ఓటు వేశారు.
తాజాగా అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగామి కేట్ రూబిన్స్. ఆమె 2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఓటు వేశారు.
ఆస్ట్రోనాట్లు వివిధ మిషన్ల కోసం అంతరిక్షంలోకి వెళ్లడం ద్వారా భూమి దొరికే అనేక సౌకర్యాల్ని నష్టపోతారు.
వాళ్లు భూమి మీద నుంచి చాలా దూరంలో ఉన్నప్పటికీ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు, సామాజిక కార్యక్రమాలు, ప్రజాస్వామ్యంలో తమ పాత్రను పోషించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది.
అమెరికాలో ఏ ప్రాంతానికి చెందిన వ్యోమగాములైనా, అందరూ టెక్సస్ రాష్ట్రంలో ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడే వారు జాన్సన్‌లోని నాసాకు చెందిన ట్రైనింగ్ అండ్ మిషన్ సపోర్ట్ ఫెసిలిటీకి దగ్గరగా ఉండవచ్చు.
రెండు దశాబ్థాలకు పైగా వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం, అక్కడ కొంత కాలం పని చేయడం, తిరిగి రావడం చేస్తున్నారు.
సాంకేతికతలను పరీక్షించడం, అంతరిక్ష ప్రయోగాలను పర్యవేక్షించడం, భూమికి అవతల ఉన్న ప్రపంచాన్ని మరింతగా అన్వేషించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం లాంటివి చేస్తున్నారు.
అంతరిక్ష కక్షలో ఉన్న ప్రయోగశాలలో పని చేస్తున్నవారు స్పేస్ నెట్ వర్క్ ద్వారా తమ కుటుంబాలతో మాట్లాడటంతో పాటు సామాజిక జీవితంలో జరిగే పరిణామాలను తెలుసుకుంటున్నారు.
ఈ సమాచార వ్యవస్థ అభివృద్ధి ద్వారా అంతిమంగా ప్రపంచ మానవాళికి మేలు జరుగుతుంది. అంతే కాకుండా నాసా లాంటి అంతరిక్ష సంస్థలు నిర్వహిస్తున్న ప్రయోగాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














