PM E-DRIVE: ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్ల కొనుగోలు కోసం కొత్త పథకం, సబ్సిడీ ఎంత వస్తుంది? విమర్శలేంటి?

Electric Vehicle

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ కోసం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈవీల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. అదే పీఎం ఈ-డ్రైవ్.

ఈ పథకం కింద ప్రధానంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలు చేసే వారికి రాయితీ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.

కానీ, ఈ పథకం ఇంకా అమలు కావట్లేదని అక్టోబర్ 13న దిల్లీలో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన తెలుగు వ్యక్తి గోపి చెప్పారు. ఈ పథకం కింద సబ్సిడీ కోసం అడిగితే, అది ఇంకా రావట్లేదని షోరూం నిర్వాహకులు చెప్పారని ఆయన తెలిపారు. మరోవైపు, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువగా లేకపోవడం వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపడంలేదని పరిశీలకులు చెబుతున్నారు.

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నొవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్’ (PM E-DRIVE) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ కోసం రూ. 10,900 కోట్ల నిధులను కేటాయించింది.

పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం, తద్వారా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించటం ప్రధాన లక్ష్యంగా.. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వాటికి డిమాండ్‌ను పెంపొందించడానికి ఈ పథకాన్ని రూపొందించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎలక్ట్రిక్ బస్సు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది

పాత పథకాల స్థానంలో...

నిజానికి ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాలను ప్రోత్సహించటం కోసం కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌ 1న ఫేమ్‌-1(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - 1) పథకాన్ని ప్రారంభించింది. మొత్తం రూ. 795 కోట్ల నిధులతో ఈ పథకం నాలుగేళ్ల పాటు అమలైంది.

ఆ తర్వాత రెండో దశలో 2019 ఏప్రిల్‌ 1న రూ.11,500 కోట్లతో ఫేమ్‌-2 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఈ ఏడాది మార్చి 31 వరకు అమలైంది.

ఈ పథకాల కింద విద్యుత్ వాహనాల కొనుగోళ్లకు రాయితీలు అందించారు.

అనంతరం ఎలక్ట్రిక్‌ టూవీలర్లు, త్రీవీలర్లకు మద్దతు ఇచ్చేందుకు ఈఎంపీఎస్ 2024 (ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌- EMPS 2024) పథకాన్ని ప్రారంభించింది. మొత్తం రూ. 778 కోట్ల నిధులు కేటాయించిన ఈ పథకం సెప్టెంబర్‌ 30తో ముగిసింది.

ఈ నేపథ్యంలో కొత్తగా పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకాన్ని కేంద్రం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చింది.

ఈఎంపీఎస్-2024 పథకం కింద ఈ-టూవీలర్లు, ఈ-త్రీవీలర్ల కోసం కేటాయించిన నిధులను పీఎం ఈ-డ్రైవ్ పథకానికి వినియోగిస్తారు.

ఫేమ్-2 పథకం కింద ఎలక్ట్రిక్ కార్లకు కూడా సబ్సిడీలు అందించారు. కానీ, పీఎం ఈ-డ్రైవ్ పథకం నుంచి విద్యుత్ కార్లను మినహాయించారు. అంటే ఈ పథకం కింద ఎలక్ట్రిక్ కార్లకు రాయితీలు ఉండవు.

అంబులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ అంబులెన్సులకూ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది

పీఎం ఈ-డ్రైవ్ పథకం ఏ వాహనాలకు వర్తిస్తుంది?

ఈ పథకం ప్రధానంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కొనుగోళ్లకు, వాణిజ్య అవసరాల కోసం రిజిస్టర్ చేసుకునే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు (విద్యుత్ ఆటోరిక్షాలు, కార్టులు వంటి వాటికి) వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది.

వీటితోపాటు, ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యంలోని రిజిస్టర్డ్ విద్యుత్ టూ-వీలర్లకు కూడా ఈ పథకం కింద రాయితీలు పొందవచ్చు.

ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కొనుగోలు చేసే వారికి కూడా రాయితీ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, అధునాతన బ్యాటరీలు అమర్చిన విద్యుత్ వాహనాలకు మాత్రమే ఈ పథకం కింద రాయితీలు లభిస్తాయి.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ లభిస్తుంది?

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద సబ్సిడీలు ఆయా వాహనాలకు అమర్చిన బ్యాటరీ సామర్థ్యం ప్రకారం అందుతుంది.

అలాగే, ఈ పథకం అమలయ్యే రెండేళ్లలో తొలి ఏడాది ఇచ్చే సబ్సిడీ కన్నా, రెండో ఏడాది ఇచ్చే సబ్సిడీని సగానికి తగ్గించారు.

ఎలక్ట్రిక్ స్కూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఎలక్ట్రిక్ టూ-వీలర్లు

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రెండేళ్లలో గరిష్ఠంగా 24,79,120 ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కొనుగోళ్లకు సబ్సిడీ అందించటం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 1,772 కోట్లు కేటాయించారు.

విద్యుత్ ద్విచక్ర వాహనాలకు (ఈ టూ-వీలర్లకు) తొలి ఏడాదిలో ఒక కిలోవాట్ అవర్ సామర్థ్యానికి రూ. 5,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో రూ. 10,000 మించదు.

ఇక రెండో ఏడాదిలో ఒక కిలోవాట్‌ అవర్ సామర్థ్యానికి రూ. 2,500 చొప్పున సబ్సిడీ ఉంటుంది. మొత్తం రెండో ఏడాదిలో రూ. 5,000 మించదు.

ఎలక్ట్రిక్ రిక్షాలు, ఈ-కార్టులు, L5 ఈ త్రీ-వీలర్లు

విద్యుత్ త్రిచక్ర వాహనాలకు (ఈ త్రీ-వీలర్లకు) పథకం అమలయ్యే తొలి ఏడాదిలో రూ. 25,000 చొప్పున రాయితీ లభిస్తుంది.

ఈ-త్రీవీలర్లకు అందించే సబ్సిడీ రెండో ఏడాదిలో రూ. 12,500 చొప్పున ఉంటుంది.

ఈ విభాగంలో గరిష్ఠంగా 1,10,596 ఈ-రిక్షాలు, ఈ-కార్టులకు మద్దతు అందించడం లక్ష్యంగా రూ. 192 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

ఇక అధిక సామర్థ్యం ఉండే L5 ఈ త్రీ-వీలర్ల విషయంలో మొత్తం 2,05,392 వాహనాలకు మద్దతు అందించడం లక్ష్యంగా రూ. 715 కోట్లు కేటాయించింది.

కారుకి చార్జింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ కార్లకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం చెప్పింది

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద సబ్సిడీలు పొందడం ఎలా?

ఈ-డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాలకు రాయితీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి. ఆధార్ లేకుండా రాయితీ లభించదని కేంద్ర ప్రభుత్వం తన విధివిధానాల్లో స్పష్టం చేసింది.

ఒక ఆధార్ నంబరు మీద ఒక విద్యుత్ వాహనానికి మాత్రమే రాయితీ లభిస్తుంది. ఏ వాహనానికైనా రాయితీ పొందాలంటే అవి కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 కింద రిజిస్టర్ అవ్వాలి.

  • ఈ సబ్సిడీలను సులువుగా, సరళంగా అందించడానికి ఒక మొబైల్ యాప్ (అప్లికేషన్) – పీఎం ఈ-డ్రైవ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది.
  • వాహనం కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుదారు ఆధార్‌ నంబరును పీఎం ఈ-డ్రైవ్ యాప్ ద్వారా ఫేస్ మొడాలిటీని ఉపయోగించి ఆథెంటికేట్ చేస్తారు.
  • కస్టమర్‌కు సంబంధించిన ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు కాపీని డీలరుకు అందించాలి. పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు వంటి వాటిలో ఏదైనా ఒకటి ఇవ్వొచ్చు. ఈ కాపీని పీఎం ఈ-డ్రైవ్ యాప్‌లో డీలర్ అప్‌లోడ్ చేస్తారు.
  • అలాగే, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీలను కూడా డీలర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఈ ప్రక్రియ పూర్తయ్యాక యాప్ ద్వారా.. సబ్సిడీకి సంబంధించిన ఈ-ఓచర్ జనరేట్ అవుతుంది.
  • ఈ-ఓచర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారు ఆధార్ నంబరుకు అనుసంధానమై ఉన్న మొబైల్ ఫోన్ నంబర్‌కు లింక్ వస్తుంది.
  • డీలర్ ఈ లింక్ ద్వారా ఈ-ఓచర్ కలర్ ప్రింట్ తీసి ఇస్తారు. ఈ ప్రింట్ మీద కొనుగోలుదారు సంతకం చేసి డీలరుకు ఇవ్వాలి. డీలర్ కూడా దానిమీద సంతకం చేసి సదరు ఓచరు నకలు ఒకటి వినియోగదారుకు ఇస్తారు.
  • ఇలా వినియోగదారుకు విద్యుత్ కొనుగోలు వాహనం మీద సబ్సిడీ లభిస్తుంది.
  • ఇక సంతకాలు చేసిన ఈ-ఓచర్ కాపీని డీలరు తిరిగి పీఎం ఈ-డ్రైవ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
  • అలాగే కొనుగోలుదారుతో డీలరు ఒక సెల్ఫీ కూడా తీసుకుని ఈ-డ్రైవ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
  • వాహనాల తయారీదారులు ఈ ఓచర్ల ద్వారా ప్రభుత్వం నుంచి రీయింబర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

అయితే, ఈ పథకం కింద తనకు సబ్సిడీ రాలేదని దిల్లీలో ఉండే గోపి చెప్పారు. ఆయన ఎలక్ట్రిక్ వాహనం కొనడం ఇదే తొలిసారి. ఈ పథకం గురించి షోరూంలో అడిగితే, సబ్సిడీ ఇంకా రావట్లేదని, తర్వాత సమాచారం వస్తే చెబుతామని అన్నారని గోపి చెప్పారు.

నగరాల్లో విద్యుత్ బస్సుల కొనుగోళ్లకు మద్దతు

సాధారణ ప్రజానీకం ప్రయాణించే ప్రభుత్వ బస్సుల విషయంలో విద్యుత్ బస్సుల వినియోగాన్ని పెంచడానికి కూడా పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రాధాన్యం ఇచ్చింది.

హైదరాబాద్ సహా పలు నగరాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు మొత్తం 14,028 విద్యుత్ బస్సులు కొనుగోలు చేయడానికి మద్దతు అందించడం కోసం రూ. 4,391 కోట్లు కేటాయించింది.

అలాగే ఎలక్ట్రిక్ అంబులెన్సుల కోసం రూ. 500 కోట్లు, ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం మరో రూ. 500 కోట్లు కేటాయించారు.

చార్జింగ్ స్టేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫాస్ట్ చార్జర్ స్టేషన్లు, సదుపాయాల పెంపు

విద్యుత్ వాహనాలు కొంటాం సరే, దారిలో బ్యాటరీ అయిపోతే ఎలా అనే ఆందోళన ఎక్కువగా ఉంది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జనం తటపటాయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

దేశవ్యాప్తంగా 72,300 ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (ఈవీ పీసీఎస్)లకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది.

ఇందులో భాగంగా విద్యుత్ కార్ల కోసం 22,100 ఫాస్ట్ చార్జర్ స్టేషన్లు, విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 48,400 ఫాస్ట్ చార్జర్ స్టేషన్లు, విద్యుత్ బస్సుల కోసం 1,800 ఫాస్ట్ చార్జర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.

అలాగే, విద్యుత్ వాహనాలకు సంబంధించిన టెస్టింగ్ ఏజెన్సీల సామర్థ్యం పెంచడానికి మరో రూ. 780 కోట్లు కేటాయించింది.

ఛార్జింగ్ స్టేషన్

ఫొటో సోర్స్, Gopi

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఖాన్‌ మార్కెట్ దగ్గర ఓ ఛార్జింగ్ స్టేషన్‌‌లో ‘ఔట్ ఆఫ్ ఆర్డర్’ అని బోర్డు పెట్టారు

‘పన్నులు తగ్గించాలి, ఆ మార్పులు రావాలి’

కొన్ని రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రిక్ బైకులను కొనేందుకు కొంతమంది వినియోగదారులు వెనకాడుతున్నారని విజయవాడకు చెందిన సుధాకర్ చెప్పారు. ఆయన ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని గోపి చెప్పారు.

‘‘దిల్లీలో కొన్ని చోట్ల ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో చాలావరకు పనిచేయట్లేవు. కొన్ని ప్రైవేటు ఛార్జింగ్ స్టేషన్లు కూడా సరిగా పనిచేయట్లేవు. మెట్రో నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకెెలా ఉంటుంది? ప్రభుత్వం ఇలాంటి సమస్యలపై ముందుగా దృష్టిపెట్టాలి’’ అని గోపి చెప్పారు.

అద్దె ఇంటి యజమానులతో సమస్యలు..

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఉండే రాజా కూడా ఇటీవలే ఎలక్ట్రిక్ బైక్ కొన్నారు. వారు అద్దె ఇంట్లో ఉంటారు.

తన వాహనానికి ఛార్జింగ్ పెట్టేందుకు ఇంటి యజమానులు అనుమతించకపోవడంతో తాము ఇల్లు మారాల్సి వచ్చిందని రాజా చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలిపోతాయనే భయం చాలామందిలో ఉందని, ఈ విషయంలో వాహన తయారీ కంపెనీలు, ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)