‘‘మూడు రోజుల్లో మీ అబ్బాయి చనిపోతారు’’ అని ఆ వృద్ధురాలికి చెప్పారు, తర్వాత ఏమైందంటే..

ముంగ్నీ
ఫొటో క్యాప్షన్, తనకు ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నందున మోసగాళ్లకు తేలికగా చిక్కానని ముంగ్నీ భావిస్తున్నారు.
    • రచయిత, ఎలైన్ చోంగ్ & ఎడ్ మెయిన్
    • హోదా, బీబీసీ ట్రెండింగ్

బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో చైనా వృద్ధులను కొందరు మోసం చేస్తున్నారు. ఆ వృద్ధులకు ఆప్తులైనవారు ప్రమాదంలో ఉన్నారని నమ్మించి, వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకుంటున్నారు.

ఇలా మోసపోతున్న వృద్ధుల కేసులు పైదేశాలలో భారీగా నమోదవుతుండటంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నేరస్థులను గుర్తించేందుకు బాధిత కుటుంబాలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

చైనా వృద్ధులను మోసగించేందుకు ఈ ముఠా సభ్యులు కాంటోనిస్ (చైనాలో ఒక ప్రాంతీయ భాష)లో మాట్లాడుతారు. వీరు వృద్ధులను నమ్మించేందుకు వీధినాటకం లాంటి స్క్రిప్ట్‌తో సిద్ధమై, ఆ వృద్ధులకు ఆప్తులైనవారు ప్రమాదంలో ఉన్నారని నమ్మించేలా మాట్లాడతారు. ఈ ముఠాలో సాధారణంగా ముగ్గురు మహిళలు ఉంటారు. ఈ మోసాలను ‘బ్లెస్సింగ్ స్కామ్స్’ అంటున్నారు.

60 ఏళ్ల ముంగ్నీ చైనీస్ మలేషియన్. ఆమె లండన్‌లో నివసిస్తున్నారు. ఆమె యోగా ప్రాక్టీస్ కోసం పశ్చిమ లండన్‌లోని హారో రోడ్డులో వెళుతుండగా.. ఓ మహిళ ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చారు. ఆ మహిళ కాంటోనిస్‌లో మాట్లాడుతూ తన భర్త అనారోగ్యానికి గురయ్యారని, ఎవరైనా సంప్రదాయ చైనా వైద్యం చేసేవారు తెలుసా? అని ముంగ్నీని అడిగారు.

ఇంతలో కాంటోనిస్ మాట్లాడే మరో అపరిచితురాలు ప్రత్యక్షమై, తనకు ఆ వైద్యం చేసేవారు తెలుసని, ఆ వైద్యుడి వద్దకు తీసుకువెళతానని చెప్పారు. ఏడుస్తున్న మహిళకు సాయం చేయాలని ముంగ్నీ భావిస్తుండగానే, మూడో మహిళ ప్రత్యక్షమై, తనకు ఆ వైద్యుడితో పరిచయం ఉందని, ఆయన సాయం చేస్తారేమో చూద్దామని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తుయెట్ ప్రచారం
ఫొటో క్యాప్షన్, తుయెట్ (ఎడమ)

‘నీ కొడుకు ప్రమాదానికి గురై చనిపోతారు’

ఆ ముగ్గురు మహిళలతో కలిసి సదరు వైద్యుడి వద్దకు ముంగ్రీ కూడా వెళ్లారు. ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు. తన ‘మార్మిక శక్తుల’ ద్వారా ముంగ్నీ కూడా ప్రమాదంలో ఉన్నారని తాను కనుగొన్నట్టు ఆ వైద్యుడు ఆమెకు చెప్పారు. పైగా ఆమె కనీసం ప్రస్తావించని ఆమె పెళ్లి సమస్యలు, కుడి కాలులో నొప్పి గురించి కూడా ఆయన చెప్పారు. వీటన్నింటికంటే ఆమెను షాక్‌కు గురిచేసిన విషయం ఏమిటంటే.. ‘‘మరో మూడు రోజుల్లో నీ కొడుకు ప్రమాదానికి గురై చనిపోతారు’’ అని ఆయన చెప్పడం.

ఆ వైద్యుడి ‘దీవెనలు’ తీసుకుంటే ఆమె కొడుకును రక్షించుకోవచ్చని ముంగ్నీకి ఆ ముగ్గురు మహిళలు చెప్పారు.

‘‘సంచిలోకి గుప్పెడు బియ్యం తీసుకుని, అందులో వీలైనంత బంగారం, డబ్బు పెట్టాలి’’ అని ఆ మహిళలు ముంగ్నీకి చెప్పారు. ఈ విలువైన వస్తువులపై ఆయన ఆశీర్వాదం ఇస్తారని తెలిపారు.

దీవెనలు అందించాక, తన వస్తువులు తిరిగి ఇచ్చేస్తారని వారు చెప్పిన మాటలతో తనకు నమ్మకం కుదిరిందని ముంగ్నీ చెప్పారు.

వీరిలో ఒక మహిళ ముంగ్నీ బంగారాన్ని తీసుకువచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. తర్వాత బ్యాంకుకు వెళ్లి ముంగ్నీ ఖాతా నుంచి 4 వేల పౌండ్లు (సుమారు 4,37,000 రూపాయలు) విత్ డ్రా చేశారు. డబ్బు, విలువైన వస్తువులను ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టారు.

సరిగ్గా ఇక్కడే సంచిని మార్చేసి ఉంటారని ముంగ్నీ భావిస్తున్నారు. ‘‘మెరుపు వేగంతో ఈ పని జరిగిపోయింది. ఆమె చేతులు చాలా చురుకుగా కదిలాయి. నేనేమీ చూడలేకపోయాను’’ అని ఆమె చెప్పారు.

దీవెనల మోసగాళ్లు

ఫొటో సోర్స్, New South Wales Police

ఫొటో క్యాప్షన్, ఈ తరహా మోసాలపై అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే పోలీసులు గడిచిన ఏడాదిగా హెచ్చరికలు చేస్తున్నారు.

సంచి తెరిచి చూస్తే...

ముంగ్నీ ఇంటికి తిరిగి వచ్చాక తన చేతిలోని నల్ల సంచిని తెరిచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో తన వస్తువులేవీ లేకపోగా కేవలం ఒక ఇటుక, ఓ కేకు ముక్క, రెండు బాటిళ్ల నీళ్లు మాత్రమే ఉన్నాయి.

‘‘నేను మోసపోయానని తెలుసుకుని మా అబ్బాయికి ఈ విషయం చెప్పాను’’ అని ముంగ్నీ తెలిపారు. ఆమె పోగొట్టుకున్న వాటిలో తల్లి ద్వారా ఆమెకు వచ్చిన తరతరాల నాటి వస్తువులు కూడా ఉన్నాయి.

ఇలాంటి మోసం కారణంగానే తన తల్లి పది వేల పౌండ్లు (సుమారు 11 లక్షల రూపాయలు) పోగొట్టుకున్న తర్వాత ఈ మోసాల (బ్లెస్సింగ్ స్కామ్)పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తుయెట్ వాన్ హుయెన్ మేలో సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టారు.

కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ బ్లెస్సింగ్ స్కామ్స్‌పై అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

తుయెట్ వాన్ హుయెన్ ఫండ్ రైజర్

ఫొటో సోర్స్, Tuyet van Huynh

ఫొటో క్యాప్షన్, మోసానికి గురైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది

‘ మా అమ్మ జాంబీలా మారింది’

ముంగ్నీ యూకేలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లండన్‌లోని ఇస్లింగ్టన్ ప్రాంతంలో ఇలాంటి అనేక కేసులను విచారిస్తున్నట్టు పోలీసులు కూడా వెల్లడించారు.

లూయీషామ్, రాంఫోర్డ్, లివర్‌పూల్, మాంచెస్టర్‌లోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్టు తుయెట్‌కు రిపోర్ట్స్ వచ్చాయి.

తన తల్లిని వారు ఎక్కడ కలిశారో, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీని తుయెట్ సేకరించారు. ‘‘ తన తల్లి జాంబీలా తనకు అందిన ప్రతి సూచనను అనుసరించినట్టు’’ ఫుటేజీలో కనిపించిందని తుయెట్ తెలిపారు.

తనకు దేవుడిపై నమ్మకం లేదని, మూఢనమ్మకాలు లేకపోయినా తనను వారు ఎలా మోసం చేశారో అర్థం కావడం లేదని ముంగ్నీ చెప్పారు.

సీసీ టీవీ ఫుటేజీ

ఫొటో సోర్స్, Tuyet van Huynh

ఫొటో క్యాప్షన్, స్కామర్లు తన తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న ఫుటేజీని తుయెట్ బీబీసీకి చూపించారు.

‘మత్తుమందు ఇచ్చారేమో?’

తన తల్లిని మోసం చేసిన విషయంలో ఏదో దాగుందని తుయెట్ భావిస్తున్నారు. తన తల్లికి ఏదైనా మత్తుమందు ఇచ్చి, ఆమె విలువైన వస్తువులు ఎక్కడున్నాయో మోసగాళ్లు కనిపెట్టారా? అనే కోణంలో తుయెట్ పరిశోధన మొదలుపెట్టారు.

‘‘డెవిల్స్ బ్రీత్ అని పిలిచే డ్రగ్స్ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది’’ అని తుయెట్ భావిస్తున్నారు.

స్కోపోలమైన్‌ను ‘డెవిల్స్‌ బ్రీత్‌’గా పిలుస్తారు. దీనిని ప్రయాణాలలో ఎదురయ్యే ఇబ్బందుల (కళ్లు తిరగడం, వికారం, వాంతులు, తలనొప్పి) నివారణకు ఉపయోగిస్తారు. ఇది తేలికగా మనుషులను ప్రభావితం చేస్తుంది. మనుషుల కదలికలను తాత్కాలికంగా నియంత్రిస్తుంది. ఈ మందును రోడ్డుపై వెళ్లేవారికి, చాలా తేలికగా వారికి ఏమాత్రం అనుమానం రాకుండా మోసగాళ్లు ఇస్తారు.

కొలంబియా పుష్పం
ఫొటో క్యాప్షన్, కొలంబియాలో పెరిగే ఓ పుష్పం నుంచి డెవిల్స్ బ్రీత్ ఔషధాన్ని తయారు చేస్తారు

‘దేనికైనా సిద్ధమే’

స్కోపోలమైన్‌‌నే తన తల్లి విషయంలోనూ, మరో కేసులోనూ వాడారని చెప్పడానికి తుయెట్ దగ్గర ఎలాంటి ఆధారం లేదు. చెప్పినట్టు ఆడేలా చేసే మాదకద్రవ్యాలలో స్కోపోలమైన్‌ ఒకటి. ఈక్వెడార్, ఫ్రాన్స్, వియత్నాంలో దోపిడీలకు, కొలంబియాలో హత్యలకు, లైంగిక దాడులకు దీనిని ఉపయోగిస్తారు.

ఈ మోసగాళ్ల ముఠా చాలా పెద్దదే. అయినా, బాధిత కుటుంబాలు మాత్రం వారిని పట్టుకోవాలనే నిశ్చయంతో ఉన్నాయి.

‘‘వారిని పట్టుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమే అని పోలీసులకు చెప్పాను’’ అని ముంగ్నీ తెలిపారు.

మోసం చేసినవారు చైనీయులు కావడం ఆమెను మరింత బాధపెడుతోంది. ‘‘వారు సొంత మనుషులనే మోసం చేస్తున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)