సముద్రం మధ్య చిన్న పడవలో 67 రోజులు బతికిన వ్యక్తి, చివరకు ఎలా బయటపడ్డారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నాథన్ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యాకు తూర్పున ఉన్న ఓఖోత్స్క్ సముద్రంలో చిన్న బోటులో రెండు నెలలకు పైగా సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్న ఒక రష్యన్‌ను ఎట్టకేలకు రక్షించారు.
ఆయన పేరు మిఖాయిల్ పిచుగిన్ (46) అని అక్కడి మీడియా తెలిపింది. ఆయన ఆగస్టు ప్రారంభంలో సముద్రంలోకి వెళ్లారు.
పిచుగిన్‌ను ఆయన ప్రయాణం ప్రారంభించిన ప్రదేశానికి సుమారు 1,000 కి.మీ దూరంలో మత్స్యకారులు గుర్తించారని అధికారులు తెలిపారు. ఆ బోటులో పిచుగిన్ సోదరుడు, మేనల్లుడి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి.
వారు ముగ్గురూ తిమింగలాలను చూడటానికి(వేల్ వాచింగ్) సముద్రంలోకి వెళ్లారని, రెండు వారాలకు సరిపడా ఆహారం తీసుకెళ్లారని పిచుగిన్ భార్య చెప్పారు.
‘రియా నోవోస్టి’ వార్తాసంస్థతో ఆమె మాట్లాడారు. తన భర్త ఎక్కువ బరువు ఉండటం వల్ల సర్వైవ్ కాగలిగారని ఆమె అభిప్రాయపడ్డారు.
వెళ్లేటపుడు సుమారు 100 కిలోల బరువున్న పిచుగిన్, రక్షించిన సమయంలో (67 రోజుల తర్వాత ) సగం బరువు మాత్రమే ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి.
‘ఆయన బతికే ఉన్నారని తెలియడం ఒక అద్భుతం’ అని రష్యన్ వార్తాసంస్థతో పిచుగిన్ భార్య అన్నారు. తన కూతురు కూడా అదే బోటులో వెళ్లాల్సి ఉందని, కానీ వెళ్లలేదని చెప్పారు.
రియా నోవోస్టి ప్రకారం..ఆ ముగ్గురూ అదృశ్యమైన తర్వాత హెలికాప్టర్‌తో గాలించినా వారి జాడ దొరక లేదు. రష్యాకు తూర్పున ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పంలోని ఓఖోత్స్క్ సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవకు సోమవారంనాడు పిచుగిన్ ఉన్న బోటు కనిపించింది.
లైఫ్ జాకెట్ వేసుకొని గడ్డంతో కనిపించిన వ్యక్తిని మత్స్యకారులు రక్షిస్తుండగా ‘నాలో శక్తి లేదు’ అని అతను అరుస్తూ ఉండటం ప్రాసిక్యూటర్ కార్యాలయం షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది.
అదే బోటులో ఆయన సోదరుడు సెర్గీ (49), మేనల్లుడు ఇలియా (15)ల మృతదేహాలను గుర్తించారని రియా నోవోస్టి తెలిపింది.

ఎలా బతికారు?
తూర్పు ఆసియాలో అత్యంత శీతలమైన ఓఖోత్స్క్ సముద్రంలో ఆయన ఇంతకాలం ఎలా బతికారనే విషయాన్ని రియా నోవోస్టి వార్తా సంస్థకు రష్యన్ నావికుల యూనియన్ ప్రతినిధి నికోలాయ్ సుఖనోవ్ వివరించారు.
కఠిన పరిస్థితులలో చేపలను పట్టుకోవడం, పడవలో మిగిలిన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా బతికి ఉండొచ్చని నికోలాయ్ అన్నారు.
పిచుగిన్ ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు. ఆ బోటును తనిఖీ చేసి, ఘటన జరిగిన తీరును నిర్ధరించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
తప్పిపోయిన వ్యక్తులను ఇలా చాలా రోజుల తర్వాత గుర్తించడం ఇదే మొదటిసారి కాదు.
1960లో పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న పడవలో నలుగురు సోవియట్ సైనికులు 49 రోజులు జీవించి ఉన్నారని రియా నోవోస్టి వార్తాసంస్థకు ఒక నిపుణుడు చెప్పారు. వారిని అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రక్షించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














