అమెరికాలో దెబ్బతిన్న కార్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా?

యాక్సిడెంట్లలో తీవ్రంగా దెబ్బతినే కార్లు
ఫొటో క్యాప్షన్, రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న కారు
    • రచయిత, రేహాన్ దిమిత్రి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ కాకసస్ ప్రాంతంలోని చిన్న దేశం జార్జియా, యూజ్డ్(ఉపయోగించిన) కార్ల అంతర్జాతీయ మార్కెట్‌గా మారింది. ఇక్కడ ఏటా వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి మార్కెట్‌లోని వాహనాల్లో ఎక్కువ భాగం అమెరికాకు చెందినవే. ఇవన్నీ చివరకు రష్యా చేరుతున్నాయి.

జార్జియా రాజధాని టిబిలిసి నగరానికి ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఓపెన్-ఎయిర్ కార్ పార్కులకు అనుకూలమైన విస్తారమైన ప్రాంతం ఉంది.

40 ఫుట్‌బాల్ పిచ్‌లకన్నా పెద్దగా ఉండే ఈ ప్రాంతంలో వేలాది వాహనాలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.

మీకిష్టమైన కారు మోడల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మెర్సిడెస్, జాగ్వార్‌, టయోటాతో పాటు టెస్లా వరకు అన్ని రకాల కార్లూ ఇక్కడ ఉంటాయి.

ఇక్కడున్న అతి పెద్ద కార్‌ పార్కుల్లో ఒకటి కాకసస్ ఆటో ఇంపోర్ట్(CAI)ది. ఈ కంపెనీ అమెరికాలో వాడిన కార్లను వేలంలో కొనుగోలు చేస్తుంది. వాటిలో ప్రమాదాలలో బాగా దెబ్బతిన్న వాహనాలు ఎక్కువగా ఉంటాయి. అమెరికా ఇన్సూరెన్స్ సంస్థలు వాటిని వేలం వేస్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సెకండ్ హ్యాండ్ కార్ల హబ్
ఫొటో క్యాప్షన్, జార్జియాలో సెకండ్ హ్యాండ్ కార్లు

కార్లు జార్జియాకు చేరిన తర్వాత..

తమ నిపుణుల బృందం అమెరికాలోని ఆయా ప్రాంతాల నుంచి కార్లను సేకరించి కంటెయినర్ షిప్‌లో ఎగుమతి చేస్తుందని సీఏఐ చెప్పింది. అమెరికాకు దాదాపు 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లసముద్రం తీరంలోని జార్జియా పోర్టుకు అవి చేరతాయి. దెబ్బతిన్న కార్లను జార్జియాలోని మెకానిక్‌లు బాగుచేస్తారు.

‘‘జార్జియాలో కార్ల పరిశ్రమ పునరుద్ధరణలో మా కంపెనీ పాత్ర చాలా ఉంది. 2004లో మేం బిజినెస్ ప్రారంభించినప్పుడు మొత్తం సోవియట్ యూనియన్ తయారు చేసే వాహనాలే ఉండేవి. లాడా, వజ్ వంటి బ్రాండ్లు కనిపించేవి’’ అని సీఏఐ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గులాష్‌విలి చెప్పారు.

పశ్చిమ దేశాలు ఉత్పత్తి చేసే వాహనాలకున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ కంపెనీ ఈ వ్యాపారం ప్రారంభించిందని, ఇప్పుడు తమ దగ్గర 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

అధికారిక లెక్కల ప్రకారం, గత ఏడాది జార్జియా రూ. 26,000 కోట్ల (3.1 బిలియన్ డాలర్లు)కు పైగా విలువైన కార్లను దిగుమతి చేసుకుంది. రూ. 17 వేల కోట్లకుపైగా విలువైన కార్లను ఎగుమతి చేసింది. కాకసస్‌లోని మాజీ సోవియట్ రిపబ్లిక్‌లు, మధ్య ఆసియా దేశాలకు ఈ ఎగుమతులు ఎక్కువ జరిగాయి. జార్జియా ఎగుమతుల్లో రాగి ఖనిజానిది మొదటిస్థానం కాగా రెండో స్థానంలో కార్లు ఉంటాయి.

రుస్తావిలోని అతిపెద్ద కారు మార్కెట్‌లో కస్టమర్ల రద్దీ భారీగా ఉంటుంది.

అలిషర్ తెజిక్‌బయేవ్ కజకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన, ఆయన స్నేహితుల బృందం టయోటా కార్ల కోసం వెతుకుతున్నారు.

“మేము దాదాపు మూడున్నర ఏళ్లుగా జార్జియాలో కార్లను కొని, ఎగుమతి చేస్తున్నాం. కార్లను కజకిస్తాన్‌కు పంపిస్తాం’’ అని తెజిక్‌బయేవ్ చెప్పారు. ఆయన ఇక్కడి కార్ల వీడియోలను టిక్‌టాక్‌లో పోస్టు చేస్తుంటారు. ఆయనకు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు.

రష్యా కార్ల దిగుమతిపై యుద్ధం ప్రభావం

అమెరికాతో పాటు, యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ సెకండ్ హ్యాండ్ కార్లను, జార్జియా తనకు ఉత్తరాన ఉన్న పొరుగు దేశం రష్యాకు ఎగుమతి చేస్తుంటుంది. జార్జియాకు, రష్యాకు మధ్య సరిహద్దు ఉంది. 2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ఈ ఎగుమతులు అధికారికంగా ఆగిపోయాయి.

రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల అమెరికా, యూరప్ నుంచి వచ్చిన వాహనాలను రష్యాకు, బెలారస్‌కు ఎగుమతి చేయడం లేదని 2023 సెప్టెంబరులో జార్జియా ప్రభుత్వం ప్రకటించింది.

యుక్రెయిన్, రష్యా యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచి తన కంపెనీ రష్యాతో ఏ విధమైన వ్యాపార లావాదేవీలు నిర్వహించడం లేదని డేవిడ్ గులాష్‌విలి చెప్పారు. తమ సంస్థ నుంచి ఒక్క కారు కూడా రష్యాకు ఎగుమతి కావడం లేదన్నారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి కజకిస్తాన్, కిర్గిజిస్తాన్‌, అర్మేనియాలకు కార్ల ఎగుమతులు బాగా పెరిగాయి. ఇవన్నీ రష్యా నేతృత్వంలోని కస్టమ్స్ యూనియన్‌లో సభ్య దేశాలు. అంటే ఆ దేశాల్లో రిజిస్టర్ చేసిన వాహనాన్ని కొద్దిపాటి సుంకాలతో రష్యాకు తరలిస్తుండవచ్చు.

కార్లు రష్యాకు వెళ్తున్నాయని జార్జియా నేషనల్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022లో జార్జియా 7,352 యూజ్డ్ కార్లను కజకిస్తాన్‌కు ఎగుమతి చేస్తే, 2023లో ఆ సంఖ్య 39,896కి పెరిగింది.

కారు రిపేర్
ఫొటో క్యాప్షన్, 30 ఏళ్లుగా కార్ల రిపేర్ పనిచేస్తున్న ఆండ్రియాష్‌విలి

అమెరికాతో పోలిస్తే జార్జియాలో చౌకగా మరమ్మత్తులు..

జార్జియాలో సెకండ్ హ్యాండ్ కార్ల పరిశ్రమ విజయంలో ఆ దేశ భౌగోళిక స్థితి పాత్ర గురించి చెప్పుకోవాలి. నల్లసముద్రం పోర్టుల ద్వారా జార్జియాకు యూరప్‌తో వాణిజ్యానికి వీలు ఉంది. దాని నల్ల సముద్రం పోర్టుల ద్వారా ఐరోపాకు, పొరుగున ఉన్న అజర్‌బైజాన్ తీరం నుంచి బాకు ద్వారా మధ్య ఆసియాకు వెళ్లేందుకు అవకాశం ఉంది. దెబ్బతిన్న కార్ల మరమ్మత్తు చేసేందుకు జార్జియాలో తక్కువ వేతనాలకు మెకానిక్‌లు లభిస్తారు.

‘‘అమెరికాలో దెబ్బతిన్న కార్లను అమెరికాలోనే మరమ్మతు చేసి తిరిగి వాడుకలోకి తీసుకురావడం ఆర్థికంగా కష్టమైన విషయం’’ అని గులాష్‌విలి చెప్పారు.

‘‘మానవ వనరులు చౌకగా లభించే అవకాశం లేకపోవడంతో సర్వీస్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కార్లను తిరిగి రోడ్ల మీదకు తీసుకురావడానికి న్యాయపరమైన ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. పాడైపోయిన కారును అమెరికాలో మరమ్మత్తు చేసి, న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించుకుని మళ్లీ రోడ్డుపైకి తీసుకురావడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. భారీగా ఖర్చవుతుంది. అదే కారును జార్జియాలో ఒక్క నెలలో అతితక్కువ ఖర్చుతో మరమ్మత్తులు పూర్తిచేయవచ్చు’’ అని ఆయన వివరించారు.

టిబిలిసి నగర శివార్లలోని విశాలమైన గోదాంలో ఆండ్రియాష్‌విలి పనిచేస్తున్నారు. ఆయన దాదాపు 30 ఏళ్లుగా కార్లు రిపేర్ చేస్తున్నారు.

‘‘మేం పుస్తకాల ద్వారా ఇది నేర్చుకున్నాం. అప్పట్లో ఇంటర్నెట్ లేదు’’ అని ఆయన చెప్పారు.

‘‘జార్జియాకు దిగుమతయ్యే కార్లలో ఎక్కువగా పెట్రోల్, డీజిల్‌తో నడుస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు, ప్రత్యేకించి హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది’’ అని గులాష్‌విలి చెప్పారు.

“ప్రస్తుతం మేము తీసుకువస్తున్న కార్లలో దాదాపు 30 శాతం హైబ్రిడ్ కార్లు. ఈ కార్ల సంఖ్య భారీగా పెరుగుతోంది’’ అని ఆయన తెలిపారు.

టెస్లాకు అతిపెద్ద రీ-సేల్ మార్కెట్ యుక్రెయిన్ అని, అక్కడ వంద మంది సిబ్బంది ఉన్నారని ఆయన చెప్పారు.

అది ఖరీదైన వ్యవహారమని, చాలా ప్రమాదకరమైనదని గులాష్‌విలి ఆందోళన వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌కు చాలా పికప్ ట్రక్స్‌ను తాము ఎగుమతి చేస్తున్నామని, రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ వాటిని ఉపయోగిస్తోందని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)