సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని గుర్తించాం - డీసీపీ రష్మి పెరుమాళ్

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసింది ముంబయికి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సలీం ఠాకూర్ విగ్రహారాధనపై వ్యతిరేకత, అతివాద మనస్తత్వం పెంచుకున్నారని డీసీపీ చెప్పారు.
ఈ నెల 14 తెల్లవారుజామున సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన దాడి ఘటనపై హైదరాబాద్ పోలీసులు 16న ఒక ప్రకటన చేశారు.
ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 14న 234/2024 కింద ఎఫ్ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోండా మార్కెట్ పోలీసులు.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఆచూకీని గుర్తించారు.
‘‘ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు మహారాష్ట్రలోని ముంబయి సమీపంలోని ముంబ్రాకు చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ (30)గా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. అతను కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ సహా పలువురి ప్రసంగాలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వింటూ విగ్రహారాధనపై ద్వేషాన్ని పెంచుకున్నారని విచారణలో తెలిసింది’’ అని డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు .


ఫొటో సోర్స్, UGC
మహారాష్ట్రలోనూ..
అక్టోబరు 14న తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో విగ్రహం ధ్వంసం జరిగింది.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు సల్మాన్‌పై మహారాష్ట్రలోనూ రెండు కేసులు నమోదైనట్లు తేలింది.
‘‘2022 సెప్టెంబరు 6న ముంబయిలో గణేశ్ మండపంలోకి చెప్పులు వేసుకుని వెళ్లి పూజలను అపహాస్యం చేస్తూ స్థానికులతో వాదనకు దిగడం, 2024 ఆగస్టు 1న మిరా రోడ్డులోని ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి’’ అని రష్మీ పెరుమాళ్ చెప్పారు.
కేసులో విచారణ జరుగుతోందని, ప్రజలు సహకరించాలని విజ్జప్తి చేశారామె. ఎలాంటి ఊహాగానాలు, వదంతులు నమ్మవద్దని కోరారు.

ఫొటో సోర్స్, UGC
సల్మాన్ హైదరాబాద్ ఎందుకు వచ్చాడంటే..
ముంబయికి చెందిన సల్మాన్ అక్టోబరు మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతను వ్యక్తిత్వ వికాస తరగతుల కోసం నగరానికి వచ్చాడని రష్మీ పెరుమాళ్ చెప్పారు.
‘‘సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ సమీపంలోని మెట్రోపొలిస్ హోటల్‌లో ఇంగ్లిష్ హౌస్ అకాడమీ ఆధ్వర్యంలో నెల రోజుల వ్యక్తిత్వ వికాస, ఇంగ్లిష్ స్పీకింగ్ వర్క్ షాప్‌ను ఏర్పాటు చేశారు. అక్రమంగా హోటల్ ఆవరణను అద్దెకు తీసుకుని మునావర్ జమా, ఎండీ ఖలీల్ అహ్మద్ తదితరులు వర్కషాష్‌కు నేతృత్వం వహించారు. దీనికి దాదాపు 151 మంది హాజరయ్యారు. హోటల్‌లోని 50 గదులను అద్దెకు తీసుకున్నారు’’ అని చెప్పారు డీసీపీ.
ఎలాంటి అనుమతులూ లేకుండా వర్క్ షాప్ నిర్వహించారనే ఆరోపణలపై హోటల్ యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులపై గోపాలపురం పోలీసులు కేసు (349/2024) నమోదు చేశారు.
మెట్రో పోలిస్ హోటల్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు సీజ్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించామని డీసీపీ రష్మీ పెరుమాళ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై హోటల్/లాడ్జ్ నిర్వాహకులు కచ్చితంగా విజిటర్ రిజిష్టర్ నిర్వహించాలని, రోజువారీ కార్యకలాపాలను స్థానిక పోలీసు స్టేషన్లకు తెలియజేయాలని ఆమె ఆదేశించారు.
ఈ విషయంపై ఇంగ్లిష్ హౌస్ అకాడమీని ఫోన్ ద్వారా బీబీసీ సంప్రదించింది. వాళ్లు ప్రస్తావించిన రెండు నంబర్లకూ కాల్ చేయగా.. ఎవరూ స్పందించలేదు.
అలాగే మెట్రో పొలిస్ హోటల్‌ను ఫోన్ ద్వారా బీబీసీ సంప్రదించేందుకు ప్రయత్నించింది. ఆ హోటల్ నిర్వాహకులూ అందుబాటులోకి రాలేదు.

గుడి నిర్వాహకులు ఏమంటున్నారు?
‘‘ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే అమ్మవారి విగ్రహంపై దాడి చేసేందుకు వచ్చాడు. గుడిలోకి వెళ్లినప్పుడు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది. అతను ధ్వంసం చేస్తున్నప్పుడు శబ్దాలు వచ్చాయి. ఆ సమయంలో చుట్టుపక్కల ఇళ్లలోని వారు, వాకింగ్‌కు వెళ్లేవారు ఈ చప్పుళ్లు విని ఆలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆలయంపైకి ఎక్కి అక్కడి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు’’ అని ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు చూసే కుటుంబానికి చెందిన సాయి ప్రభాస్ బీబీసీకి చెప్పారు.
సాయి ప్రభాస్ కుటుంబమే దాదాపు 60 ఏళ్లుగా ముత్యాలమ్మ గుడి బాధ్యతలు చూస్తోంది.
‘‘అతను ఆలయంలో చోరీ చేసేందుకు రాలేదు. చోరీకోసం వచ్చారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. వెండి, ఇతర వస్తువులు గుళ్లోనే ఉన్నాయి. నేరుగా అమ్మవారి విగ్రహాన్ని, గుడినే లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు’’ అని సాయి ప్రభాస్ బీబీసీకి చెప్పారు.

ప్రజాప్రతినిధుల సందర్శన
ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటన సోమవారం తెల్లవారేసరికి నగరమంతటా వ్యాపించింది. ఘటనపై హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘ముత్యాలమ్మ ఆలయంలో మతోన్మాదశక్తులు దాడి చేశారు. కొన్ని రోజులుగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఇటీవల అమ్మవారి విగ్రహంపై దాడి చేశారు. నిందితులపై చర్యలు తీసుకునే క్రమంలో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. దేవాలయాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బీబీసీకి చెప్పారు. ఆయన ఆలయాన్ని పరిశీలించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆలయాన్ని పరిశీలించారు.

ఆందోళనలు
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేసిన మాధవీలత ఆలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఆలయం వద్ద బైఠాయించిన మాధవీలత.. మంత్రోచ్ఛారణ చేస్తూ భజనలు చేశారు. అనంతరం సికింద్రాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు.
‘‘చోరీ చేసేందుకు ఆ వ్యక్తి వచ్చాడని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.దాడికి పాల్పడినట్లు చూశాక కూడా చోరీకి వచ్చాడని ఎలా అనుకోవాలి?’’ అని మాధవీలత ప్రశ్నించారు.
ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహంపై దాడి నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనలు కొనసాగాయి. ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఆలయానికి వెళ్లే దారులను మధ్యాహ్నం నుంచి మూసి వేసి, బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.

వరుస దాడుల వెనుక కుట్ర: వీహెచ్‌పీ
హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా హిందూ దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆరోపించారు.
నాలుగు రోజుల కిందట నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని దుర్గాదేవి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని, హిందూ దేవాలయాల ధ్వంసం వెనక ఉన్న కుట్రను బయటపెట్టాలని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ కొద్దిరోజులుగా భాగ్యనగర్‌లోని హిందూ దేవాలయాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఆలయాల్లో దాడులకు పాల్పడుతున్న వ్యక్తులకు మతిస్థిమితం లేదంటూ కేసులను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. ఆలయాల దాడి వెనుక ఉన్న కుట్రను నిఘా సంస్థలు వెంటనే గుర్తించాలి.’’ అని బాలస్వామి అన్నారు.
‘నివేదిక ఇస్తాం’
ముత్యాలమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖాధికారులు పరిశీలించారు. ఈ ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్నా, పరిశీలించడానికి వచ్చామని బీబీసీకి చెప్పారు.
‘‘మేం ఆలయాన్ని పరిశీలించినప్పుడు ముత్యాలమ్మ విగ్రహం పూర్తిగా విరిగిపోయిన స్థితిలో ఉంది. గేటు కూడా విరిగిపోయింది. ఈ విషయంపై దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక ఇస్తాం’’ అని వారు తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














