దాదాపు పదేళ్లు జైలులో గడిపి, నిర్దోషిగా విడుదలయ్యాక కొన్ని నెలలకే ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా మృతిచెందారు. అనారోగ్య కారణాలతో ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరిన సాయిబాబా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్లపాటు జైలులోనే ఉన్న ఆయన 2024 మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు.
సాయిబాబాకు కిందటి నెల 28వ తేదీన గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టింది. తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్‌తో బాధపడ్డారు. డాక్టర్లు చీము తొలగించినప్పటికీ ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని శుక్రవారం (10.10.2024) ఆయన సహచరి వసంత తెలిపారు. ఇక శనివారం ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని, అంతర్గత రక్తస్రావంతోపాటు పొత్తికడుపులో వాపుతో ఆయన బాధపడ్డారని, బీపీ పడిపోయిందని డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాయిబాబా కోలుకోలేకపోయారని వసంత తెలిపారు.
సాయిబాబా వయసు 57 సంవత్సరాలు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు.


ఫొటో సోర్స్, ANI
పదేళ్లు జైలులోనే..
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ- అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) కింద 2014లో సాయిబాబాను అరెస్ట్ చేశారు.
ఆయనకు మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయంటూ అనేక అభియోగాలు మోపారు.
2017లో కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధరించి జీవిత ఖైదు విధించింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సరైన ఆధారాలూ లేవంటూ ఆయన్ను విడుదల చేసింది. కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏదైనా భావజాలానికి మద్దతుదారుగా ఉండడం యూఏపీఏ చట్టం కిందకు రాదని పేర్కొంది.
ప్రొఫెసర్ సాయిబాబా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయనకు 90 శాతం వైకల్యం ఉంది. ఈ కేసు కారణంగా జీఎన్ సాయిబాబా తన జీవితంలో దాదాపు పదేళ్లపాటు కోర్టులు, జైల్లోనే గడిపారు.
''నేను ఈ పదేళ్లలో చాలా కోల్పోయాను. నా స్టూడెంట్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. తరగతులకు దూరమయ్యాను. నేనెప్పుడూ టీచర్‌గానే ఉన్నా, దాని ప్రాముఖ్యం నాకు తెలుసు. నేను జైల్లో ఉన్నా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు, వారితో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి'' అని సాయిబాబా గతంలో చెప్పారు.
ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?
దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్.
ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.
2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొంత కాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.కేసుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది.
పోలీసులు సాయిబాబాను అరెస్టు చేయడంతో ఆయనను దిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
బాంబే హైకోర్టు ఈ కేసులో తీర్పు చెబుతూ సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
జైలు నుంచి బయటికి వచ్చినప్పటినుంచి ఆరోగ్య సమస్యలతో దిల్లీలోనూ హైదరాబాద్‌లోనూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటూ ఉన్నారు.
సాయిబాబా జైలులో ఉన్నంత కాలం ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















