ఈ భారీ వినాయక విగ్రహం పొలాల మధ్యన ఎందుకు ఉంది, దీనిని ఎవరు చెక్కించారు?

భారీ వినాయక విగ్రహం
ఫొటో క్యాప్షన్, ఈ భారీ వినాయక విగ్రహానికి 900 ఏళ్ల చరిత్ర ఉంది
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ న్యూస్ తెలుగు

హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలోని జడ్చర్ల నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆవంచ గ్రామం. ఆ ఊరు దాటి మట్టిదారిలోకొంచెం ముందుకు వెళితే పొలాల మధ్యన ఓ భారీ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంటుంది.

పచ్చని పొలాల మధ్యన ఏకశిలా వినాయకుడు దర్శనమిస్తారు.

ఓ బండరాయిపై ముందు భాగంలో వినాయకుడిని చెక్కి, వెనుకవైపు చెక్కకుండా అలాగే వదిలేశారు.

బీబీసీ ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు వినాయక విగ్రహం చుట్టూ కొన్ని ఇనుప స్తంభాలు ఉన్నాయి. పై కప్పు లేదు.

విగ్రహానికి పంచె మినహా మరే అలంకరణా కనిపించలేదు.

‘‘గతంలో రేకుల షెడ్డును నిర్మించాం. కానీ గాలివానకు కొట్టుకుపోయింది. కేవలం ఆ ఇనుప స్తంభాలే మిగిలాయి’’ అని గ్రామస్థుడొకరు చెప్పారు.

చుట్టుపక్కల ఊళ్ల నుంచి అడపాదడపా కొంతమంది భక్తులు, సందర్శకులు వచ్చి విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉంటారు.

ఇంతకీ ఈ ఏకశిల గణనాథుడి విగ్రహం ఇక్కడ ఎందుకు ఉంది..?

దీని చరిత్ర ఏమిటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వినాయక విగ్రహం నేలపైనుంచి 21 అడుగుల ఎత్తు ఉంది.
ఫొటో క్యాప్షన్, వినాయక విగ్రహం నేలపైనుంచి 21 అడుగుల ఎత్తు, దాదాపు 15 అడుగుల వెడల్పు ఉంది.

విగ్రహం ఎప్పటిది?

ఆవంచ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలంలో ఉంది.

వినాయకుడి విగ్రహం నేలపైనుంచి 21 అడుగుల ఎత్తు ఉంటుంది. భూమిలోపల ఎంత లోతుకు ఉందో తెలియలేదు. వెడల్పు దాదాపు 15 అడుగుల వరకు ఉంది.

ఈ విగ్రహం ఎప్పటిదనే దానికి స్పష్టమైన చారిత్రక ఆనవాళ్లు గానీ, శాసన ఆధారాలు గానీ ఇప్పటివరకు ఎక్కడా లభ్యం కాలేదని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.

ఈమని శివనాగిరెడ్డి
ఫొటో క్యాప్షన్, రెండో ఉదయన చోళుడు సమయంలోనే ఆవంచ వినాయక విగ్రహం చెక్కించారంటారు ఈమని శివనాగిరెడ్డి

విగ్రహ శైలి, ఆవంచ గ్రామ చారిత్రక ఆనవాళ్లు పరిశీలించినప్పుడు విగ్రహం ఎప్పుడు చెక్కి ఉండొచ్చన్నదాన్ని కొంత వరకూ ఊహించవచ్చని ప్రముఖ ఆర్కియాలజిస్టు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి బీబీసీతో చెప్పారు.

‘‘క్రీ.శ. 1033 నుంచి 1175 వరకు కందూరు చోళుల పాలన జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.శ. 1100-1104 మధ్య మొదటి ఉదయన చోళుడి పాలన జరిగింది. ఆ సమయం ఆయన కుదురుకోవడానికే సరిపోతుంది కాబట్టి భారీ విగ్రహం చెక్కించడానికి అవకాశం చాలాచాలా తక్కువ.

తర్వాత 1136-1172 మధ్య రెండో ఉదయన చోళుడి పాలన నడిచింది..

ఆవంచకు కొంత దూరంలో ఉన్న కందూరులోనూ ఓ చిన్న గణేశుడి విగ్రహం ఉంది. కొల్లాపూర్ ప్రాంతంలో దొరికిన మరో విగ్రహం మహబూబ్ నగర్ మ్యూజియంలో పెట్టారు. అలాగే పానగల్లులోనూ అసంపూర్తిగా ఓ విగ్రహం ఉంది. ఇవన్నీ రెండో ఉదయన చోళుడు సమయంలో చెక్కించినట్లు చారిత్రక ఆనవాళ్లున్నాయి.

నల్లగొండ సమీపంలోని ఉదయ సముద్రం ఆయనే తవ్వించాడని చరిత్ర చెబుతోంది.

ఇలా అన్నింటినీ పరిశీలించినప్పుడు ఆవంచలోని విగ్రహం కూడా రెండో ఉదయన చోళుడి సమయంలోనే చెక్కించారని అర్థమవుతోంది. ఆ విగ్రహానికి దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది’’ అని బీబీసీకి చెప్పారు శివనాగిరెడ్డి.

మరోవైపు ఆవంచ గ్రామంలో కొన్ని ప్రాచీన శిల్పాలు రోడ్డు పక్కన కనిపించాయి.

ఆవంచలో శిల్పం
ఫొటో క్యాప్షన్, ఆవంచలో రోడ్డుపక్కన శిల్పం

ఎవరీ కందూరు చోళులు..?

‘‘కందూరు చోళులు ప్రస్తుత మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ లోని కొంత భాగం కలుపుకొని పాలన సాగించారు’’ అని శివనాగిరెడ్డి వివరించారు.

వీరు కల్యాణి చాళుక్యులకు సామంతులైనప్పటికీ, స్వతంత్రంగానే పాలన నడిచింది.

వీరి పాలన మొదలైనప్పుడు...అంటే 1033లో కల్యాణి చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడు పాలన సాగిస్తున్నారు.

చోళులకు ఒక శాఖగా కందూరు చోళులను భావిస్తారు. వీరు తెలుగు నేలపై పాలన సాగిస్తుండటంతో వీరిని కందూరు చోళులు లేదా తెలుగు చోళులు అని పిలిచేవారు.

ఆవంచ గ్రామానికి సమీపంలోని కందూరు వీరి రాజధాని.

1148లో కల్యాణి చాళుక్యులను కాకతీయ రాజులు ఓడించడంతో కందూరు చోళులు కాకతీయ సామ్రాజ్యానికి సామంతులుగా మారినట్లు చారిత్రక ఆధారాలున్నాయి’’ అని చెప్పారు శివనాగిరెడ్డి.

హరగోపాల్
ఫొటో క్యాప్షన్, కల్యాణి చాళుక్య రాజు కుమార తైలపుడి వినాయక విగ్రహాన్ని చెక్కించి ఉంటారని శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

కల్యాణి చాళుక్యులే చెక్కించారా..?

తెలంగాణ కొత్త చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వినాయక విగ్రహ చరిత్రపై మరో అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘క్రీ.శ.1113లో కల్యాణి చాళుక్య రాజు కుమార తైలపుడి పాలన నడిచింది. ఆ సమయంలో ఆవంచ ప్రాంతం కల్యాణి చాళుక్యులకు రాజధానిగా ఉండేది.

రాజధాని విశిష్టతను తెలియజేసేలా ఒక విగ్రహం ఉండాలన్న ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని చెక్కించడానికి ఆయనే పూనుకుని ఉండొచ్చు’’ అని హరగోపాల్ అన్నారు.

విగ్రహాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ?

విగ్రహాన్ని పరిశీలిస్తే...బండరాతిపై చెక్కిన గణేశుడి ప్రతిమ లలితాసనంలో ఉంటుంది. దానిని పూర్తిగా చెక్కలేదు.

‘‘సహజంగా బయట కనిపించే గణేశుడి ఫోటోలలో నాలుగు చేతులు ఉంటాయి. కానీ మనకు ఇక్కడ రెండు చేతులు మాత్రమే కనిపిస్తాయి. మరో రెండు చేతులను శిల్పి చెక్కినట్లు లేరు’’ అని చెప్పారు శ్రీరామోజు హరగోపాల్.

చెవి కూడా ఒకవైపు మాత్రమే పూర్తి ఆకారం వచ్చింది. మరోవైపు స్పష్టంగా లేదు.

కుడి వైపున కాలు, కాళ్ల వేళ్లు, చేతుల వేళ్లు, కిరీటం, జంధ్యం, దంతం, కింది భాగంలో ఉండే ఎలుక, పీఠం.. ఇలా చాలా భాగాలకు పూర్తి రూపు లేకుండా అసంపూర్తిగా కనిపిస్తుంటుంది ఈ విగ్రహం.

ప్రస్తుతం కళ్లకు స్థానికులు తొడుగులు అమర్చారు. అవి కూడా పూర్తయ్యాయా.. లేదా.. అన్నది పరిశీలించేందుకు బీబీసీకి వీలుకాలేదు.

అయితే, తాము 15 ఏళ్ల కిందట పరిశీలించినప్పడు కళ్లు పూర్తిగా చెక్కి లేవని ఈమని శివనాగిరెడ్డి చెప్పారు .

డిఎన్వీ ప్రసాద్
ఫొటో క్యాప్షన్, వినాయక విగ్రహం కల్యాణి చాళుక్యుల శైలిని పోలి ఉందని స్తపతి డీఎన్వీ ప్రసాద్ చెప్పారు.

పూర్తిగా ఎందుకు చెక్కలేదు?

శిల్పశాస్త్రం ప్రకారం విగ్రహ శైలి ఉత్తమ పంచతాళంలో ఉందని ప్రముఖ స్తపతి డీఎన్వీ ప్రసాద్ బీబీసీతో అన్నారు.

కందూరు చోళుల కాలంలో తయారైన ఈ విగ్రహం కళ్యాణి చాళుక్యుల శిల్ప శైలిని పోలి ఉందని ఆయన అన్నారు.

డీఎన్వీ ప్రసాద్ హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన భారీ రామానుజ విగ్రహానికి స్తపతిగా వ్యవహరించారు.

విగ్రహం పూర్తిగా మలచకుండా సగంలోనే నిలిచిపోవడానికి చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేనప్పటికీ, ఏవైనా ఇబ్బందులు ఏర్పడి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘సగంలోనే నిలిపివేయాలని ఏ శిల్పి విగ్రహం మొదలుపెట్టరు. బహుశా ఏవో కారణాల వల్ల ఆగిపోయి ఉంటుంది. అప్పుడు ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు కారణం కావొచ్చు.ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకు యుద్ధాలు సంభవించో.. కరవు కాటకాలు వచ్చి.. శిల్పులను పోషించలేకనో.. లేదా ఆ శిల్పి బృందం వేరే చోటుకు వెళ్లిపోయో.. సగంలోనే ఆగిపోయి ఉండొచ్చు’’ అని ప్రసాద్ అన్నారు.

ఈ విషయంపై ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ 1148లో కాకతీయుల యుద్ధం విగ్రహ నిర్మాణంపై ప్రభావం చూపి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ఐశ్వర్య గణపతిగా పేరు..

ఆవంచలో కొలువుదీరిన గణపతిని ఐశ్వర్య గణపతిగా స్థానికులు పిలుస్తున్నారు.

ఐశ్వర్య గణపతి అనే పేరు స్థానికంగా పెట్టుకున్నారని, వినాయకుడికి ఉన్న 32 రకాల పేర్లలో ఐశ్వర్య గణపతి పేరు లేదని చెప్పారు శ్రీరామోజు హరగోపాల్.

మరోవైపు గణేశుడి ఆలయం నిర్మించేందుకు ఆరు ఎకరాల స్థలం అందుబాటులో ఉందని స్థానికులు బీబీసీకి చెప్పారు.

విగ్రహం ఉన్న ప్రాంతం గతంలో పాండు అనే వ్యక్తి పొలం ఉండేది. తనకు ఉన్న రెండెకరాలతోపాటు మరో వ్యక్తికి చెందిన నాలుగు ఎకరాలు ఆలయ నిర్మాణం కోసం విక్రయించినట్లు పాండు బీబీసీకి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)