వేలు నాచ్చియార్: బ్రిటిష్ వారిని జయించిన తొలి భారతీయ రాణి, దసరా రోజు యుద్ధంలో ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, PAN MCMILLAN
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకులు
వేలు నాచ్చియార్ 18వ శతాబ్దంలో, దిండికల్‌లో హైదర్ అలీని కలిశారు. తాళాలకు, బిర్యానీలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని ఈ పట్టణం అప్పట్లో దక్షిణ భారతంలోని మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేది.
ఉత్తరాన కృష్ణా నది, తూర్పువైపు తూర్పు కనుమలు, పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ విస్తరించి వున్న మైసూర్ రాజ్య పాలకుడు హైదర్ అలీ. ఆ రాజ్యంలో ఎక్కువ భాగం ఇప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో విస్తరించి ఉంది.
1773లో తన భర్త ముత్తు వడుగనాథ్ పెరియవుడయ తేవర్‌ను కోల్పోవడం, రాజధాని శివగంగై ఈస్టిండియా కంపెనీ చేతిలోకి వెళ్లిపోవడంతో, వేలు నాచ్చియార్ తన చిన్న కూతురు వేలాచ్చితో వచ్చి హైదర్ అలీని ఆశ్రయం, సాయం కోరారు.
ఈ సమావేశం హైదర్ అలీ, వేలు నాచ్చియార్ మధ్య పరస్పర సహకారానికి నాంది పలికింది. ఆ తర్వాతి తరంలో టిప్పు సుల్తాన్ కూడా దానిని కొనసాగించారు.
అసలు ఈ వేలు నాచ్చియార్ ఎవరు? ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? విజయదశమి (దసరా) రోజు ఏం జరిగింది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

యువరాణి నుంచి రాణి వరకు..
వేలు నాచ్చియార్ తల్లిదండ్రులు రామనాథపురం రాజ్యాన్ని పాలించేవారు.
1730లో జన్మించిన వారి ఏకైక సంతానమైన వేలు నాచ్చియార్‌కు గుర్రపు స్వారీ, విలువిద్యతో పాటు వలారి వంటి యుద్ధ కళల్లోనూ శిక్షణ ఇప్పించారు.
ఆమె ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూతో సహా పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. వేలు నాచ్చియార్‌కు పదహారేళ్ల వయసులో, శివగంగై యువరాజుతో వివాహమైంది.
వారు 1750 నుంచి 1772 వరకూ, అంటే రెండు దశాబ్దాలకు పైగా శివగంగైను పాలించారు.

ఫొటో సోర్స్, TWITTER @VERTIGOWARRIOR
భర్త హత్య, హైదర్ అలీతో సమావేశం
1772లో ఆర్కాట్ నవాబు బ్రిటిష్ వారితో కలిసి శివగంగైపై దాడి చేసి, 'కలైయార్ కోవిల్ యుద్ధం'లో వేలు నాచ్చియార్ భర్తను చంపేశారు.
రాణి వేలు నాచ్చియార్, ఆమె కూతురు సమీపంలోని ఆలయంలో ఉండడంతో ఆ దాడి నుంచి బయటపడ్డారు. మరుదు సోదరులైన పెద్ద మరుదు, చిన్న మరుదు వారిని రక్షించి, అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. వేలు నాచ్చియార్ తన భర్త మృతదేహాన్ని కూడా చివరిచూపు చూసుకోలేకపోయారు.
18, 19వ శతాబ్దాల సైనిక చరిత్ర నిపుణులైన శుబేంద్ర ఇలా రాశారు. ''రాణికి నమ్మకస్తురాలు, అంగరక్షకురాలైన ఉడయాళ్, ఇతర మహిళా యోధులు వేలు నాచ్చియార్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తప్పించి, వారు అక్కడే దాక్కున్నారు.''
నవాబు మనుషులు ఉడయాళ్‌ను పట్టుకున్నారు. రాణి జాడ చెప్పాలంటూ వేధించినప్పటికీ ఆమె చెప్పలేదు. దీంతో ఆమె తల తెగిపోయింది.
రాణి వేలు నాచ్చియార్ అడవులు, గ్రామాల గుండా నిస్సహాయంగా తిరుగుతూ, బ్రిటిష్ వారి నుంచి శివగంగైని కాపాడుకోవడానికి తనకు ఇప్పుడు మద్దతుదారులు, సహాయకులు అవసరమని గ్రహించారు.
మరుదు సోదరులు నమ్మకస్తులైన వారితో సైన్యాన్ని నిర్మించడం ప్రారంభించారు. కానీ, బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి అది ఏమాత్రం సరిపోదు.
మైసూరు పాలకుడు హైదర్ అలీకి బ్రిటిష్ వారితో కానీ, ఆర్కాట్ నవాబుతో కానీ అంత మంచి సంబంధాలు లేవు. కాబట్టి, ఆయన సాయం కోరాలని రాణి వేలు నాచ్చియార్ నిర్ణయించుకున్నారు. మైసూరుకి ప్రయాణం మొదలుపెట్టారు.
శివగంగై నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండికల్‌లో హైదర్ అలీని వేలు నాచ్చియార్ కలిశారు. హైదర్ అలీతో ఆమె ఉర్దూలో మాట్లాడారు. ఆమె ధైర్యం, సంకల్పం ఆయన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.
వేలు నాచ్చియార్‌ను దిండికల్ కోటలో ఉండమని హైదర్ అలీ కోరారు. అక్కడ ఆమెను రాణిలా చూసేవారు. ఈ స్నేహానికి గుర్తుగా నాచ్చియార్ కోసం హైదర్ అలీ అక్కడ ఒక ఆలయం కూడా నిర్మించారు.

ఫొటో సోర్స్, GOSHAIN
తిరుచ్చి కోట ముట్టడి
పరస్పర అవసరాల వల్ల హైదర్ అలీ, వేలు నాచ్చియార్‌ల మధ్య పొత్తు ఏర్పడిందని చరిత్రకారులు మణికందన్ పేర్కొన్నారు.
తన రాజ్యాన్ని తిరిగి పొందాలంటే వేలు నాచ్చియార్‌కు సైనిక సాయం కావాలి. అలాగే, ఈ ప్రాంతంలో బ్రిటిష్ వలసవాద శక్తిని సవాల్ చేసేందుకు, ఇదొక అవకాశంగా హైదర్ అలీ భావించారు.
బ్రిటిష్ వారిపై వేలు నాచ్చియార్ చేస్తున్న యుద్ధంలో మద్దతుగా నిలవాలని హైదర్ అలీ నిర్ణయించుకున్నారు. వేలు నాచ్చియార్‌కు నెలకు 400 పౌండ్లు, ఆయుధాలతో పాటు సయ్యద్ ఖార్కి నేతృత్వంలో 5,000 మంది పదాతి, అశ్వదళాలతో మద్దతును అందించారు.
''ఈ దళం సాయంతో రాణి వేలు నాచ్చియార్ శివగంగైలోని వివిధ ప్రాంతాలను జయించడం మొదలుపెట్టారు. ఆమె 1781లో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న తిరుచిరాపల్లి కోటకు చేరుకున్నారు'' అని శుబేంద్ర రాశారు.
''బ్రిటిష్ వారికి అదనపు మిలిటరీ సాయం అందకుండా హైదర్ అలీ అడ్డుకున్నారు. కానీ, కోటలోకి ప్రవేశించేందుకు రాణి వేలు నాచ్చియార్‌కు దారి కనిపించలేదు. ఉడయాళ్ త్యాగానికి గుర్తుగా, ఆమె పేరుమీద రాణి వేలు నాచ్చియార్ ఒక మహిళా దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళ కమాండర్ అయిన కుయిలీ, కోట ద్వారాలు తెరవడానికి ఒక ప్లాన్‌ను ప్రతిపాదించారు'' అని రాశారు.
''విజయదశమికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఆ రోజు ఊరి ఆడవాళ్లంతా గుడికి వెళ్తారు. వాళ్లతో కలిసి లోపలికి వెళ్దాం. ఉడయాళ్ దళంలోని కొంతమందితో కలిసి, ఆయుధాలు కనపడకుండా కోటలోకి ప్రవేశిస్తా. ఆ తర్వాత మీకోసం మేం కోట ద్వారాలు తెరుస్తాం అని కుయిలీ చెప్పారు'' అని ఆయన పేర్కొన్నారు.
దీంతో, రాణి వేలు నాచ్చియార్ ముఖంలో చిరునవ్వు కనిపించింది.
''కుయిలీ, నువ్వు ఏదో మార్గం వెతుకుతావ్, అసాధ్యురాలివే'' అని వేలు నాచ్చియార్ అన్నారు.
ఈ యుద్ధంలో కుయిలీకి ఏమైంది?
విజయదశమి రోజున, చుట్టుపక్కల గ్రామాల మహిళల్లో కలిసిపోయి కుయిలీ తన బృందంతో ఆ పెద్ద గుడిలోకి వెళ్లారు.
ఆ తర్వాత తంతు మొదలైంది. సరైన సమయం చూసి, కుయిలీ ''వీరవనితల్లారా లేవండి'' అని అరిచారు.
ఉడయాళ్ దళానికి చెందిన స్త్రీలు వెంటనే పైకి లేచి, కత్తులు దూసి, కాపలాగా ఉన్న బ్రిటిష్ వారిని గమనించుకుంటూ ద్వారం వైపు కదిలారు.
ద్వారం వద్ద ఉన్న కాగడాతో, తమకు తాము మంటలు అంటించుకుని సైనికులున్న ఆయుధాగారంలోకి ప్రవేశించారు.
అకస్మాత్తుగా కోట నుంచి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఆ తర్వా కొద్ది నిమిషాల్లోనే కోట ద్వారాలు తెరుచుకున్నాయి. ఇద్దరు ఉడయాళ్ దళ సభ్యులు గుర్రాలపై రాణి వేలు నాచ్చియార్ సైన్యం వేచిచూస్తున్న చోటుకి వచ్చారు.
''రాణి! తలుపులు తెరుచుకున్నాయి. బ్రిటిష్ ఆయుధాగారాన్ని పేల్చేశారు. ఇక దాడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది'' అని ఒక మహిళ వేలు నాచ్చియార్‌తో చెప్పారు.
''అది సరే, నా బిడ్డ కుయిలీ ఎక్కడ?'' అని రాణి నాచ్చియార్ ప్రశ్నించారు.
దీంతో ఆ మహిళ కళ్లు నేలచూపులు చూశాయి.
''బ్రిటిష్ ఆయుధాగారాన్ని ధ్వంసం చేయడం కోసం మా నాయకురాలు తన జీవితాన్ని త్యాగం చేశారు'' అని వారు రాణికి సమాధానమిచ్చారు.
ఆ మాట విని గుర్రంపై కూర్చున్న రాణి వేలు నాచ్చియార్ నిశ్చేష్టులయ్యారు. అప్పుడు సయ్యద్ ఖార్కి, నాచ్చియార్‌తో ''మనం ఆమె త్యాగాన్ని వృథా పోనివ్వకూడదు. దాడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ఆదేశాల కోసం చూస్తున్నాం'' అన్నారు.

ఫొటో సోర్స్, HISTORY LUST
బ్రిటిష్ వారిని జయించిన తొలి భారత రాణి
రాణి వేలు నాచ్చియార్ తనను తాను తమాయించుకుని, దాడికి ఆదేశించారు. కోట లోపల, కల్నల్ విలియమ్స్ ఫ్లాటర్టన్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరత ఎదురైంది.
వేలు నాచ్చియార్, హైదర్ అలీల సంయుక్త దళాలు 1781 ఆగస్టులో ఎట్టకేలకు కోటను స్వాధీనం చేసుకున్నాయని రచయిత సురేశ్ కుమార్ పేర్కొన్నారు.
భారత మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి 77 ఏళ్ల ముందే బ్రిటిష్ వారిపై విజయం సాధించిన భారతదేశపు మొదటి రాణి వేలు నాచ్చియార్.
ఆ తర్వాత పదేళ్ల పాటు ఆమె శివగంగైని పాలించారు. అనంతరం తన కుమార్తె వేలాచ్చికి రాజ్యాన్ని అప్పగించారు.
తన శత్రువుల బలహీనతలను వాడుకోవడంలో నేర్పరి వేలు నాచ్చియార్ అని చరిత్రకారులు మణికందన్ చెప్పారు. ఈ ప్రాంతంలో బ్రిటిష్ వలసవాదుల అధికారాన్ని సవాల్ చేసేందుకు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌తో పొత్తు పెట్టుకోవడమే ఆమె వ్యూహచతురతకు ఉదాహరణగా పేర్కొన్నారు.
వేలు నాచ్చియార్ యోధురాలిగా ప్రసిద్ధి పొందినప్పటికీ, ఆమెకు ప్రజల పట్ల అపారమైన ప్రేమ.
ఆమె తన ప్రజలను ప్రేమించే ధర్మబద్ధమైన పాలకురాలని చరిత్రకారులు వి.పద్మావతి పేర్కొన్నారు.
పాలకవర్గ వేధింపులకు గురవుతున్న దళితులకు ఆశ్రయం కల్పించాలనే నిర్ణయం ఆమె కరుణకు నిదర్శనమన్నారు.
ఆర్.మణికందన్ మాట్లాడుతూ ''పుట్టుకతోనే ఆమె కథానాయిక'' అన్నారు.

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS
యుద్ధం తర్వాత ఏమైంది?
ఆ విజయం తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు వేలు నాచ్చియార్ రాజ్యాన్ని పాలించారు. కష్టకాలంలో అండగా నిలిచిన సహచరులకు రాజ్యంలో కీలక పదవులు ఇచ్చారు. హైదర్ అలీ సాయానికి గౌరవార్థకంగా సర్ఖానీలో ఒక మసీదును నిర్మించారు.
హైదర్ అలీకి వేలు నాచ్చియార్ సాయం చేశారని, బ్రిటిష్ వారితో జరిగిన రెండో మైసూర్ యుద్ధంలో ఆయనకు సాయంగా తన సేనలను కూడా పంపించారని జెహెచ్ రైస్ 'ది మైసూర్ స్టేట్ గెజిటీర్'లో రాశారు.
హైదర్ అలీ మరణానంతరం ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్‌తోనూ వేలు నాచ్చియార్ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. ఆయన్ను తన సోదరుడిగా భావించేవారు. టిప్పు సుల్తాన్‌కు సింహాన్ని బహుమతిగా ఇచ్చారు.
''సైన్యాన్ని బలోపేతం చేసుకోవడం కోసం వేలు నాచ్చియార్‌కు టిప్పు సుల్తాన్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను అందించారు'' అని మహిబ్బుల్ హసన్ తన పుస్తకం 'హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్'లో రాశారు.
టిప్పు సుల్తాన్, తాను చాలా యుద్ధాల్లో ఉపయోగించిన కత్తిని వేలు నాచ్చియార్‌కు బహుమతిగా పంపారు.
వేలు నాచ్చియార్ కుమార్తె వేలాచ్చి 1790 నుంచి 1793 వరకూ పాలించారు. 1796లో వేలు నాచ్చియార్ శివగంగైలో మరణించారు.
వేలు నాచ్చియార్‌ను తమిళ చరిత్రలో 'వీర మంగై'గా చెబుతారని హంసధ్వని అళగర్‌స్వామి రాశారు.
ఆమె గౌరవార్థం 2008లో తపాలా స్టాంప్‌ను విడుదల చేశారు. 2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శివగంగైలో వీర మంగై వేలు నాచ్చియార్ స్మారకాన్ని ప్రారంభించారు. రాణి వేలు నాచ్చియార్ ఆరడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు.
జయలలిత హయాంలో, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వీరత్వానికి గుర్తుగా మణిమండపం నిర్మాణం కూడా ప్రారంభమైంది.
ఈ స్మారక చిహ్నం దిండికల్‌లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దిండికల్‌లోనే హైదర్ అలీ, వేలు నాచ్చియార్ మధ్య చిరకాల స్నేహం చిగురించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














