హెల్త్: 70 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత ఆరోగ్య బీమా, పొందడం ఎలా....

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, National Health Authority

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో 70 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకానికి సెప్టెంబర్ 11, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో సహా 4.5 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది.

దీని కోసం సీనియర్ సిటిజన్లందరికీ ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తారు. ఈ పథకం కింద ఎవరెవరు ప్రయోజనం పొందవచ్చు? ప్రైవేట్ ఆరోగ్య బీమా ఉన్నవారికీ ఇది వర్తిస్తుందా? లాంటి విషయాలు తెలుసుకుందాం....

బీబీసీ న్యూస్ తెలుగు

ప్రస్తుతమున్న 'ఆయుష్మాన్ భారత్' ఏమిటి?

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా 2018 సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రారంభించారు.

దేశంలోని అల్పాదాయ వర్గాలైన 40 శాతం మంది జనాభాకు ఆరోగ్య బీమా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అర్హత కలిగిన ఒక్కో కుటుంబానికి, ఏడాదికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేలా దీన్ని రూపొందించారు.

దేశంలోని 10 కోట్ల కుటుంబాలు, అంటే దాదాపు 50 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. కేంద్రం లెక్కల ప్రకారం, ఇది దేశ జనాభాలో 40 శాతం.

అర్హులైన కుటుంబాలకు ఈ పథకం కింద ఒక కార్డు జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆస్పత్రులు, బీమా కంపెనీల అనుసంధానంతో ఈ పథకం అమలవుతుంది.

ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం పొందవచ్చు.

పథకంలో చేరడానికి ముందే అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఈ పథకం కింద ఉచితంగా వైద్యం పొందవచ్చు. దేశంలోని ఏ ఆస్పత్రిలో అయినా ఈ పథకం కింద చికిత్స చేయించుకోవచ్చు.

2018లో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు

ఫొటో సోర్స్, Getty Images

మరి కొత్త పథకం ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై)ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నారు.

ఈ పథకం విస్తరణలో భాగంగా, 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు.

మళ్లీ అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత విస్తృతం చేస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రయోజనం ఎవరికి, ఎంత?

ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన వారంతా ఈ బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. అందుకోసం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తారు.

ఈ కొత్త పథకం గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ''సమాజంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయాయి. అందువల్ల, వృద్ధుల సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణలో ఇదో ముందడుగు'' అన్నారు.

ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉంటే, వారికీ ఈ రూ.5 లక్షల బీమా పంపిణీ అవుతుంది. అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకంలో లేని 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు.

ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

'బీమా పంపిణీ'కి అర్థమేంటి?

ఇది కుటుంబానికి అందించే బీమా. అందువల్ల కుటుంబంలోని వృద్ధులకు ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబంలో ఇద్దరు 70 ఏళ్లు పైబడి ఉంటే, ఈ రూ.5 లక్షల బీమా ఇద్దరికీ పంపిణీ అవుతుంది.

ఎవరు అర్హులు కారు?

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలైన (సీజీహెచ్‌ఎస్), ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ మెడికల్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్), సాయుధ దళాల ఆయుష్మాన్ పథకం (సీఏపీఎఫ్) వంటి బీమా పథకాలకు అర్హులైన 70 ఏళ్లు దాటిన వారందరూ ప్రస్తుతం వర్తిస్తున్న స్కీమ్‌లోనే కొనసాగవచ్చు. లేదా ఈ కొత్త పథకంలో చేరొచ్చు. అయితే, వీటిలో ఏదో ఒక పథకం కింద మాత్రమే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఏయే ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చు?

నేషనల్ హెల్త్ కమిషన్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం దిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్డులు జారీ చేయలేదు. కానీ, ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది.

ఈ పథకం కింద వైద్య చికిత్స కోసం ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. దీనికయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. రోగులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు.

ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారి సంగతేంటి?

ప్రైవేట్ కంపెనీల ఆరోగ్య బీమా ఉన్న వృద్ధులకు కూడా ఇది వర్తిస్తుందని, ఈ స్కీమ్‌ ప్రకటన సమయంలోనే స్పష్టం చేశారు.

ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, వర్కర్స్ కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో అర్హులుగా ఉన్నప్పటికీ, 70 ఏళ్లు పైబడిన వారందరూ ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.

దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా?

ఈ పథకం త్వరలోనే అమల్లోకి వస్తుందని, సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

''ఇదో భారీ ప్రాజెక్ట్. తొలివిడతగా ఈ ప్రాజెక్టుకు రూ.3,437 కోట్లు కేటాయించాం. ఇది డిమాండ్ ఆధారిత ప్రాజెక్ట్. డిమాండ్ పెరిగితే, దానికి అనుగుణంగా కేటాయింపులు కూడా పెరుగుతాయి'' అని ఆయన చెప్పారు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇందులో ఉన్న సవాళ్లేంటి?

దేశంలోని చాలా మంది వైద్యులు ఈ ప్రాజెక్టుని స్వాగతించారు. అయితే, ప్రస్తుతమున్న ఆయుష్మాన్ భారత్‌ పథకంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సూచించింది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ, ''ఈ స్కీమ్‌ వల్ల ఎవరు లాభపడ్డారో ఒకసారి కాగ్ రిపోర్ట్ చూడండి. ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని అవకతవకలు జరిగాయో తెలుసుకోండి. ప్రభుత్వం ముందుగా దీనిపై వివరణ ఇవ్వాలి'' అన్నారు.

ఇది మంచి ప్రాజెక్ట్ అని దిల్లీలోని గంగారాం ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మోసిన్ వాలి అన్నారు.

''దేశ జనాభా రీత్యా, రోజురోజుకీ ఆస్పత్రుల్లో రోగులు పెరిగిపోతున్నారు. ఈ పథకం అమల్లో డబ్బులు డిమాండ్ చేయడం వంటి సమస్యలు ఎదురైతే, ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి. తద్వారా రోగులపై ప్రభావం పడకుండా ఉంటుంది'' అన్నారాయన.

అయితే, పుణెలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ అమితాబ్ బెనర్జీ వంటి వారు దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ''ఇది అన్ని వర్గాల ప్రజలను, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా అనిపించడం లేదు. భారత్‌లో యువత ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ జీవించాల్సిన యువతను కూడా ఈ పథకం కిందకు తీసుకురావాలి'' అన్నారు.

''అలాగే, 70 ఏళ్లు పైబడిన వారి చికిత్స ఖర్చుతో కూడుకున్నది. రూ.5 లక్షలు సరిపోవు. ఆయుష్మాన్ భారత్ పేదల కోసం తెచ్చిన పథకం. ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన సంపన్నులను కూడా ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. ఈ పథకం లేకపోయినా వారు చికిత్స పొందగలరు'' అని ఆయన అన్నారు.