టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లు పోతే తిరిగి పొందడం ఎలా?

విద్యార్థులు ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, జక్కుల బాలయ్య, జి.వి.సాయినాథ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

వరద వంటి విపత్తులు, అగ్ని ప్రమాదాల సమయంలో విద్యార్హత ధ్రువపత్రాలు కొట్టుకుపోయే, కాలిపోయే ప్రమాదం ఉంది.

అలాంటప్పుడు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల డూప్లికేట్ పత్రాలు పొందడం ఎలా? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం..

విద్యార్హతల ధ్రువపత్రాలను పోగొట్టుకున్నప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో మళ్లీ వాటిని పొందొచ్చు.

దీనికోసం నిర్ణీత పద్ధతుల్లో దరఖాస్తు చేసి, అవసరమైన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పదో తరగతి సర్టిఫికెట్ పోతే

పదో తరగతి ధ్రువపత్రం చాలామందికి అత్యంత కీలకం. పదో తరగతిలో ఉత్తీర్ణత, పొందిన మార్కులను ధ్రువీకరించడానికే కాకుండా బర్త్ సర్టిఫికెట్‌గానూ అది పనిచేస్తుంది.

పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతున్న ప్రస్తుత కాలంలో చాలామంది వద్ద ప్రత్యేకంగా జనన ధ్రువీకరణ పత్రం ఉంటే ఉండొచ్చు కానీ ఒకప్పుడు పదో తరగతి సర్టిఫికెటే బర్త్ సర్టిఫికెట్‌గా పనిచేసేది.

అంత కీలకమైన పదో తరగతి ధ్రువపత్రం పోయినట్లైతే డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్ఎస్‌సీ బోర్డు లేదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌గా కూడా దీనిని వ్యవహరిస్తారు.

పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్ పోతే ముందుగా మీరు ఏ పాఠశాలలో చదువుకున్నారో ఆ పాఠశాలకు వెళ్లి, అక్కడి ప్రధానోపాధ్యాయుడిని కలిసి డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం లేఖ రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

సదరు విద్యార్థి పేరు, తండ్రి పేరు, ఏ సంవత్సరంలో పరీక్ష రాశారు వంటి వివరాలను ప్రధానోపాధ్యాయుడికి రాసిన లేఖలో పొందుపరచాలి.

మీ దగ్గర పాత సర్టిఫికెట్‌ జిరాక్స్ కాపీ ఉంటే దానికి జత చేయాల్సి ఉంటుంది.

టెన్త్ సర్టిఫికెట్

ఫొటో సోర్స్, bseaps.in

స్కూల్ హెడ్‌మాస్టర్ ఈ లేఖకు విద్యార్థి అప్పటి నామినల్ రోల్ కాపీని జతచేసి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవైఈవో)కి పంపిస్తారు.

డీవైఈవో నుంచి డీఈవోకి, అక్కడి నుంచి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు, ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌కి ఆ దరఖాస్తు వెళ్తుంది. అక్కడ పరిశీలన అనంతరం డూప్లికేట్ సర్టిఫికెట్ మంజూరు అవుతుంది.

''దరఖాస్తుదారు పరీక్షకు అటెండ్ అయిన నామినల్ రోల్ స్కూల్లో ఉంటుంది. స్కూల్ హెచ్ఎం ఆ కాపీని ఈ లెటర్‌కి జత చేసి డిప్యూటీ ఈవోకి పంపిస్తారు. అక్కడి నుంచి డీఈఓ, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి వెళ్తుంది. అక్కడ ఒకసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత మార్క్స్ లిస్ట్ విడుదల చేస్తారు'' అని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) యూవీ సుబ్బారావు చెప్పారు.

కొత్తగా జారీ అయ్యే ఆ సర్టిఫికెట్ దరఖాస్తుదారుకి నేరుగా పంపించరు. పాఠశాలకు వస్తుందని, అక్కడి నుంచి దరఖాస్తుదారు తీసుకోవాలని ఆయన వివరించారు.

టెన్త్ క్లాస్, విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

''అది కూడా నేరుగా పంపించరు. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కి, ఇక్కడి నుంచి డీఈఓ, అక్కడి నుంచి డిప్యూటీ ఈఓకి, ఆ తర్వాత స్కూల్ హెచ్ఎంకి వస్తుంది. సదరు అభ్యర్థి స్కూల్ హెచ్ఎం దగ్గర నుంచి మార్క్స్ లిస్ట్ తీసుకోవాలి. దీనికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. ఇందుకు ఎక్కడా రుసుము వసూలు చేయరు. పూర్తిగా ఉచితంగానే అందిస్తారు'' అని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు బీబీసీకి వివరించారు.

ఒకవేళ సదరు అభ్యర్థి లేదా దరఖాస్తుదారు వద్ద జిరాక్స్ కాపీ కూడా లేనట్లయితే అప్పుడు పోలీస్ స్టేషన్‌ నుంచి ఎఫ్‌ఐఆర్ కాపీ అవసరమవుతుందని డీఈవో సుబ్బారావు చెప్పారు.

ఎలాంటి జిరాక్స్ కాపీలు లేనప్పుడు, సర్టిఫికెట్ల మిస్సింగ్‌పై ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. విచారణ అనంతరం, నిర్ణీత గడువు తర్వాత పోలీసు వారు నో ట్రేసింగ్ కాపీ అందిస్తారు. దానిని జత చేసి పాఠశాలకు వెళ్లి డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు అందజేయాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్ సర్టిఫికెట్‌..

ఇంటర్మీడియట్ డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.

వరదలు, అగ్నిప్రమాదాల వంటి విపత్తులలో సర్టిఫికెట్ పోగొట్టుకున్నా, మరే ఇతర కారణాల వల్ల సర్టిఫికెట్ పాడైపోయినా, చిరిగిపోయినా తిరిగి దరఖాస్తు చేసుకుని ఇంటర్ మార్క్స్ లిస్టును పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో bieap.apcfss.in వెబ్‌సైట్‌లో ఇంటర్ బోర్డు నుంచి డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్ బోర్డ్

ఫొటో సోర్స్, bie.ap.gov.in

వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన తర్వాత, 'స్టూడెంట్స్' సర్వీసెస్ ఆప్షన్‌ను ఉంచుకోవాలి. ఆ తర్వాత డూప్లికేట్/ట్రిప్లికేట్ పాస్ సర్టిఫికెట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అనంతరం మరో వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వివరాలు నమోదు చేసి, సెర్చ్ చేయాలి. అప్పుడు సదరు విద్యార్థి చదివిన కాలేజీ వివరాలు, మార్కుల వివరాలు వస్తాయి.

ఆ తర్వాత, సర్టిఫికెట్ లాస్ట్/డ్యామేజ్ అయిందా అనే ఆప్షన్స్‌లో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.

అనంతరం, వివరాలు నమోదు చేసి, నిర్ణీత ఫీజు చెల్లించాలి.

ఆ తర్వాత ఇంటర్ బోర్డు నుంచి మీరు చదువుకున్న కాలేజీకి మీ మార్క్స్ లిస్ట్ వస్తుంది. కాలేజీకి వెళ్లి మీ సర్టిఫికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లోనూ అప్లయ్ చేసుకునే వీలుంది.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, bie.ap.gov.in

ముందుగా పోలీస్ స్టేషన్‌‌లో మిస్సింగ్ సర్టిఫికెట్స్ కోసం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ సేవా కేంద్రానికి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పోలీస్ స్టేషన్ జారీ చేసే నో ట్రేసింగ్ కాపీ, ఫీజు చలానా కాపీతో పాటు కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్‌కి లేఖ రాసి అందజేయాలి.

అక్కడి నుంచి అది టెన్త్ సర్టిఫికెట్ తరహాలోనే వివిధ స్థాయిలను దాటి ఇంటర్ బోర్డుకి వెళ్తుంది.

అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత డూప్లికేట్ మార్క్స్ లిస్ట్ మంజూరవుతుంది. అనంతరం డూప్లికేట్ సర్టిఫికెట్ కాలేజీకి వస్తుంది. ప్రిన్సిపల్ సంతకం చేసిన అనంతరం దరఖాస్తుదారు దానిని పొందవచ్చు.

ఆంధ్ర యూనివర్సిటీ

ఫొటో సోర్స్, services.andhrauniversity.edu.in

డిగ్రీ, పీజీ, లేదా ఇతర సర్టిఫికెట్లు పోయినప్పుడు ఆఫ్‌లైన్‌లో ఇదే పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.

వివిధ యూనివర్సిటీలు వేర్వేరు పద్ధతుల్లో డూప్లికేట్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఈ సర్టిఫికెట్లను పొందవచ్చు.

మరిన్ని వివరాలకు మీరు చదివిన యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

కొన్ని వర్సిటీలు త్వరితగతిన సర్టిఫికెట్ల జారీకి తత్కాల్ వంటి సేవలను కూడా అందిస్తున్నాయి.

లేదంటే మీరు చదివిన కాలేజీకి వెళ్లి, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)