ఆహార వ్యర్థాల ‘అప్‌సైకిల్’ అంటే ఏమిటి? భవిష్యత్‌లో ఆహార కొరత రాకుండా ఇదే మంచి పరిష్కారమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షార్లట్ లిట్టన్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
కోపెన్‌హేగన్‌లోని రెఫ్‌షెలూన్ ప్రాంతంలో ఉన్న నౌకాశ్రయంలోని ఓ రెండంతస్తుల భవనం కిచెన్‌లో చాక్లెట్‌ను తయారు చేస్తుంటే.. మేడ పైభాగంలో కస్టమర్లకు టాకోస్, ప్రోటీన్ బార్‌లను అందిస్తున్నారు.
ఇది సాధారణ రెస్టారెంట్ కాదు. ఆహారాన్ని అప్‌సైకిల్ చేయాలన్న రాస్మస్ మంక్ ఆలోచన నుంచి పుట్టిన రెస్టారెంట్. రాస్మస్ మంక్ ప్రముఖ చెఫ్.
మన ఆహారం భవిష్యత్ మనం ఇప్పుడు తినకుండా పారేస్తున్న దానిలోనే ఉందని నమ్మేవారిలో మంక్ ఒకరు.
ప్రపంచంలో సుమారు 8 శాతం గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు మనం వృథా చేస్తున్న, పారేస్తున్న ఆహారమే కారణం. ఇది విమానయాన పరిశ్రమ కారణంగా వెలువడే గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు మూడు రెట్లు ఎక్కువ.
అమెరికాలో ఏటా పండించే మొత్తం ఆహారంలో దాదాపు 40 శాతం పారేస్తుండడంతో మంక్‌కు ‘అప్‌సైక్లింగ్’పై ఆసక్తి పెరిగింది.
‘అప్‌సైక్లింగ్’ అంటే మనం పారేసే ఆహారంతో కొత్త ఆహారాన్ని రూపొందించడం.
ప్రపంచంలో తినదగిన వ్యర్థాలు పెరిగిపోతుండడం అనే సమస్యను ఇది పరిష్కరిస్తుందని మంక్ ఆశిస్తున్నారు.
మంక్ రెస్టారెంట్ ‘ఆల్కెమిస్ట్’కు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న ‘స్పోరా ల్యాబ్’లో కోకో పొట్టుతో చాక్లెట్లు తయారు చేస్తారు. చాక్లెట్ కోసం పండించే పంటలో.. ప్రతి కోకో కాయలో దాదాపు మూడు వంతుల భాగాన్ని పారేస్తారు. మంక్ వాటినీ చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తున్నారు.
ఇక్కడ టాకోలను రేప్ సీడ్ పిప్పితో నింపుతారు. ఇది రేప్‌సీడ్‌తో నూనెను తయారు చేసినప్పుడు మిగిలిపోయే అధిక-ప్రోటీన్ గల బై ప్రోడక్ట్.
ఈ ల్యాబ్‌లో జెల్లీ ఫిష్, కోడి తలలు వంటి వాటితో వంటకాలు తయారుచేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
‘సుస్థిర భవిష్యత్తు కోసం... మనం పారేసే ఆహార పదార్థాలను రుచికరమైనవిగా మార్చడం చాలా అవసరం’ అని మంక్ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని వ్యర్థాలను పారేసే బహిరంగ ప్రదేశాలలో.. అమ్ముడుపోని, తినకుండా వదిలేసిన ఆహార పదార్థాలు చాలా కనిపిస్తాయి.
వీటి నుంచి వెలువడే మీథేన్ వాయు కాలుష్యానికి కారణమవుతోంది.
జూన్‌లో అమెరికా ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, అమెరికా వ్యవసాయ శాఖ కలిసి ఒక ప్రణాళిక రూపొందించాయి.
2030 నాటికి ఆహార నష్టం, వ్యర్థాలను సగానికి తగ్గించాలనేదే ఆ ప్రణాళిక.
ఆహార పదార్థాలను పారవేయడం, రీసైక్లింగ్ చేయడం కంటే వాటిని తిరిగి ఉపయోగించుకోవడం (అప్‌సైక్లింగ్) అనేది మరింత ప్రభావవంతమైన పరిష్కారం అని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి.
ఈ దిశగా అనేక కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.
2021లో అప్‌సైకిల్ చేసిన ఆహార ఉత్పత్తుల మార్కెట్ విలువ 4.5 లక్షల కోట్ల రూపాయలు. ఇది 2031 నాటికి 8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోనుందని అంచనా.
ఇలాంటి వాటిపై ఆసక్తి పెరుగుతోంది అని ‘యూనివర్శిటీ కాలేజ్ డబ్లిన్’లోని ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సిమోనా గ్రాస్సో చెప్పారు. ఆమె ఆధ్వర్యంలో త్వరలో ఒక పీహెచ్‌డీ విద్యార్థిని ‘అప్‌సైక్లింగ్’పై పరిశోధన చేయనున్నారు.
ఆహార పరిశ్రమలోనూ ఇలాంటి మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆహార వ్యర్థాలను నిరోధించడానికి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘అప్‌సైకిల్ ఫుడ్ అసోసియేషన్’.
‘అప్‌సైక్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని అందిస్తుంది’ అనే విశ్వాసంతో 2019లో దీనిని ప్రారంభించారు.
తొమ్మిది కంపెనీలతో పని చేయడం ప్రారంభించిన ఈ సంస్థ ఐదేళ్ల తర్వాత 240 కంటే ఎక్కువ కంపెనీలతో పనిచేస్తోంది.
సాధారణంగా మానవులు వినియోగించని వాటిని తిరిగి సమర్థంగా ఉపయోగించి తయారుచేసే ఉత్పత్తులు.. పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపే ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే వ్యవస్థను ఈ సంస్థ రూపొందించింది.
యూరప్‌లో ఆహార వ్యర్థాలను తగ్గించే దిశగా జూన్‌లో ‘అప్‌సైకిల్డ్ ఫర్ ఫుడ్ ఇనిషియేటివ్’ను ప్రకటించారు.
అప్‌సైకిల్ చేసిన పదార్థాలు, ఉత్పత్తులను విస్తృతంగా ఉపయోగించేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం.
యూరప్, అమెరికా, ఆసియాలలోని స్టార్టప్‌లు కొన్ని ఇలాంటి ఆహారాలను తయారుచేస్తున్నాయి.
బీర్ తయారు చేసినప్పుడు వాడే గింజల పిప్పి నుంచి బ్రెడ్, పాస్తా, మరికొన్ని సప్లిమెంట్లను తయారు చేస్తున్నారు.
కాఫీ తయారీ సమయంలో మిగిలిపోయే వ్యర్థాల (ఏటా 5.4 కోట్ల టన్నులు) నుంచి జిన్, పిండి, ఎనర్జీ బార్‌లు తయారుచేస్తున్నారు.

ఫొటో సోర్స్, nibs etc
కొబ్బరి నీరు తాగాక మిగిలిపోయే గుజ్జు నుంచి ఇప్పుడు యోగర్ట్ తయారు చేస్తున్నారు. అలాగే పళ్లు, కూరగాయల తొక్కలు ఎండబెట్టిన స్నాక్స్, జ్యూస్‌లుగా మారుతున్నాయి.
వ్యర్థ ఆహార పదార్థాల పునర్వినియోగం వల్ల ఆహార సరఫరా గొలుసుపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
"అప్‌సైక్లింగ్ ఆలోచనను విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఆహార వ్యవస్థలో పునర్వినియోగాన్ని పెంచే అవకాశం ఉంటుంది" అని ‘ట్రెండ్స్ ఇన్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ’ జర్నల్‌లో నిరుడు ప్రచురితమైన ఒక పరిశోధన పేర్కొంది.
"ప్రజలు పర్యావరణంపై ఆందోళన చెందుతున్నప్పుడు అప్‌సైకిల్ చేసిన ఆహారం పట్ల సానుకూలంగా స్పందిస్తారని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి’’ అని ఈ పరిశోధన పత్రం సహరచయిత, ఆర్హస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెసికా అస్కెమాన్-విట్జెల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే అప్‌సైకిల్ ఆహారానికి అతిపెద్ద సవాల్ ఉంది.
ఇది ఇంకా భారీ స్థాయిలో జరగకపోవడంతో దీనికయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటోంది.
ఆ భారం వినియోగదారులపైనే పడుతోంది.
దీంతో సాధారణ ఆహారం కంటే అప్‌సైకిల్ ఆహారం ధర ఎక్కువగా ఉంటోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.














