గాడిద మృతి, 55 మందిపై కేసు నమోదు

గాడిద ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సీటూ తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఒక గాడిద మృతి చెందిన సంఘటనలో 55 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

గతవారం ఓ గాడిద విద్యుత్‌ స్తంభాన్ని తాకి, ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందింది. దీంతో స్థానిక కేసట్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో పంచాయతీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులు గొడవ చేశారు.

ఈ గందరగోళం కారణంగా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో ఆ శాఖకు రూ.1,46,429 నష్టం వాటిల్లిందని కేసట్ పవర్ గ్రిడ్ జూనియర్ ఇంజనీర్ అవనీష్ కుమార్ ఆరోపించారు.

‘‘ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదాయం కోల్పోవడానికి కారకులు కావడం, ప్రభుత్వ ఉద్యోగిపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు స్థానిక బాసుదేవ పోలీస్ స్టేషన్‌లో మేం ఫిర్యాదు చేశాం’’ అని ఆయన అన్నారు.

వాట్సప్ ఛానల్ లో చేరండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాడిద

ఫొటో సోర్స్, AMJAD

ఫొటో క్యాప్షన్, దదన్ రజక్‌కు చెందిన గాడిద ఒకటి విద్యుత్ షాక్‌తో మరణించడంతో వివాదం మొదలైంది.

ఏం జరిగింది?

ఈ ఘటన బక్సర్ జిల్లా కేసట్ బ్లాక్‌లోని రాంపూర్ గ్రామంలో జరిగింది. దదన్ రజక్ అనే గ్రామస్తుడికి నాలుగు గాడిదలు ఉన్నాయి. వాటిని ఇటుకలు మొదలైన బరువులు మోయడానికి ఉపయోగిస్తున్నారు.

సెప్టెంబరు 11 సాయంత్రం తాను నాలుగు గాడిదలతో ఇంటికి తిరిగి వస్తూ ఒక విద్యుత్ స్తంభం వద్ద నిలుచున్నానని, వర్షం కారణంగా అక్కడ నీరు చేరిందని ఆయన తెలిపారు.

"నేను స్తంభం దగ్గరికి చేరుకున్నప్పుడు, నా గాడిదలు స్తంభాన్ని తాకడంతో వాటికి కరెంట్ షాక్ కొట్టింది. నేను గ్రామస్తుల సహాయంతో, నా మూడు గాడిదలను రక్షించుకున్నాను. కానీ ఒకటి మాత్రం చనిపోయింది" అని దదన్ తెలిపారు.

గాడిద చనిపోవడంతో గ్రామస్తులు కేసట్ పవర్ గ్రిడ్ వద్దకు వెళ్లి నిరనస ప్రదర్శన చేపట్టారు. నిరసనలు శాంతియుతంగా జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ‘‘పంచాయతీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి పవర్ గ్రిడ్‌లో రభస సృష్టించారు. అలాగే అక్కడే ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సుజిత్‌కుమార్‌, రవికుమార్‌లను బంధించి, విద్యుత్‌ సరఫరా నిలిపేశారు’’ అని వారు అంటున్నారు.

ఈ ఘటన అనంతరం, విద్యుత్ శాఖ అధికారులు రాంపూర్ పంచాయతీకి చెందిన వికాస్ చంద్రపాండే, విష్ణుదేవ్ పాశ్వాన్, మంజు కుమారి, ఆలంగీర్, అఫ్తాబ్ అన్సారీ సహా, ఆందోళనలో పాల్గొన్నట్లుగా చెబుతున్న మరో 50 మందిపై ఇండియన్ పీనల్ కోడ్, విద్యుత్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దదన్ వద్ద ఇప్పుడు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి

ఫొటో సోర్స్, AMJAD

ఫొటో క్యాప్షన్, దదన్ వద్ద ఇప్పుడు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి

ఏడాదిలో ఐదు జంతువుల మృతి

ఆ స్తంభం కారణంగా ఒక్క ఏడాదిలోనే ఐదు జంతువులు చనిపోయాయని, స్తంభానికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను రిపేర్ చేయమని ఎన్నిసార్లు కోరినా విద్యుత్ శాఖ పట్టించుకోలేదని వికాస్ చంద్ర పాండే అన్నారు.

"ఆ రోజు (సెప్టెంబర్ 11) మేం ఎవరూ ప్యానల్ రూమ్‌కు వెళ్లలేదు. మరి విద్యుత్‌కు ఎలా అంతరాయం కలిగింది? అక్కడ ఉన్న ఉద్యోగులే మేం నిరసన వ్యక్తం చేయకూడదని విద్యుత్ కనెక్షన్‌ తీసేశారు’’ అని పాండే ఆరోపించారు.

అయితే గ్రామస్తులు, పంచాయతీ ప్రతినిధులు విద్యుత్ శాఖకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును బీబీసీకి చూపలేకపోయారు.

ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్లున్న వారిలో పంచాయతీ కార్యదర్శి ఆలంగీర్‌ అన్సారీ కూడా ఒకరు.

దీనిపై వివరణ ఇస్తూ ఆలంగీర్ ‘‘గ్రామంలోని మెయిన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్విచ్‌ రెండేళ్లుగా పని చేయడం లేదు. దీని వల్ల రెండు నెలల కిందట భునార్‌ యాదవ్‌, హవల్దార్‌ పాశ్వాన్‌లకు చెందిన గేదెలు మరణించాయని నేను జూనియర్ ఇంజినీర్‌కు చెప్పాను. ఆయన నా ఫిర్యాదు నమోదు చేసుకున్నారు కానీ, ఏ చర్యా తీసుకోలేదు’’ అన్నారు.

విద్యుత్ శాఖ జూనియర్ ఇంజనీర్ అవనీష్ కుమార్ మాట్లాడుతూ, "గ్రామస్తులు ఇప్పటి వరకు ఏ ఫిర్యాదూ చేయలేదు. గాడిద చనిపోయాకే వాళ్లు ఫిర్యాదు చేశారు. దాంతో మేము పోల్ వైర్ రిపేర్ చేయడానికి ఎలక్ట్రీషియన్‌ను పంపాము. కానీ ఈలోగా వీళ్లు వచ్చి గొడవ సృష్టించారు. వీళ్ల వల్ల ఎనిమిది పంచాయతీల్లోని యాభై గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి’’ అన్నారు.

కొనసాగుతున్న దర్యాప్తు

ఈ వ్యవహారం బక్సర్ జిల్లాలోని అధికారవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బిహార్‌లో ఇప్పటి వరకు ఇలాంటి కేసును చూడలేదని ఇంజనీర్‌ అవనీష్‌ కుమార్‌ అన్నారు.

ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. బాసుదేవ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి చున్‌మున్ కుమారి మాట్లాడుతూ, ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోందని అన్నారు.

కాగా, రూ.80 వేలు అప్పు చేసి నాలుగు గాడిదలను కొన్నట్లు దదన్ చెప్పారు. రాంపూర్ పంచాయతీలోని ఇటుక బట్టీల్లో ఆరు నెలల పాటు ఇటుకలు మోస్తే, నాలుగు గాడిదలకు రోజుకు రూ.800 వచ్చేవని ఆయన తెలిపారు.

‘‘గత ఏడాదే గాడిదలను కొన్నాను. ఇప్పుడు విద్యుత్ స్తంభం వల్ల గాయాలయ్యాయి. వాటికి చికిత్స చేయించాలి. అవి లేకపోవడం వల్ల నా ఆదాయం పడిపోయింది. ప్రభుత్వం మా కోసం ఏం చేస్తుంది?" అని దదన్ ప్రశ్నించారు.

ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు పరిహారం ఇస్తుంది. దదన్ కూడా ఈ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)