దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆతిశి

దిల్లీ సీఎం ఆతిశి

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆతిశి శనివారం (సెప్టెంబర్ 21) ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడిన ఆతిశి, ‘‘మనమందరం కలిసి అరవింద్ కేజ్రీవాల్‌ను మరోసారి సీఎం చేయాలి’’ అని అన్నారు.

‘‘దిల్లీ ప్రజలమంతా కలిసి ఒక పని చేయాలి. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి చేయాలి’’ అని చెప్పారు.

‘‘కేజ్రీవాల్ గత పదేళ్లలో దిల్లీ ముఖచిత్రాన్ని మార్చేశారు. దిల్లీలో నివసించే సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచారు’’ అని ఆమె అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశిని ఆప్ శాసనసభాపక్షం ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.

ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో కేజ్రీవాల్ స్వయంగా ఆతిశి పేరును ప్రతిపాదించగా.. దీనికి మిగతా నాయకులు అంగీకారం తెలిపారు.

ఆతిశి ఆమ్ ఆద్మీ పార్టీలో, ఆ పార్టీ నేతృత్వంలోని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నేత.

కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆమె ఆర్థిక, విద్య, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ వంటి కీలక శాఖల బాధ్యతలు చూశారు.

ఆతిశి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్‌లో కొన్నాళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పారు.

కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో..

‘దిల్లీ లిక్కర్ పాలసీ’ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ బెయిలుపై వచ్చాక సెప్టెంబర్ 15న పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రెండు రోజులలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

దీంతో కేజ్రీవాల్ తరువాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంలో పలు పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి ఆతిశి ఆ బాధ్యతలు చేపట్టారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేవరకూ ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు పాలన బాధ్యతలు ఒకరకంగా ఆతిశినే చూశారు.

కేజ్రీవాల్‌కు ఆతిశి పనితీరుపై విశ్వాసం ఉందని పార్టీ వర్గాలు చెప్తాయి.

ఆతిశి

ఫొటో సోర్స్, Getty Images

సలహాదారు నుంచి సీఎం దాకా.. ఎవరీ ఆతిశి?

2020లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ గెలిచాక కేజ్రీవాల్ మంత్రిమండలిలో మహిళలు ఎవరికీ చోటు దక్కలేదు. ఆ ఎన్నికలలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. వీరిలో 8మంది మహిళలు ఉన్నారు. కానీ మంత్రి మండలిలోకి వారిలో ఏ ఒక్కరినీ తీసుకోలేదు.

అప్పట్లో ఆతిశికి మంత్రిపదవి దక్కకపోవడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు.

అయితే కాలక్రమంలో దిల్లీ రాజకీయాలు మారాయి.

ఆతిశి తొలిసారి 2023లో మంత్రి అయ్యారు. ఆమెకు అప్పుడు విద్యాశాఖ కేటాయించారు.

మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మనిష్ సిసోదియా, సంజయ్ సింగ్ జైలుకు వెళ్ళడంతో పార్టీ వ్యవహారాల నుంచి ప్రభుత్వ వ్యవహారాల వరకు బాధ్యతలన్నీ ఆతిశి చూసుకున్నారు.

దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె అయిన ఆతిశి విద్యాభ్యాసం దిల్లీలోని స్ప్రింగ్‌డేల్ పాఠశాలలో సాగింది.

అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.

ఆతిశి

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం

ఆ తరువాత కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె సమీపంలో ఉన్న రిషివ్యాలీ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు బోధించారు.

భోపాల్‌లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ ఆద్మీ పార్టీతో, ప్రశాంత్‌ భూషణ్‌తో పరిచయం ఏర్పడింది.

ఆతిశి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.

ఆమె అప్పటి దిల్లీ విద్యాశాఖ మంత్రి మనిష్ సిసోదియాకు 2015 నుంచి 2018 వరకు సలహాదారుగా పనిచేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్‌సైట్‌లో సమాచారం మేరకు.. ఆమె సిసోదియా సలహాదారుగా పనిచేయడంతోపాటు దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.

స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కఠిన నిబంధనలు విధించారు.

ఆతిశి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా.

ఆమె దిల్లీలోని కాల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)