యుక్రెయిన్, రష్యా మధ్య చెస్ యుద్ధం.. ఎవరిది పైచేయి

రష్యా, యుక్రెయిన్, చెస్ , బెలారస్, దండయాత్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విల్ వెర్నాన్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌, రష్యా యుద్ధం ఇప్పుడు చెస్ ప్రపంచానికి పాకింది.

2022లో యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన తరువాత అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొనకుండా రష్యా జాతీయ జట్టు, అధికారులపై ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్(ఫిడె) నిషేధం విధించింది.

చెస్‌లో ఆధిపత్యం చలాయించిన చరిత్ర గల ఓ దేశానికి ఈ నిర్ణయం ఎదురుదెబ్బే.

అయినప్పటికీ, ప్రస్తుతం ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా పోరాటం చేస్తోంది.

హంగరీ దేశ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ వారంలో జరగనున్న ఫిడె జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా రష్యా అంతర్జాతీయ టోర్నీల్లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తోంది.

అయితే, యుక్రెయిన్‌కు మద్దతిస్తున్న యూకే, జర్మనీ తదితర దేశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా రీ ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు , వాట్సాప్ చానల్‌ , తెలుగు న్యూస్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఫిడెపై రష్యాకు సంపూర్ణ నియంత్రణ ఉంది. ప్రస్తుతం ఫిడె అధ్యక్షుడిగా ఉన్న అర్కాడీ డ్వోర్కోవిచ్ రష్యా మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరేషన్‌కు సంబంధించిన రాజ్యాంగంలో మార్పులు చేస్తూ, ఫెడరేషన్‌ను మెల్లిగా రష్యా తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రష్యా ఓ తీర్మానాన్ని ఆమోదించాలని ఫిక్స్ అయితే...కచ్చితంగా ఆమోదం పొంది తీరాల్సిందే. సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో 'పవర్ వర్టికల్' ను ఎలా ఉపయోగించిందో ఇప్పుడు అలాగే చేసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలోనే ఫిడె పని చేస్తోంది. కాబట్టి, రష్యాపై నిషేధం కొనసాగించేలా ఫిడెపై ఐఓసీ ఒత్తిడి తీసుకురావాలి" అని ఇంగ్లిష్ చెస్ ఫెడరేషన్‌ ప్రతినిధి మాల్కమ్ పెయిన్ చెప్పారు.

రష్యాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేయాలనే ప్రతిపాదనను చెస్ ఫెడరేషన్ ఆఫ్ కిర్గిజిస్తాన్‌ ప్రవేశపెట్టింది. రష్యా కీలకమైన మిత్ర దేశాలలో కిర్గిజిస్తాన్‌ ఒకటి.

మరోవైపు, మిగతా కొన్ని దేశాలు కూడా ఫిడె కాంగ్రెస్‌లో రష్యాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని అంచనా.

ఫిడె అధ్యక్షుడు అర్కాడీ డ్వోర్కోవిచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిడె అధ్యక్షుడు అర్కాడీ డ్వోర్కోవిచ్

‘ఫెడరేషన్‌లో ప్రతి దేశం ఓటు హక్కు కలిగి ఉంది. అయితే, ఆసియా, ఆఫ్రికాలోని చాలా దేశాలు తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఆయా దేశాలను రష్యా సులభంగా ప్రభావితం చేయగలదు. ప్రస్తుతం, రష్యా అనుకూల వర్గాలు ఫెడరేషన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తుండటం మనం చూడొచ్చు. ఇది నిజంగా ఆందోళనకరం’ అని జర్మనీ చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఇంగ్రిడ్ లాటర్బాచ్ చెప్పారు.

అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తూ చెస్‌ను అప్రతిష్ఠపాలు చేశారని నిరుడు జూన్‌లో రష్యన్ చెస్ ఫెడరేషన్ -సీఎఫ్ఆర్‌‌పై ఫిడె ఆంక్షలు విధించింది.

అంతకుముందు విధించిన రెండేళ్ల ఆంక్షలకు ఇది అదనం.

రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న యుక్రెయిన్ స్థావరాల్లో రష్యన్ ఫెడరేషన్ టోర్నమెంట్స్ నిర్వహించినట్లు తెలిసింది.

ఆ బోర్డులో సభ్యులైన రష్యా రక్షణ శాఖ మాజీ మంత్రి సెర్గీ షోయిగు, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇద్దరిపై ఇదివరకే అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి.

"రష్యా ఫెడరేషన్‌పై ఫిడె నిషేధాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇలాంటి సమస్యల్ని ఫిడె జనరల్ అసెంబ్లీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుంది" అని అర్కాడీ డ్వోర్కోవిచ్ మ్యాచ్ టీవీతో చెప్పారు.

అంతర్జాతీయ చెస్ టోర్నీల్లో రష్యా జాతీయ చెస్ టీమ్‌, ఆ దేశ జెండా, జాతీయ గీతాలకు మినహాయింపు ఇస్తూ 2022లో ఆంక్షలు విధించారు. ఇప్పుడు వాటిని ఎత్తివేసే దిశగా వచ్చే వారం ఫిడె జనరల్ అసెంబ్లీలో కీలక ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

chess

ఫొటో సోర్స్, Getty Images

అడ్డుకునేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు

చెస్‌ రంగంలో ఆధిపత్యం దిశగా రష్యా వేస్తున్న అడుగులను అడ్డుకునేందుకు యుక్రెయిన్ కూడా బలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తన సలహాదారు అలెగ్జాండర్ కామిషిన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ బాధ్యతలు అప్పగించారు.

రష్యా, యుక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో పదే పదే దాడులు ఎదుర్కొంటున్నా దేశంలో రైల్వేలను సమర్థంగా నడపడంలో అలెగ్జాండర్ కామిషిన్ కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం యుక్రెయిన్ చెస్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న అలెగ్జాండర్ కామిషిన్ బుడాపెస్ట్‌లో జరగబోయే ఓటింగ్ ప్రక్రియపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"యుద్ధంలో మా దేశానికి చెందిన 21 మంది చెస్ ఆటగాళ్లను చంపేశారు. మా దేశ పౌరులను, చెస్ ప్లేయర్స్‌ను రష్యా చంపుతుంటే, ఆ దేశంపై ఆంక్షలు తొలగించాలనుకోవడం సరైనది కాదు "అని అలెగ్జాండర్ కామిషిన్ అన్నారు.

రెండు దేశాలకు కీలకంగా మారుతున్న ఈ అంశంపై రష్యా చెస్ ఫెడరేషన్, అర్కాడీ డ్వోర్కోవిచ్‌ను బీబీసీ సంప్రదించగా వారు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

రష్యన్ చెస్ ఫెడరేషన్‌పై ఆంక్షలు విధించడం పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయమని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని రష్యా అధికారులు అంటున్నారు.

"ఒకవేళ రష్యా తిరిగి చెస్ ప్రపంచంలోకి అడుగుపెడితే, ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు తప్పు అన్నట్లుగా రష్యా భారీగా ప్రచారం చేసుకుంటుంది. చూడండి..! మేం చెస్‌లో తిరిగి అడుగుపెట్టామంటూ ఈ ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. యుద్ధం వల్ల చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు ఇకపై మనకు ఉండకపోవచ్చు అనే సంకేతాల్ని తమ పౌరులకు పంపించే అవకాశాలు ఉన్నాయి" అని మాల్కమ్ పెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రష్యాపై ఆంక్షలు కొనసాగించాలనే ఒత్తిడి తీసుకువచ్చేందుకు యుక్రెయిన్, దాని మిత్ర దేశాలకు చెస్ ఓ వేదిక మాత్రమే.

అయినప్పటికీ, రెండున్నరేళ్ల యుద్ధం తరువాత అంతర్జాతీయ సమాజంలోకి రష్యాను ఆహ్వానించే గొంతుకలు క్రమంగా పెరుగుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)