‘గాజులు వేసుకోవడం చేతకానితనమా’.. రాజకీయ నాయకులు తరచూ ఈ ప్రస్తావన ఎందుకు తెస్తారు?

గాజులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

"పార్టీ (బీఆర్‌ఎస్) మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నేను ఇవాళ గిఫ్ట్ పంపుతున్నా. చీర, గాజులు తెచ్చినా’’

‘‘చేత కాకపోతే, ఈ చీర గాజులు వేసుకుని పబ్లిక్‌లో తిరగండి’’

‘‘మీరు ఇజ్జత్ లేనోళ్లు. మీరు మగవాళ్లు కాదు. కాబట్టే, చీరలు, గాజులు పంపుతున్నా’’

‘‘దమ్ముంటే మీరు మగాళ్ల లెక్క రాజకీయం చెయ్యాలి"

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కొద్ది రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ఇవి.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను విమర్శిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

మహిళలు ధరించే చీర, గాజులను ‘అసమర్థతకు’ ప్రతీకగా చూడటం అనేది ఈ సమాజంలో తరతరాలుగా వస్తోంది.

‘‘మా చేతులకు గాజులు లేవు’’

‘‘మేం ఏమైనా గాజులేసుకొని కూర్చున్నామా..?’’

"చేతకాకపోతే గాజులు వేసుకుని కూర్చో!’’

టీవీ సీరియళ్లు, సినిమాలు, రాజకీయాల్లో ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. సమాజంలో చాలా సందర్భాల్లో అసమర్థతకు, చేతి గాజులకు ముడిపెడుతుంటారు.

ఇలా మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నది పురుషులు మాత్రమే కాదు. అలా మాట్లాడుతున్న వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. గతంలో ఒక టీవీ డిబేట్‌ పాల్గొన్న జనసేన పార్టీకి చెందిన మహిళానేత, తన మీద ఆరోపణలు చేసిన వారికి ‘‘గాజులు పంపుతాను, వేసుకోండి’’ అని అన్నారు.

గాజులు

ఫొటో సోర్స్, Getty Images

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గతంలో పాడి కౌశిక్ రెడ్డి మాదిరిగానే వ్యాఖ్యలు చేశారు.

2021లో తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు ప్రెస్‌మీట్ పెట్టి, నాటి బీఆర్‌ఎస్ ఎంపీలు చీర గాజులు తొడుక్కోవాలంటూ విమర్శించారు.

‘‘చీర, సారె కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. వీటిని కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి’’ అని ఒక మహిళా నేత అన్నారు.

ఓ 10, 20ఏళ్లు వెనక్కి పోతే చాలా సినిమాల్లో ‘‘చేత కాకపోతే గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో’’ అనే డైలాగ్ తరచూ వినిపిస్తూ ఉండేది. చివరకు మహిళా పాత్రలు కూడా ఆ మాట అంటూ ఉంటాయి.

మహిళలు రాజకీయ నేతలను కించపరిచేలా చేసే కామెంట్స్ ఒక ఎత్తయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ చానెళ్లు వాటినే హెడ్‌లైన్స్‌గా పెట్టడం మరొక ఎత్తు.

పురుషుల మీద మాటలతో దాడి చేయాలంటే, గాజులు వేసుకుని కూర్చో అనడం చాలా సాధారణంగా మారిపోయింది.

"మహిళ - చేతకానితనానికి ప్రతీక కాదు. నేడు వాళ్లు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వారు చేయలేని పని అంటూ లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు" అని ఆంధ్ర యూనివర్సిటీ దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ పల్లవి అన్నారు.

"ఒక మహిళను అవమానించడానికి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడమే, సులువుగా దొరికే ఆయుధం" అని "షీ ద లీడర్ - విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్" పుస్తక రచయత నిధి శర్మ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన పితృస్వామిక భావజాలంతో పోరాడటమే, మహిళలు ఎదుర్కొనే అతి పెద్ద సవాలు అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇలా గాజులకు, చేతకానితనానికి లంకె పెట్టడం, మాటలతో దూషించడం భారత రాజకీయాల్లో మొదటిసారి కాదు.

గాజులు

ఫొటో సోర్స్, Getty Images

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రాత్రి విధుల్లో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో, ఇటీవల దేశంలోని ప్రముఖ నగరాల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసనలు చేపట్టారు.

పశ్చిమబంగ ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం "నవన్న అభియాన్" అనే పేరుతో నిరసన చేసింది. ఆ నిరసనలో పాల్గొన్న ప్రబీర్ బసు అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, పోలీసులను ‘‘గాజులు వేసుకుని కూర్చోమని’’ చెబుతున్న వీడియో వైరల్ అయింది.

మహిళల హక్కుల కోసం చేస్తున్న నిరసనలో ఇలాంటి మాటలు వినపడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది ఫెమినిస్టులు ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

"చాలా మంది ఇలా అనడాన్ని తప్పుగా కూడా అనుకోరు. ఒక మహిళను గాజులు వేసుకోవడానికి పరిమితం చేస్తున్నారంటే, 2024లో కూడా పితృస్వామ్య భావజాలం ఎంత వేళ్ళూనుకుపోయిందో అర్థం అవుతోంది" అని శ్రీకాకుళం నిర్భయ విమెన్ ఫోరమ్ చైర్ పర్సన్ గీత యార్లగడ్డ అన్నారు.

"ఆ గాజులు తొడుక్కున్న చేతులే వరి నాట్లు వేయకపోతే, తినడానికి అన్నమే ఉండదు" అన్నారు గీత.

గాజులు

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి సందర్భాలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, గతంలో జాతీయ వేదికల్లో కూడా చాలా సార్లు చోటు చేసుకున్నాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ సభ్యురాలు స్మృతి ఇరానీ కూడా 2013లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు గాజులు పంపించమంటారా అని ప్రశ్నించారు.

దౌత్య వ్యవహారాల్లో గాజుల ప్రస్తావన ఎందుకు వస్తోందనేది మరో పెద్ద ప్రశ్న.

బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ 2015 ఏప్రిల్‌లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీని కాకుండా ఒక నల్ల జాతీయురాలిని పెళ్లి చేసుకుని ఉంటే, కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించి ఉండేదా? అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ ) నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ, "ఆయన చేతికి గాజులు వేసి, పసుపు రాసి, బొట్టు పెట్టి, ముఖానికి మసి పూయాలి" అని అన్నారు.

దీంతో, లాలూ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురయ్యారు.

ఈ వ్యాఖ్యలకు మూలం ఏంటి? ఎక్కడి నుంచి పుట్టింది?

‘‘రాజులు, రాజ్యాలు ఉన్న కాలంలో ఈ నానుడి పుట్టి ఉండవచ్చు. పురుషులు మాత్రమే యుద్ధానికి వెళుతూ ఉండటంతో, కత్తులు ఖడ్గాలు పౌరుషానికి చిహ్నంగా చూస్తూ ఉండవచ్చు. స్త్రీలు రాజప్రాసాదాలకే అంకితం కావడంతో, యుద్ధరంగంలో ప్రతాపం చూపించే అవకాశం లేకపోవడంతో గాజులు వేసుకుని ఉండటాన్ని పిరికితనానికి లేదా బలహీనతకు ప్రతీకగా మాట్లాడుతూ ఉండవచ్చు" అని గీత అభిప్రాయపడ్డారు.

"సున్నితంగా, బలహీనంగా, అణగిమణిగి ఉండటమే, స్త్రీ తత్వానికి ప్రతీకగా చూడటం సమాజంలో బలంగా నాటుకుపోయింది. మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి. మహిళలు ధరించే బొట్టు, చీర, నగలు బలహీనతకు ప్రతీక కాదని చెప్పాలి" అని గీత అంటారు.

‘‘కొన్ని శతాబ్దాలుగా స్త్రీలను బానిసలుగా చూస్తూ, ప్రాచీన కాలంలో వాళ్ళ లైంగికతకు సంకెళ్లు వేశారు. ఆ క్రమంలో వచ్చినవే చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు. అవి క్రమంగా ఆభరణాలుగా మారాయి. వాటిని బానిసత్వానికి, అణచివేతకు ప్రతీకగా చూడటం అలా వచ్చిందే. స్త్రీని ఒక ఆస్తిగా చూడటం అలవాటుగా మారిపోయింది" అని స్త్రీవాద రచయిత్రి కత్తి పద్మ అన్నారు.

గాజులు, చీరలను నిస్సహాయతకు, బలహీనతకు ప్రతీకగా ఆధునిక సమాజంలో చూడటం మాత్రం సమంజసం కాదని పద్మ అంటారు.

ఈ అంశంపై విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు చెన్నుబోయిన వంశీకృష్ణ మాట్లాడుతూ, "గాజులు వేసుకోండి, చీరలు కట్టుకోండి వంటివి రాజకీయ పరిణతి లేనివాళ్లు మాట్లాడే మాటలు. ఇలాంటి మాటలు స్త్రీ, పురుషులిద్దరినీ ఇబ్బంది పెడతాయి. కచ్చితంగా మనోభావాలను గాయపరుస్తాయి. ఆధునిక సమాజంలో స్త్రీ పురుషులు ఎవరూ తక్కువ కాదు, ఇలా మాట్లాడటం మాత్రం తప్పు" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)