ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేసింది? సినీ నటి జత్వానీ కేసులో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్, జీవీ సాయినాథ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది.
ముంబయికి చెందిన సినీ నటి కాదంబరీ నరేంద్ర కుమారి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేసినట్లు ఏపీ ప్రభుత్వం 1590, 1591, 1592 నెంబర్లతో జీవోలను విడుదల చేసింది.
దీనికి ముందు, ముంబయికి చెందిన నటి జత్వానీ వ్యవహారంలో అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను డీజీపీ సస్పెండ్ చేశారు.
మరోవైపు, కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి తనపై తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ కాదంబరీ జత్వానీ శుక్రవారం (13.09.24) ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో విద్యాసాగర్‌తో పాటు మరికొందరిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్ విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
అయితే, 2024 ఫిబ్రవరి 2న ఇదే పోలీస్ స్టేషన్‌లో కాదంబరీ నరేంద్ర కుమారి జత్వానీపై కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టారు.
తన స్థలాన్ని వేరే వ్యక్తులకు ఫోర్జరీ సంతకాలతో అమ్మేందుకు జత్వానీ ప్రయత్నించారంటూ విద్యాసాగర్ కేసు పెట్టారు.
అసలు కుక్కల విద్యాసాగర్ ఎవరు? ముంబయికి చెందిన నటి కాదంబరీ జత్వానీకి కుక్కల విద్యాసాగర్‌కు మధ్య ఏం జరిగింది? జత్వానీ, కుక్కల విద్యాసాగర్ ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులేంటి? వీరి వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు?


ఫొటో సోర్స్, UGC
ముగ్గురు అధికారులు ఎందుకు సస్పెండయ్యారంటే..
కాదంబరీ జత్వానీ ముంబయికి చెందిన ఓ సినీ నటి. తాను సినీ రంగంలోకి రాకముందు వ్యాపారవేత్తగా, వైద్యురాలిగా, మోడల్‌గా కూడా పని చేసినట్లు ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపారు.
కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూమిని వేరే వ్యక్తులకు ఫోర్జరీ సంతకాలతో అమ్మాలని ప్రయత్నించారంటూ తనపై, తన తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేసి, పోలీసులు చిత్ర హింసలు పెట్టారంటూ జత్వానీ ఆగస్ట్ 30న విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.
ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ప్రస్తావించినట్లు ఆమె తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.
ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు.
ఆ కేసు నమోదు, దర్యాప్తులో అవకతవకలు, లోపాలు ఉన్నాయంటూ డీజీపీకి నివేదికను అందించారు. డీజీపీ ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
ఆ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కుక్కల విద్యాసాగర్ కేంద్రంగానే ఈ మొత్తం కేసు నడుస్తోంది. ఆయన 2024 ఫిబ్రవరి 2న జత్వానీపై ఫోర్జరీ కేసు పెట్టడంతో మొదలైన ఈ వ్యవహారం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ వరకు సాగింది.

ఫొటో సోర్స్, Facebook
కుక్కల విద్యాసాగర్ ఎవరు?
కుక్కల వెంకట రామ విద్యాసాగర్‌ది కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు. ఆయన తండ్రి కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా విద్యాసాగర్ పని చేశారు.
2014 ఎన్నికల్లో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు.
“వైపీపీలో పని చేస్తున్న మా తండ్రి నాగేశ్వరరావు 2013లో చనిపోవడంతో ఆ సానుభూతితో 2014 ఎన్నికల్లో నాకు టిక్కెట్ ఇచ్చారు. ఓటమి తర్వాత వైసీపీకి, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను. పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెట్టాను” అని ఆగస్టు 30న సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో VM Coallogix Pvt Ltd, VM Bulklogix, VM Agri India Pvt Ltd, VM Infra Pvt Ltd కంపెనీలలో తనకు షేర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీలన్నింటిలోనూ కుక్కల విద్యాసాగర్ డైరెక్టర్‌గా ఉన్నారు.
“'నేను ముంబయిలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె నాకు పరిచయమయ్యారు. అప్పట్లో ఆమెతో ఫొటోలు దిగాను. 2023 సెప్టెంబర్‌లో నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాలుగు రోజులు వారణాసిలో హోటల్ బుక్ చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆమె ఇచ్చిన పేరు, పుట్టిన తేదీ వివరాలు... నాకు అంతకు ముందు చెప్పిన వివరాలు వేరు” అని సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
తన పేరుతో ఉన్న భూమిని వేరే వ్యక్తులకు ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమ్మాలని జత్వానీ ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అదే ఇంటర్వ్యూలో విద్యాసాగర్ తెలిపారు.
నటి జత్వానీపై కేసు ఏంటి?
జగ్గయ్యపేటలో తనకు (కుక్కల విద్యాసాగర్) చెందిన ఐదు ఎకరాల భూమిని అమ్ముతానంటూ కాదంబరీ జత్వానీ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కుక్కల విద్యాసాగర్ 2024 ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు.
ఈ భూమిని కోసూరుకు చెందిన నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్‌లకు ఫోర్జరీ సంతకాలతో అమ్మడానికి జత్వానీ ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
“వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి నాతో పాటు నా తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2న నాపై ఫిర్యాదు చేస్తే, అదే రోజు ముంబయి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. 42 రోజుల పాటు జైల్లో పెట్టారు. కొందరు పోలీసు అధికారుల నేతృత్వంలోనే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి, నన్ను వేధించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. నాకు, నా కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలి” అని సెప్టెంబర్ 14న కాదంబరీ జత్వానీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కుక్కల విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నారు: కాదంబరీ జత్వానీ
కుక్కల విద్యాసాగర్ ఏదో ఆశించి తనపై తప్పుడు కేసు పెట్టారని జత్వానీ చెప్పారు.
“కుక్కల విద్యాసాగర్‌తో పదేళ్లకు పైగా నాకు పరిచయం ఉంది. ముంబయిలో కొన్ని ఈవెంట్లు, ఫంక్షన్లకు హాజరైనప్పుడు అక్కడ మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
2015లో నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ప్రపోజ్ చేశారు. దానికి నేను అంగీకరించలేదు. దాంతో కక్ష కట్టి ఇదంతా చేశారు” అని కాదంబరీ జత్వానీ కుక్కల విద్యాసాగర్‌పై ఆరోపణలు చేశారు.
“2018లో ఫోర్జరీ చేసినట్లు నాపై కేసు పెట్టారు. ఆ ఫిర్యాదులో ఉన్న నా అడ్రస్‌కు సంబంధించిన ఫ్లాట్‌ను నేను 2020లో కొన్నాను. నేను 2018లో అహ్మదాబాద్‌లో ఉన్నాను. యూఎస్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను.
అలాగే నేను ఫోర్జరీ చేసి అమ్మాలని ప్రయత్నించాను అని ఆరోపిస్తున్న స్థలం ఉన్న ప్రాంతానికి నేను జీవితంలో ఎప్పుడూ వెళ్లలేదు, చూడలేదు.
ఈ కేసుల వలన కెరియర్‌తో పాటు ఆర్థికంగా చాలా నష్టపోయాను. మానసికంగా కుంగిపోయాను. దీనంతటికీ కారణమైన కుక్కల విద్యాసాగర్‌ని కఠినంగా శిక్షించాలి” అని పోలీసులను జత్వానీ కోరారు.
తనని ఇంతలా ఇబ్బందులు పెట్టిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

జీవోలలో ఏముందంటే...
జత్వానీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిని సస్పెండ్ చేస్తూ, ఒక్కో అధికారి పేరుతో విడివిడిగా జీవోలు విడుదల చేసింది.
“జత్వానీపై ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసింది 2024 ఫిబ్రవరి 2న. కానీ ఆంజనేయులు జనవరి 31న విజయవాడ సిటీ కమిషనర్ కాంతి రాణా తాతా, డీసీపీ విశాల్ గున్నిలను పిలిపించి ముంబయిలో వున్న సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్ట్ చేయాల్సిందిగా, మౌఖికంగా ఆదేశించారు” అని పీఎస్ఆర్ ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవో 1592లో పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో ఆయన పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ‘ఆధారాలు లేకుండా, అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదు ఆధారంగా తన ఉద్యోగ హోదాను అడ్డుపెట్టుకుని ఆదేశాలు జారీ చేశారని జీవోలో పేర్కొన్నారు.
అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు నుంచి ఆదేశాలు రాగానే ఎలాంటి ప్రాథమిక విచారణా చేయకుండా పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా అరెస్ట్ చేశారంటూ.. జీవో 1591లో ప్రభుత్వం పేర్కొంది.
ఫిబ్రవరి 2న నమోదైన ఈ కేసులో జత్వానీని అరెస్ట్ చేసేందుకు పోలీస్ కమిషనర్ కార్యాలయం ఫిబ్రవరి 1న ముంబయికి విమాన టికెట్‌లను బుక్ చేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలియపర్చింది.
అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, సీఐలు శ్రీధర్, షరీఫ్, సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఐ దుర్గాదేవి, కానిస్టేబుళ్లు టి.మౌనిక, వై.రమేష్, ఎం.గీతాంజలి, ఎస్.రమ్యలకు విమాన టికెట్‌లను ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే తీసుకున్నట్లు గుర్తించామని, ఈ కేసులో ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్నతాధికారుల అనుమతులు కూడా లేవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జత్వానీపై ఇబ్రహీంపట్నంలో ఫోర్జరీ కేసు ఫిబ్రవరి 2 ఉదయం 6.30 గంటలకు నమోదైతే, డీసీపీ విశాల్ గున్ని ఉదయం 7.30 గంటలకు ఉన్నతాధికారులకు ఎటువంటి రాతపూర్వక సమాచారం లేకుండా ముంబయికి బయలుదేరారంటూ జీవో నెంబర్ 1590లో ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














