వరదలలో చిక్కుకుంటే ఎలా బయటపడాలి

ఫొటో సోర్స్, Getty Images
ఏపీ, తెలంగాణల్లో బుడమేరు, మున్నేరు వరదలు ప్రజాజీవితాలను ఎంతలా అతలాకుతలం చేశాయో చూశాం. ఇప్పటికీ వరద విషాదం ప్రజలను వెంటాడుతూనే ఉంది. అసలింతకీ వరదలు ఎందుకు వస్తాయి?
ఇటీవల కాలంలో తరచూ బీభత్సమైన వరదలు ఎందుకు వస్తున్నాయి? నాసా గణాంకాల ప్రకారం.. ఒక్క 2023లోనే ప్రపంచవ్యాప్తంగా 164 భారీ వరదలు వచ్చాయి.
ఉత్తర లిబియాలో 10 వేల మంది ప్రాణాలు కోల్పోయిన భారీ వరద కూడా ఉంది.
ఈ ఏడాది అనేక దేశాలు వరదలను ఎదుర్కొంటున్నాయి. తాజాగా తీవ్ర వరదలు ఎదుర్కొన్న ప్రాంతాలలో సెంట్రల్ యూరోప్, పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.
వరదలలో అనేక రకాలు ఉంటాయి. కానీ ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) చాలా ప్రమాదకరం.
ఇవి కేవలం నిమిషాల నుంచి గంటల వ్యవధిలోనే నీటి మట్టం ప్రమాదకరంగా పెరగడానికి కారణమవుతాయి.
సాధారణంగా ఇవి భారీ వర్షపాతం కారణంగా సంభవిస్తాయి. హఠాత్తుగా భారీ ఎత్తున విరుచుకుపడే ఇలాంటి వరద భవనాలను కూడా కొట్టుకుపోయేలా చేస్తుంది.


ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడి ఆ తరువాత కురిసే భారీ వర్షాలు కూడా ఇలాంటి ఆకస్మిక వరదలకు కారణమవుతున్నాయి.
అమెరికా శాస్త్రవేత్తలు 2021లో నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది వరద ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
విపరీతమైన వర్షపాతం, సముద్ర మట్టాలు పెరగడం, తీవ్ర తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు వాతావరణ మార్పుల ప్రభావమే కారణమని తెలిపారు.
మరి ఆకస్మిక వరదల సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?
వరద నీటి ప్రవాహంలో చిక్కుకుపోతే బయటపడడం ఎలా?
అలా బయటపడడానికి ఉన్న మార్గాలేమిటో ఈ కథనంలో చదవండి..

ఫొటో సోర్స్, Getty Images
చూడండి, వినండి, మాట్లాడండి, తెలుసుకోండి
వరద ప్రభావిత ప్రాంతాలలో మీరు నివసిస్తుంటే స్థానిక వాతావరణ హెచ్చరికలను వినండి.
ముఖ్యంగా భారీవర్షపాతానికి సంబంధించి అధికారులు ఇచ్చే సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి.
వరద నీటి మట్టం పెరుగుతున్న ప్రాంతాలలో ఉంటే.. మీ కుటుంబసభ్యులు, పెంపుడు జంతువులను తరలించడానికి తగిన ప్రణాళికతో సిద్ధంగా ఉండండి.
మంచి నీరు, మొబైల్ ఫోన్ చార్జర్, రెయిన్ కోట్స్, అత్యవసర మందుల పెట్టె వంటివన్నీ సిద్ధం చేసుకోండి.
రెడ్‌క్రాస్ లాంటి సంస్థలు ఇలాంటి కిట్లను ఎలా సిద్ధం చేసుకోవాలో సమాచారాన్ని ఇస్తాయి.
దీంతోపాటు మీ ఇరుగుపొరుగువారు, ముఖ్యంగా వయోధికులకు ఈ వరద సమాచారం తెలియకపోతే వాళ్లకు చెప్పండి.

ఫొటో సోర్స్, Getty Images
మీ ఇంటిని రక్షించుకోవడం ఎలా?
వరదలో చిక్కుకున్న మీ ఇంటి నుంచి సులభంగా తప్పించుకునే మార్గాన్ని చూసుకుంటూ, మీ ఇంటి తలుపులు, కిటికీలను మూసివేయండి.
ఇది మీ ఇంటిలోకి ప్రవేశించే నీటి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇసుక బస్తాలను ఉపయోగించిడ్రెయిన్లు, టాయిలెట్ సీట్లను మూసివేయాలి. లేదంటే అందులోంచి నీరు లోనికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వరదలో చిక్కుకుంటే ఏమవుతుంది?
మీ వీధిని నీరు చుట్టుముడుతున్న దృశ్యాన్ని మీరు బయట ఉన్నప్పుడు చూశారనుకోండి వెంటనే ఎత్తయిన ప్రాంతానికి వెళ్లండి.
వరద నీటిలో నడవడం, వాహనం నడపడం లాంటివి చేయకండి.
ఉద్ధృతంగా ప్రవహించే నీరు అర మీటరు లోతు ఉన్నా ప్రమాదకరమే. ఆ స్థాయి నీటి ప్రవాహానికి మిమ్మల్ని, మీ కారును కూడా కొట్టుకుపోయేలా చేయగల శక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వరద మరణాలలో 75 శాతం నీటిలో మునిగి చనిపోయినవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చెబుతోంది.
వరద నీటిలో కొట్టుకు వచ్చే వస్తువులు, కర్రలు, రాళ్లు తీవ్ర గాయాలపాలు చేస్తాయి. వరదల సమయంలో కరెంట్ తీగలు ప్రాణాంతక విద్యుదాఘాతాలకు కారణమవుతాయి.
వరదలో మ్యాన్‌హోల్స్ మూతలు కొట్టుకుపోతాయి. అలాంటి సమయాలలో వీధులలో నడవడం ప్రమాదకరం.
చాలామంది ఇలా మ్యాన్‌హోల్స్‌లో పడి కొట్టుకుపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
వరదల సమయంలో మీరు ఇంట్లోనే ఉంటే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయండి.
అలాగే గ్యాస్, నీటి సరఫరాను కూడా నిలిపేయండి. అవకాశం ఉంటే మీ ఫర్నిచర్, ఎలక్ట్రికల్ పరికరాలను పై అంతస్తుకు తరలించండి.
ఇంకా నీటిమట్టం పెరుగుతుంటే వెంటనే ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లండి.

ఫొటో సోర్స్, Getty Images
వరదల తరువాత ఏం చేయాలి?
వరదలు చాలా ప్రమాదాలను తీసుకువస్తాయి.
వరదనీటిలో పాములు కొట్టుకువస్తాయి. కరెంట్ తీగలు వరదనీటిలో పడిపోతాయి.
డ్రైనేజీ నీరు, వరద నీరు కలిసి వ్యాధులకు కారణమవుతాయి.
అందుకే వరదలు తగ్గాక ఇంటికి తిరిగిరావాలనుకుంటే స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకోవాలి.
వరద ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులు ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటాయి.
అందుకే అధికారుల నుంచి మీ ప్రాంతంలోని పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకున్నాకే తిరిగి వెళ్లాలి. అంతవరకు సురక్షిత ప్రాంతంలోనే ఉండాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














