‘నా ఆర్థిక మూలాలనూ దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు’ అన్న బాలినేని, వైసీపీ రియాక్షన్ ఏంటి ?

ఫొటో సోర్స్, Balineni/FB
- రచయిత, జి.వి.సాయినాథ్
- హోదా, బీబీసీ కోసం
‘మూడేళ్లుగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నా. రెండు రోజుల్లో అన్ని విషయాలూ బయట పెడతా’ అని వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బీబీసీతో అన్నారు.
బుధవారం (సెప్టెంబరు 18) నాడు వైసీపీకి రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఆ లేఖలోని విషయాలతోపాటు బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నష్టం చేస్తున్నా భరిస్తూ వచ్చాlని, చివరికి నేరుగా తన ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని బాలినేని ఆరోపించారు.
మూడేళ్లుగా పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానని, చివరికి భరించలేక పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని ఆయన బీబీసీకి చెప్పారు.


ఫొటో సోర్స్, FB
వైసీపీలో విలువలు ఎక్కడున్నాయి: బాలినేని
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అనుసరించిన విలువల రాజకీయాలు వైసీపీలో ఎక్కడున్నాయని బాలినేని ప్రశ్నించారు. వై.ఎస్. చనిపోయిన తర్వాత జగన్ కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ మంత్రులుగా చేస్తానని ఆ రోజు జగన్ చెప్పారని, కానీ ఆయన ఐదేళ్ల హయాంలో ఈ 17 మందిలో ఎంతమందిని మంత్రులుగా చేశారని బాలినేని ప్రశ్నించారు.
తాను రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడతానని బాలినేని అన్నారు.

ఫొటో సోర్స్, FB
‘పవన్‌ను కలుస్తా’
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను గురువారంనాడు విజయవాడలో కలుస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి బీబీసీకి తెలిపారు.
వైసీపీని వీడటం తన కుమారుడికి ఇష్టం లేదన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. తాను, తన కుమారుడు పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నామని బీబీసీతో అన్నారు.
‘జగన్‌కు అధికారం పోగానే మీకు విలువలు గుర్తొచ్చాయా’
పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించి, అధికారం పోయిన తర్వాత పార్టీని వీడి వెళ్లే నాయకుల జాబితాలోకి సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా చేరడం దురదృష్టకరమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు.
‘‘విలువల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న బాలినేని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విలువల కోసం వెళ్లిపోయారు?’’ అని రాజీవ్ ప్రశ్నించారు.
బాలినేని జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందనీ, కానీ అదే జనసేన అదే టీడీపీ కూటమి నేతలు బాలినేనిపై ఎన్నో అవినీతి ఆరోపణలను సంధించారని కొండా రాజీవ్ గాంధీ అన్నారు.
‘‘అలాంటి పార్టీలతో బాలినేని ఇప్పుడు ఎలా అంట కాగుతారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
నిత్యం ప్రజలతో మమేకమయ్యే తమ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌కు ఇలాంటి నేతలు ఎంతమంది వెళ్లినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














