భగత్ సింగ్‌కు మాస్టారు అయిన జతీంద్ర నాథ్ దాస్ ఊపిరితిత్తుల్లోకి డాక్టర్ బలవంతంగా లీటర్ పాలు పంపారు, ఎందుకు?

ఫొటో సోర్స్, PIB
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భగత్ సింగ్ 1928 డిసెంబర్‌లో కాంగ్రెస్ సమావేశం కోసం కలకత్తా వెళ్లినప్పుడు ఫణీంద్ర ఘోష్ ఆయనకు జతీంద్ర నాథ్ దాస్‌ను పరిచయం చేశారు. హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ విప్లవకారుడు జతీంద్ర నాథ్ దాస్. ఆయన తన ఆర్మీ కోసం విపరీతంగా కష్టపడేవారు.
కపిలా టోలా వీధిలోని ఒక పార్క్‌లో ఈ భేటీ జరిగింది. అప్పట్లో భగత్ సింగ్ తనకు బాంబు తయారు చేయడం నేర్పించే వ్యక్తి కోసం వెతుకుతున్నారు.
బాంబుల తయారీలో జతీంద్రకు మంచి నైపుణ్యం ఉండేది. సచింద్ర నాథ్ సాన్యాల్ నుంచి జతీంద్ర, బాంబులు తయారు చేయడం నేర్చుకున్నారు.
భగత్ సింగ్‌కు బాంబుల తయారీ నేర్పడానికి మొదట జతీంద్ర ఒప్పుకోలేదు. కానీ, భగత్ సింగ్ పట్టు విడవకపోవడంతో ఆయన సరే అన్నారు. మల్వీందర్‌జీత్ సింగ్ వచైడ్ రాసిన ‘‘భగత్ సింగ్ ద ఎటర్నల్ రెబల్’’ అనే పుస్తకంలో దాని గురించి ప్రస్తావన ఉంది.

‘‘దీని కోసం ఆగ్రాకు రావాల్సి ఉంటుందని జతీంద్రకు భగత్ సింగ్ చెప్పారు. ఈ సమయంలో ఆగ్రాలో చలి తీవ్రంగా ఉంటుంది కాబట్టి, బాంబుల తయారీలో అవసరమైన గన్ కాటన్ కోసం కావాల్సినవి అక్కడ దొరక్కపోవచ్చని భగత్‌తో జతీంద్ర అన్నారు’’ అని మల్వీందర్‌జీత్ సింగ్ తన పుస్తకంలో రాశారు.
కలకత్తాలో అవి సులభంగా దొరుకుతాయని, అక్కడే బాంబు తయారీ నేర్చుకోవడం సముచితంగా ఉంటుందని భావించారు.
ఇందుకోసం కలకత్తాలో ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేయాలని ఫణీంద్ర, భగత్ సింగ్‌లకు జతీంద్ర చెప్పారు.
ఫణీంద్ర ఈ పని కోసం ఆర్య సమాజ్ మందిర్‌లోని పై అంతస్తులో ఉన్న ఒక గదిని ఎంపిక చేశారు. బాంబు తయారీకి కావాల్సిన వస్తువులు కొనడం కోసం ఫణీంద్రకు భగత్ సింగ్ 50 రూపాయలు ఇచ్చారు.
కాలేజ్ స్క్వేర్‌కు దగ్గర ఉన్న ఒక దుకాణం నుంచి వారు వస్తువులన్నీ కొన్నారు. కలకత్తా నుంచి భగత్ సింగ్ తిరిగి వెళ్లేటప్పుడు జతీంద్ర ఆయనకు రెండు బాంబు షెల్స్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, UNISTAR
ఆగ్రా వెళ్లి విప్లవకారులకు బాంబు తయారీలో శిక్షణ
ఆ తర్వాత జతీంద్ర నాథ్ దాస్ 1929 ఫిబ్రవరిలో ఆగ్రాకు వెళ్లారు. ఈ ప్రదేశాన్ని విప్లవకారుల కోటగా పరిగణించేవారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి జతీంద్రను భగత్ సింగ్ ఆహ్వానించారు.
ఆగ్రాలో జతీంద్రకు ‘మాస్టార్‌జీ’ అనే కొత్త పేరు వచ్చింది. అక్కడ బాంబులు తయారు చేయడానికి హీంగ్ కీ మండీ అనే ఏరియాలో ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నారు.
ఆ ఇంట్లో ఆయన విప్లవకారుల కోసం చాలా బాంబులు తయారు చేశారు. అక్కడున్న వారికి బాంబు కవర్ డిజైన్ చేయడం, గన్ కాటన్‌తో ఫ్యూజులు, పేలుడు పదార్థాలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు.
భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సదాశివ రావు, ఫణీంద్రలు ఝాన్సీ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో బాంబులను పరీక్షించారు.

ఫొటో సోర్స్, INDIAN POST
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్వామ్యం
జతీంద్ర నాథ్ దాస్ విప్లవకారునిగా మారకముందు, 1920-21లో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్లారు.
ఆయన బెంగాల్‌లోని అనేక జైళ్లలో గడిపారు. అక్కడ చాలా హింసను భరించారు.
జైలు అధికారుల తీరును నిరసిస్తూ 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు.
దీంతో ఆయనను బెంగాల్ జైలు నుంచి మియాన్వాలి జైలుకు తరలించారు. సహాయ నిరాకరణ ఉద్యమం ముగిసిన తర్వాత ఆయన మళ్లీ కళాశాల చదువును కొనసాగించారు. కానీ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలనే తన అభిరుచిని ఆయన ఎప్పుడూ వదల్లేదు.
కాకోరీ రైలు దోపిడీ ఘటన అనంతరం 1926 నవంబర్ 7న స్వాతంత్ర్య సమరయోధుల అరెస్టులు మొదలైనప్పుడు జతీంద్ర కూడా అరెస్ట్ అయ్యారు.
జతీంద్ర గంభీరంగా ఉండేవారు. చాలా తక్కువగా, మృదువుగా మాట్లాడేవారు. ఆయన తక్కువగా మాట్లాడినప్పటికీ, సహచరులు ఆయనవైపు ఆకర్షితులయ్యేవారు. లాహోర్ కుట్ర కేసులో ఆయన మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ కావడం అది అయిదోసారి.

ఫొటో సోర్స్, CHAMAN LAL
1929 జులై 10న నిరాహార దీక్ష మొదలు
అదే సమయంలో భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ నిరాహార దీక్షలోనే ఉన్నారు. కానీ, వారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.
సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు మరికొంత మంది విప్లవకారులు నిరహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిలో అప్పటి వరకు జతీంద్ర నాథ్ దాస్‌కు మాత్రమే నిరాహార దీక్ష చేసిన అనుభవం ఉంది.
కానీ, భావోద్వేగ కారణాల కోసం నిరాహార దీక్ష చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. రివాల్వర్, పిస్టల్‌తో చేసే పోరాటం కంటే నిరాహార దీక్ష చాలా కఠినమైన పోరాటం అని జతీంద్ర నాథ్ నమ్మేవారు. అయినప్పటికీ, ఆయన జైల్లో మెరుగైన సౌకర్యాలను డిమాండ్ చేస్తూ 1929 జులై 10న నిరాహార దీక్ష మొదలుపెట్టారు.
సమ్మె చేస్తూ అనారోగ్యానికి గురైతే ఎలాంటి చికిత్సా తీసుకోకూడదని, అధికారులు బలవంతంగా తినిపించాలని చూస్తే వీలైనంతవరకు ప్రతిఘటించాలని కూడా వారు నిర్ణయించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శివ వర్మ తన పుస్తకం ‘రెమినెన్స్ ఆఫ్ ఫెలో రివల్యూషనరీస్’లో ఇలా రాశారు. ‘‘ప్రారంభంలో విప్లవకారులందరూ నడవడం, అటూ ఇటూ తిరగడం చేశారు. ఆకలివేస్తే, లేదా శరీరం బలహీనంగా మారితే వాళ్లంతట వాళ్లే దీక్షను విరమిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సమ్మెను పెద్దగా పట్టించుకోలేదు. జైలు అధికారులు మమ్మల్ని ఊరించడం కోసం మా ప్లేట్లలో ఆహార పదార్థాలను ఉంచేవారు. వాళ్లు వెళ్లిపోగానే విప్లవకారులంతా ఆ ఆహారాన్ని పారేసేవారు. ఆ ఆహార పదార్థాల వైపు కనీసం చూడని ఒకే ఒక్క వ్యక్తి జతీంద్ర నాథ్ దాస్ మాత్రమే’’ అని రాశారు.

ఫొటో సోర్స్, UNISTAR
ముక్కు ద్వారా పాలు తాగించే ప్రయత్నం
పది రోజుల తర్వాత, కొంతమంది ఖైదీల పరిస్థితి దిగజారడంతో సర్కారు వారు పిలిపించిన వైద్యులు, సమ్మె చేస్తున్న ఖైదీలకు బలవంతంగా పాలు తాగించేందుకు ప్రయత్నించారు.
‘‘బలిష్టంగా ఉన్న 8 లేదా 10 మంది వ్యక్తులు, సమ్మె చేస్తున్న వారిలో ఒకరిని చుట్టుముట్టి, వారిని బలవంతంగా నేలపై పడుకోబెడతారు. ఖైదీ అప్పుడు ప్రతిఘటించినప్పటికీ, చివరకు పది మంది బలమైన వ్యక్తుల ముందు ఓడిపోతారు. వారంతా కలిసి ఆ ఖైదీని గట్టిగా నేలపై అదిమిపట్టుకుంటారు.
అప్పుడు వ్యక్తి ముక్కు ద్వారా కడుపులోకి ఒక పొడవైన ట్యూబ్‌ను పంపిస్తారు. గట్టిగా దగ్గడం ద్వారా లేదా ట్యూబ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఖైదీలు ప్రయత్నిస్తారు. ఇది డాక్టర్ల సహనాన్ని పరీక్షిస్తుంది. కొన్నిసార్లు వైద్యులు సహనం కోల్పోయి, ఆ ఖైదీని అలాగే వదిలేసి మరో ఖైదీ వైపు వెళ్తారు’’ అని శివ వర్మ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, UNISTAR
జతీంద్ర నాథ్ ఊపిరితిత్తుల్లోకి లీటర్ పాలు..
వైద్యులు చేసే ఈ ప్రక్రియ మొత్తం జతీంద్రకు తెలుసు. అందుకే తొలిరోజే వైద్యులు ఆయనను వదిలేశారు. ఆయన జోలికి వెళ్లలేదు. జతీంద్రకు పాలు తాగించేందుకు ప్రయత్నించిన డాక్టర్ గతంలో లాహోర్ మానసిక ఆసుపత్రికి ఇన్‌చార్జిగా పనిచేశారు. ప్రజలకు బలవంతంగా ఆహారం ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు.
మానసిక రోగులతో ఎక్కువగా ఉండటం వల్ల ఆయన స్వభావం కూడా వారిలాగే మారింది.
జతీంద్ర ముందు తన పప్పులు ఉడక్కపోవడంతో ఆ డాక్టర్ చాలా అసహనానికి గురయ్యారు. ‘‘రేపు నువ్వు నన్ను ఎలా అడ్డుకుంటావో చూస్తా’’ అంటూ అందరి ముందే జతీంద్రకు ఆ డాక్టర్ సవాలు విసిరారు.
జులై 26న ఖైదీలందర్నీ పరీక్షించిన తర్వాత, ఆయన జతీంద్ర నాథ్ దాస్ దగ్గరకు వచ్చారు. జతీంద్రకు బలవంతంగా పాలు తాగించేందుకు ఆయన చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. తర్వాత జతీంద్ర ముక్కులోకి పైపును పంపించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పైపు వంగి నోట్లోకి రావడంతో జతీంద్ర దానిని తన దంతాలతో నొక్కి పట్టుకున్నారు.
‘‘ఆ తర్వాత మరో నాసికా రంధ్రం ద్వారా పైపును పంపించేందుకు డాక్టర్ ప్రయత్నించారు. వెంటనే జతీంద్ర నాథ్ దాస్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయినప్పటికీ, పైపు పొట్టలోకి చేరకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. డాక్టర్ చొప్పించిన ఆ పైపు పొట్టలోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. నొప్పితో ఆయన విలవిల్లాడారు. డాక్టర్ కనీసం ఆయన ముఖం కూడా చూడకుండా పైపు ద్వారా ఒక లీటర్ పాలను లోపలికి పంపించారు. తాను అనుకున్నది చేశాననే విజయగర్వంతో నొప్పితో బాధపడుతున్న జతీంద్రను పట్టించుకోకుండా మరో ఖైదీ దగ్గరకు వెళ్లిపోయారు ఆ డాక్టర్’’ అని శివ వర్మ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, PUNJAB PRISON DEPT.
మందులు, టీకాలు తీసుకునేందుకు నిరాకరణ
ఈ ఘటన ఆసుపత్రిలో జరిగింది. దాస్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో ఆయన స్నేహితులు దాదాపు డజన్ మంది ఆయన దగ్గరకు వెళ్లారు.
జతీంద్ర శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. విపరీతంగా దగ్గుతున్నారు. శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నారు.
ఆయన పరిస్థితి చూసి స్నేహితులంతా గట్టిగా అరవడం మొదలు పెట్టారు.
అరగంట తర్వాత డాక్టర్ల బృందం అక్కడికి చేరుకుంది. జతీంద్రను మంచంపై పడుకోబెట్టారు. అప్పటికే దాస్ దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వైద్యులు ఆయన నోటిలో మందులు వేయడం మొదలుపెట్టగానే, ఆయనకు ఎక్కడి నుంచి శక్తి వచ్చిందో తెలియదు గానీ గట్టిగా ‘వద్దు’ అని అరిచారు. మందులు తీసుకోవాలని ఆయన స్నేహితులు పట్టుబట్టినప్పటికీ, అంత నొప్పిలో కూడా ఆయన వారిని చూసి నవ్వారు.
చివరి వరకు ఆయన ఎలాంటి మందులు తీసుకోలేదు, టీకా వేయనివ్వలేదు. విసుగు చెంది డాక్టర్లు వెళ్లిపోగానే ఆయన కళ్లు తెరిచారు. తనకు నాలుగు దిక్కులా నిలుచున్న తన స్నేహితులను చూసి ఆయన మరోసారి నవ్వారు. చాలా బలహీన స్వరంతో జితేంద్ర సన్యాల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇక వాళ్లు నాకు ఎప్పటికీ ఏమీ తినిపించలేరు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, CHAMAN LAL
భగత్ సింగ్ చెప్పడంతో ఎనిమా చేశారు
ఆ రోజు నుంచి ఆయన క్రమంగా మరణానికి దగ్గరయ్యారు. కొన్ని రోజుల్లోనే ఆయన పరిస్థితి చాలా దిగజారింది. ఆయన శరీరమంతా విషం పాకింది.
ఆయన కళ్లు సగం మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఆయనకు ఎనిమా చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ, దాస్ అందుకు ఒప్పుకోలేదు.
‘‘భగత్ సింగ్ చెబితే జతీంద్రదాస్ వింటారని ప్రభుత్వానికి ఎవరో సలహా ఇచ్చారు. దీంతో భగత్ సింగ్‌ను సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. భగత్ సింగ్ కోరడంతో ఎనిమా చేయించుకోవడానికి దాస్ ఒప్పుకున్నారు. అయితే, అక్కడే ఉన్న ఒక జైలు అధికారి జతీంద్రను ఇప్పటివరకు వైద్యానికి ఒప్పుకోని మీరు, భగత్ సింగ్ చెప్పడంతోనే ఎందుకు రాజీపడ్డారు? అని ప్రశ్నించారు.
అప్పుడు జతీంద్ర నాథ్ దాస్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘మిస్టర్, మీకసలు భగత్ సింగ్ ఎంత గొప్పవారో తెలుసా? ఆయన చెప్పే ఏ మాటకూ నేను ఎదురుచెప్పను’ అని అన్నారు. ఇలాగే ఒకసారి జతీంద్రను మందులు తీసుకోవాల్సిందిగా భగత్ సింగ్ కోరారు. అప్పుడు ‘చూడు, భగత్ సింగ్ నేను నా వాగ్దానాన్ని ఉల్లంఘించను. అలాగే మీరు చెప్పే మాటను కూడా నిరాకరించలేను. కాబట్టి మీరు భవిష్యత్‌లో ఇలాంటి అభ్యర్థనలు చేయొద్దు’ అని జతీంద్ర బదులిచ్చారు’’ అని శివ వర్మ తన పుస్తకంలో వివరించారు.
విడుదలకు నిరాకరణ
జతీంద్ర పరిస్థితి విషమించడం చూసి ప్రభుత్వం మొదట ఆయనను మయో ఆసుపత్రికి పంపించాలనుకుంది. కానీ, అందుకు జతీంద్ర ఒప్పుకోలేదు.
దాంతో, ఎలాంటి షరతులు లేకుండా జతీంద్రను జైలు నుంచి విడుదల చేయాలని జైలు కమిటీ సిఫారసు చేసింది. కానీ, ప్రభుత్వం పట్టింపులకు పోయి ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

ఫొటో సోర్స్, HARPER COLLINS
సహచరులందరికీ బిస్కెట్ తినిపించారు
కొన్ని రోజుల తర్వాత జైలు అధికారులు, జతీంద్రను జైలు నుంచి బయటకు పంపించేందుకు శక్తిమేర కృషిచేశారు. అయితే, అందుకు ఒప్పుకోనంటూ జతీంద్ర, జైలు సూపరింటెండెంట్‌కు సందేశం పంపారు.
జతీంద్రకు ఇష్టం లేకుండా జైలు నుంచి బలవంతంగా ఆయనను బయటకు పంపించబోమని ఆ బ్రిటిష్ సూపరింటెండెంట్ ప్రమాణం చేశారు.
‘‘దాదాపు ఒక వారం తర్వాత, జతీంద్ర మా అందర్నీ పిలిచారు. ఆయనతో ఉండటానికి ఆయన సోదరుడు కిరణ్ దాస్‌కు అనుమతిచ్చారు. ఆయన ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారు. జతీంద్ర మా అందరికీ ఒక బిస్కెట్ ఇస్తూ, ‘నేను మీ అందరి నిరాహార దీక్షను భగ్నం చేయడం లేదు. ఇది మీ అందరితో నేను తినే ఆఖరి భోజనం. ఇది మీ పట్ల నాకున్న ప్రేమకు చిహ్నం’ అని అన్నారు. మేం అందరం ఆ బిస్కెట్ తిన్నాం.
తర్వాత ఆయన నజ్రుల్ ఇస్లాం ప్రముఖ పాట ‘బోలో వీర్, చిర్ ఉన్నత్ మామ్ షీర్’ పాడారు. నడిరాత్రి వరకు బలహీన స్వరంతో ఆయన మాతో మాట్లాడుతూనే ఉన్నారు. మాతో పాటు అక్కడ లేని ఇతర వ్యక్తుల గురించి అడిగారు. కొన్నిరోజుల తర్వాత ఆయన పూర్తిగా మాట్లాడలేకపోయారు. ఆయన చేతులు, కాళ్లు వాచిపోయాయి. కళ్లు దాదాపు మూసుకుపోయాయి. అలాంటి పరిస్థితిలోనూ ఆయన మేం అడిగిన ప్రతి ప్రశ్నకూ తల ఊపుతూ అవును, కాదు అనే సమాధానం చెప్పేవారు’’ అని శివ వర్మ తన పుస్తకంలో రాశారు.
జతీంద్ర నాథ్ దాస్ మరణం
నిరాహార దీక్షకు 63వ రోజు, సెప్టెంబర్ 13న ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్ ఆయనకు ఇంజెక్షన్ ఇవ్వాలనుకున్నారు.
దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న జతీంద్రకు తాము ఇంజెక్షన్ ఇచ్చే విషయం తెలియదని వారు పొరబడ్డారు. చేతికి డాక్టర్ స్పిరిట్ రాయగానే, ఆయన కళ్లు తెరిచి బలహీన స్వరంతో ‘వద్దు’ అని అన్నారు.
అది విని, డాక్టర్లు వెనక్కి తగ్గారు. తర్వాత, కాసేపటికి ఆయన కళ్లు శాశ్వతంగా మూతబడ్డాయి. ఆ రోజు జైల్లోని ఆయన సహచరులను చివరి చూపు కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారంతా ఆయన చుట్టూ నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు.
జతీంద్ర నాథ్ దాస్ 63 రోజుల నిరాహార దీక్ష తర్వాత చనిపోయారు. అప్పుడు ఆయన వయసు 24 ఏళ్లు.
డాక్టర్లు కూడా ఒక వరుసలో నిలబడి తల వంచి ఆయనకు నివాళులు అర్పించారు. జైలులోని బ్రిటిష్ సూపరింటెండెంట్ కూడా జతీంద్ర గౌరవార్థం తన టోపీ తీసి సైనిక వందనం సమర్పించారు.
‘‘జతీంద్ర దాస్ నిరాహార దీక్ష చేస్తూ ఈ రోజు మధ్యాహ్నం 1:10 గంటలకు చనిపోయారు. నిన్న రాత్రి నిరాహార దీక్షలో ఉన్న అయిదుగురు తమ దీక్షను విరమించారు. ఇప్పుడు కేవలం భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ మాత్రమే దీక్షలో ఉన్నారు’ అని ఆరోజు లండన్‌కు పంపిన సందేశంలో వైస్రాయ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఖరి చూపుకు పోటెత్తిన ప్రజలు
జతీంద్ర నాథ్ దాస్ పరిస్థితి విషమంగా ఉందన్న వార్త లాహోర్ అంతటా దావానలంలా వ్యాపించింది. ఆసుపత్రి చుట్టూ చాలా మంది జనం గుమిగూడారు.
జతీంద్ర భౌతిక కాయాన్ని కలకత్తాకు తీసుకొచ్చేందుకు సుభాష్ చంద్రబోస్ 600 రూపాయలు పంపించారు.
లాహోర్ నుంచి కలకత్తా వరకు ప్రతీ స్టేషన్‌లో వేలాది మంది ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. జైలు నుంచి లాహోర్ వరకు ఆయన అంతిమ యాత్రకు దుర్గా భాభీ నేతృత్వం వహించారు. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన చాలామంది అగ్ర నేతలు కూడా వారితో నడిచారు.
ఆయన చివరి చూపు కోసం కాన్పూర్‌కు గణేశ్ శంకర్ విద్యార్థి, అలహాబాద్ స్టేషన్‌కు కమలా నెహ్రూ వచ్చారు.
హౌరాకు ఆయన భౌతిక కాయం చేరుకోగానే స్వయంగా సుభాష్ చంద్రబోస్ వారితో కలిశారు. హుగ్లీ నది తీరానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్లడానికి చాలా గంటల సమయం పట్టింది.
దారి పొడవునా ఆయన భౌతిక కాయంపై ప్రజలు పూల వాన కురిపించారు.
వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన మోతీలాల్ నెహ్రూ
జతీంద్ర నాథ్ దాస్ మరణానికి నిరసనగా ఇద్దరు పంజాబ్ నాయకులు మొహమ్మద్ ఆలమ్, గోపీచంద్ భార్గవలు పంజాబ్ కౌన్సిల్‌కు రాజీనామా చేశారు. లాహోర్ జైలులో ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 14న సెంట్రల్ అసెంబ్లీలో మోతీలాల్ నెహ్రూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మానవతా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తోందంటూ ఆయన ఆరోపించారు.
ఈ ప్రతిపాదనకు మదన్ మోహన్ మాలవీయ మద్దతు ఇచ్చారు. ‘‘ఈ వ్యక్తులంతా అత్యున్నత ఆదర్శాలు కలిగినవారు. ప్రభుత్వం వీరిని సాధారణ నేరస్థుల్లా పరిగణించకూడదు’’ అని మదన్ మోహన్ మాలవీయ అన్నారు. 55 ఓట్లతో ఈ ప్రతిపాదనకు ఆమోదం దక్కింది.
జతీంద్ర నాథ్ దాస్ చేసిన త్యాగం వృథా కాలేదు. ఆయన చనిపోయాక 18 ఏళ్ల తర్వాత బ్రిటిష్ వారు భారత్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














