ఆధార్ కార్డు, పాన్ కార్డు పోతే ఏం చేయాలి?

- రచయిత, జక్కుల బాలయ్య, జి.వి. సాయినాథ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రకృతి విపత్తులు, ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అయినవారితో పాటు తమ విలువైన వస్తువులు, సర్టిఫికెట్లను కోల్పోవడం జరుగుతుంటుంది.
ధ్రువపత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు వరదల్లో కొట్టుకుపోయినా, అగ్నిప్రమాదాలలో కాలిపోయినా వాటిని తిరిగి పొందడం ఎలాగో చాలామందికి తెలియదు.
ఉదాహరణకు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆస్తి కాగితాల వంటివి పోతే ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారమేంటి?

ఆధార్ కార్డ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, ఇతర పథకాల్లో చాలా వాటికి ఆధార్ కార్డు అవసరమవుతుంది.
చిరునామా ధ్రువీకరణకు కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. రోజువారీ జీవితంలో కీలకంగా మారిన ఆధార్ కార్డు పోతే మళ్లీ తిరిగి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో ఆధార్ కార్డును తిరిగి పొందే వీలుంది.
ఆధార్ కార్డు పోయినట్లైతే uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కార్డును మళ్లీ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.
ఆధార్ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డు మీద ఉన్న ఆప్షన్లలో డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, కింద ఉన్న కోడ్‌ను ఎంటర్ చేయాలి.
ఆధార్ కార్డు మీ ఫోన్ నంబర్‌కు లింక్ అయి ఉంటే, మీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది.
దానిని ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఫొటో సోర్స్, uidai.gov.in
అయితే, ఇదంతా మీ ఆధార్ కార్డుకు మీ ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే మాత్రమే. మరి ఆధార్, ఫోన్ నంబర్‌తో లింక్ కాకపోతే ఏం చేయాలి?
అలాంటప్పుడు ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది.
ప్రభుత్వ అధీకృత ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి మీ వివరాలు చెప్పి, ఆధార్ కార్డును పొందవచ్చు. దాని కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలతో పాటు సీఎస్‌సీ సెంటర్స్ (కామన్ సర్వీసెస్ సెంటర్స్), మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు సేవలు అందిస్తున్నారు.
మీ ఆధార్ కార్డు నంబర్‌కి ఫోన్ నంబర్ లింక్ చేయించుకోవాలి. ఫోన్ నంబర్ లింక్ అయిన తర్వాత, ఆ నంబర్‌కి వచ్చే ఓటీపీ ఆధారంగా, మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఆధార్ కార్డు నంబర్ కూడా గుర్తు లేనిపక్షంలో ప్రింట్ ఆధార్ అనే ఆప్షన్ ద్వారా కూడా ఆధార్ కార్డును తిరిగి పొందవచ్చు. సంబంధిత ఆధార్ కేంద్రాలకు వెళ్లి వ్యక్తి వివరాలు, పిన్ కోడ్ వంటివి ఎంటర్ చేస్తారు. వివరాలు సరిపోలితే మీ వేలిముద్ర వేయడం ద్వారా ఆధార్ వివరాలు వస్తాయి. ఆ తర్వాత ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పాన్ కార్డు
ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకు లావాదేవీలు ఇతరత్రా వ్యవహారాలకు పాన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ పాన్ కార్డు పోయినట్లయితే ఇలా తిరిగి పొందవచ్చు.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్‌సైట్ onlineservices.nsdl.comలోకి వెళ్లి రిక్వెస్ట్ ఫర్ రీ ప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత విండోలో మీ పాన్ కార్డు నంబర్, ఆ కార్డుకి లింక్ అయి ఉన్న మీ ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీరు పుట్టిన నెల, సంవత్సరం నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.

ఫొటో సోర్స్, onlineservices.nsdl.com
అప్పుడు మరో వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పాన్‌కార్డు రీప్రింట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించి, పాన్ కార్డును పొందవచ్చు.
ఆఫ్‌లైన్‌లోనూ పాన్ కార్డును పొందే అవకాశం ఉంది. మీకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాలు, లేదా సీఎస్‌సీ సెంటర్లు, ప్రాంతీయ ఆదాయ పన్ను కార్యాలయాలకు వెళ్లి, మీ వివరాలు చెప్పి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, civilsupplies.ap.gov.in
రేషన్ కార్డు..
రోజువారీ జీవితంలో అవసరమైన కీలక పత్రాల్లో రేషన్ కార్డు కూడా ఒకటి.
ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం పొందాలన్నా, ఏ పథకానికైనా రేషన్ కార్డు ముఖ్యం.
వరదల్లో కొట్టుకుపోయినా లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా రేషన్ కార్డు పోతే తిరిగి పొందే అవకాశం ఉంది.
వరదలు, అగ్నిప్రమాదాల వంటివి సంభవించినప్పుడు సాధారణంగా రెవెన్యూ శాఖ పంచనామా చేస్తుంది.
స్థానిక ఆర్‌ఐ బాధితుల ఇంటిని పరిశీలించి, ఆ ఇంట్లో జరిగిన నష్టం, కోల్పోయిన పత్రాల వంటి వివరాలు సేకరిస్తారు.
అనంతరం పరిహారం కోసం సిఫార్సులు చేస్తారు. పత్రాలు తిరిగి పొందడం కోసం పంచనామా కాపీని ఒక ఆధారంగా అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీ దగ్గర్లోని గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి మీ వివరాలు చెప్పి, దరఖాస్తు చేసుకుంటే డూప్లికేట్ రేషన్ కార్డు మంజూరు చేస్తారు.
ప్రతి సచివాలయంలోనూ వారి పరిధిలోని ప్రజల డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని, రేషన్ కార్డు పోతే వారి వివరాలు చెప్పి తీసుకోవచ్చని విజయవాడ నార్త్ తహసీల్దార్ సీహెచ్ శిరీషా దేవి ‘బీబీసీ’తో చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పద్ధతి ఉందని ఆమె చెప్పారు.

ఆస్తి పత్రాలు పోతే..
అనుకోని ఘటనల కారణంగా విలువైన ఆస్తి పత్రాలు పోగొట్టుకున్నా, పాడైపోయినా వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే, దానికి పద్ధతులు ఉన్నాయి.
ఆస్తులకు సంబంధించి.. ''సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్'' పత్రాల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సర్టిఫైడ్ కాపీస్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
''ఇంటి పత్రాలు, ఆస్తి కాగితాలు ఏమైనా పోగొట్టుకున్నప్పుడు వెంటనే 'సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్' కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
1999 నుంచి రికార్డులన్నీ డిజిటల్ ఫార్మాట్‌లోనే ఉన్నాయని, దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఇస్తారని రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ బాలకృష్ణ తెలిపారు.
1999కి ముందు పత్రాలైతే మాన్యువల్‌గా ఉన్నాయని, అందువల్ల వాటిని పరిశీలించి ఇచ్చేందుకు మూడు రోజుల గడువు పడుతుందని డీఐజీ చెప్పారు.
సర్టిఫైడ్ కాపీ కోసం 200 రూపాయల ఫీజుతో పాటు 20 రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన బీబీసీకి వివరించారు.
వివిధ కారణాలతో నష్టపోయిన లేదా కోల్పోయిన పత్రాలను పొందేందుకు నిర్ణీత పద్ధతులున్నాయని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ చెప్పారు.
భూమి హక్కు పత్రాలకు (టైటిల్ డీడ్) సంబంధించిన డూప్లికేట్ కాపీని ఆన్‌లైన్‌లోనూ పొందే అవకాశం ఉందని ఆయన బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














