సెనెగల్: పడవలో 30 కుళ్లిపోయిన మృతదేహాలు

సెనెగల్ వలసదారులు

ఫొటో సోర్స్, AFP

సెనెగల్ తీరంలో ఒక పడవలో 30కి పైగా కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైనికాధికారులు తెలిపారు.

రాజధాని డాకర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఒక పడవ గమ్యం లేకుండా తేలుతూ వెళ్తోందని నౌకాదళానికి సమాచారం అందినట్లు సెనెగల్ నావికాధికారులు ‘ఎక్స్‌’లో ప్రకటించారు.

సోమవారం ఉదయం ఆ పడవను ఒడ్డుకు తీసుకువచ్చారు.

‘మృతదేహాలు కుళ్లిపోయే పరిస్థితిలో ఉండడంతో వాటిని గుర్తించి బంధువులకు అప్పగించడం కష్టతరమవుతోంది’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

సెనెగల్ నుంచి 1500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులను చేరుకోవడానికి ప్రయత్నించే అక్రమ వలసదారుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది.

వీరంతా అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పడవలలో ప్రయాణిస్తుంటారు.

మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని.. మత్స్యకారులు ఈ పడవను చూడ్డానికి చాలా రోజుల ముందే అందులో ఉన్నవారు చనిపోయి ఉంటారని అధికారులు చెప్తున్నారు.

పడవ ఎప్పుడు, ఎక్కడ నుంచి బయలుదేరింది, అందులో ఎంతమంది ఉన్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు సెనెగల్ సైన్యం తెలిపింది.

ఆగస్ట్‌లోనూ సెనెగల్ వలసదారులుగా భావిస్తున్న కొందరి మృతదేహాలను డొమినికన్ రిపబ్లిక్ తీరంలో స్థానిక మత్స్యకారులు గుర్తించారు. అప్పుడు ఆ పడవలో 14కి పైగా కుళ్లిపోయిన మృతదేహాలున్నాయి.

అక్రమంగా వలస వెళ్లే ప్రయత్నంలో చనిపోతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో అక్రమ వలసల నివారణకు సెనెగల్ ప్రభుత్వం ఆగస్టులో 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది.

ఇటీవలి కాలంలో పడవలలో వలస వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వందలాది మందిని అధికారులు అడ్డుకున్నారు.

తరచూ విషాదాలు జరుగుతున్నా నిరుద్యోగం, సంఘర్షణ, పేదరికం వంటివి సెనెగల్ యువకులు పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు చెందిన కానరీ దీవులకు వెళ్లేందుకు కారణమవుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
port

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమ ఆఫ్రికాకు చెందిన యువకులు యూరప్ చేరుకోవడానికి కానరీ దీవులను ప్రవేశమార్గంగా ఎంచుకుంటారు.

ప్రమాదకరమే అయినా సహారా ఎడారి, మధ్యధరా సముద్రాలను దాటాల్సిన అవసరం ఉండకపోవడంతో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తారు.

అంతకుముందు ఏడాదితో పోల్చినప్పుడు 2023లో అట్లాంటిక్ మహాసముద్ర మార్గంలో వలసలు 161 శాతం ఎక్కువైనట్లు యూరోపియన్ బోర్డర్ ఏజెన్సీ ఫ్రాంటెక్స్ వెల్లడించింది.

దాదాపు 1,000 మంది మార్గమధ్యంలో మరణించడమో గల్లంతవడమో జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు.