గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి, ఈ రికార్డ్స్ ఎలా నమోదు చేస్తారు? దీనికి దరఖాస్తు చేయడం ఎలా?

కొణిదెల చిరంజీవి

ఫొటో సోర్స్, Twitter/Chiranjeevi Konidela

    • రచయిత, బి. నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నటుడు చిరంజీవి తన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. అందుకుగాను, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు దక్కింది.

సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏమిటి? ఈ రికార్డ్స్ ఎలా నమోదు చేస్తారు? అసలు దీని చరిత్ర ఏంటి? వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్, బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పబ్‌లో చర్చ.. కట్ చేస్తే..

గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం...

రికార్డులకూ ఓ బుక్ ఉండాలనే ఆలోచన 1950ల్లో సర్ హ్యూ బీవర్‌కు వచ్చింది. ఆయన ఓ రోజు ఐర్లాండ్‌లోని వెక్స్‌ఫోర్డ్‌లో ఓ పార్టీకి వెళ్లారు. అక్కడ, ఐరోపాలో అత్యంత వేగవంతమైన గేమ్ బర్డ్ ఏది? అనే చర్చ వచ్చింది.

ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. సరైన సమాధానం కోసం ఎక్కడ వెతకాలో వారికి అర్థం కాలేదు.

దీంతో, ప్రపంచంలోని వింతలు, విశేషాలు, రికార్డులు వంటివి చూడటానికి ఓ పుస్తకం ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. నారిస్, రాస్ మెక్విర్టర్ అనే మరో ఇద్దరితో కలిసి 1954లో లండన్‌లోని లడ్గేట్ హౌస్ దగ్గర రెండు గదులతో గిన్నిస్ సూపర్‌లెటివ్స్ పబ్లికేషన్‌ను ప్రారంభించారు.

వారానికి 90 గంటలు కష్టపడుతూ, పదమూడున్నర వారాలు కృషి చేసి తొలి గిన్నిస్ బుక్‌ను రూపొందించారు. 1955లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్‌తో తొలి పుస్తకం పబ్లిష్ అయింది.

జనాలు ఆ పుస్తకాన్ని అమితంగా ఇష్టపడటంతో ఆ బుక్ నాలుగు సార్లు రీ ప్రింట్ అయింది. దాదాపు లక్షా 87 వేల కాపీలు అమ్ముడయ్యాయని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రాశారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఫొటో సోర్స్, guinness world records website

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యమేంటి?

ప్రపంచాన్ని మరింత ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం తాము చేస్తున్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ వెబ్‌సైట్‌లో రాసుకుంది.

“ఫలానా వాళ్లు రికార్డులు సాధించారు అన్నది ప్రపంచానికి చూపెడితే, వాళ్లను చూసి చాలా మంది స్ఫూర్తి పొందవచ్చు.

కాళ్లు లేవు, చేతులు లేవు అయినా సరే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. పేదరికంలో ఉండి రికార్డు కొట్టారు. చదువు లేకపోయినా సాధించారు. 60 ఏళ్ల వయసులో వావ్ అనిపించారు.

ఇలా, స్ఫూర్తివంతమైన కథల గురించి తెలుసుకుని.. యస్, మనం కూడా ఏదైనా సాధించవచ్చు అనే అభిప్రాయాన్ని జనాలకు కలిగించడమే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రధానోద్దేశం” అని 14 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన స్వ్కాడ్రన్ లీడర్ జయసింహ బీబీసీ తెలుగుతో చెప్పారు. ఈయన ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షులు కూడా.

ఎన్ని రకాల రికార్డులు ఉంటాయి..?

రికార్డ్స్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు 5 కేటగిరీలుగా విభజించారు. అవి, ఆన్లైన్ రికార్డులు, కంపెనీ- ప్రొడక్ట్ రికార్డులు, భారీ ప్రదర్శనలు, చిన్న లేదా పెద్ద సైజు తయారీలు, టైం రికార్డ్స్ అని తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌కు ప్రామాణికం ఏంటి?

మనం ఒక యాక్టివిటీ చేశాం అనుకోండి. అది కచ్చితంగా కొలవదగినదిగా ఉండాలి. లీటర్లు, కిలోమీటర్లు, సెంటిమీటర్లు ఇలా ఏదో ఓ కొలమానం ఉండాలి.

ఆ రికార్డు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే బ్రేక్ చేసేలా ఉండాలి.

అది నిరూపించదగినదిగా ఉండాలి. కచ్చితమైన ఆధారాలు కావాలి.

ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా ఉండాలి.

పైన చెప్పిన అన్ని నిమయాల్ని అనుసరిస్తేనే రికార్డు నమోదుకు అనుమతిస్తామని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్

ఫొటో సోర్స్, Getty Images

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా?

“గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘అప్లై’ అనే దగ్గర క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.

అప్లికేషన్‌లో మొదటగా మన పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మెయిల్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరువాత మనం ఏ ఈవెంట్‌లో రికార్డు నమోదు చేయాలనుకుంటున్నామో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది” అని స్వ్కాడ్రన్ లీడర్ జయసింహ చెప్పారు.

“అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత 3 నెలల్లోపు ఎప్పుడైనా రిప్లై రావొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తుంటాయి. వాటిని పరిశీలించడానికి ఆ మాత్రం సమయం పడుతుంది.

ఒకవేళ తొందరగా అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ‘ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్’ సదుపాయం ఉంటుంది. దాని కోసం కొంత డబ్బులు చెల్లించాలి. తద్వారా, తక్కువ సమయంలోనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది” అని స్వ్కాడ్రన్ లీడర్ జయసింహ చెప్పారు.

“రికార్డులు రెండు రకాలుగా నమోదు చేస్తారు. ఒకటి మనం డాక్యుమెంటేషన్ రూపంలో పంపాలి. రెండోది ప్రదర్శన రూపంలో రికార్డు నమోదు చేయాలి.

డాక్యుమెంటేషన్ అంటే.. ఉదాహరణకు చిరంజీవి ఇన్నివేల స్టెప్పులు వేశారు. దానికి ఆధారాలు ఇదిగో అన్నట్లుగా ఆ వివరాలన్నీ అప్లికేషన్ ఫామ్‌కు జత చేయాలి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వాటిని పరిశీలించి టైటిల్ అందిస్తారు.

రెండోది టైం రికార్డ్స్. ఉదాహరణకు ఒక నిమిషంలో 30 బాణాలు వేస్తారు అనే రికార్డు ట్రై చేయాలనుకుంటే, దీనిని రెండు రకాలు నమోదు చేసే అవకాశం ఉంది.

ఒకటి, మన ఉన్న చోట రికార్డు నమోదు చేసేటప్పుడు ఇన్ని కెమెరాలు వాడాలి, లైవ్ స్ట్రీమ్ చేయాలి, టైమర్ ఫలానేదే వాడాలి వంటి సూచనలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ వారు పంపిస్తారు.

వాటిని ఫాలో అవుతూ, లోకల్‌గా ఉన్న గెజిటెడ్ అధికారుల సమక్షంలో ప్రదర్శన చేయాలి. గెజిటెడ్ అధికారుల విట్‌నెస్ సంతకాలతో ఆ ఫుటెజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపాలి. వాళ్లు దానిని పరిశీలించి రికార్డు టైటిల్ అందిస్తారు. దీనికి 3 నెలల సమయం పటొచ్చు” అని స్వ్కాడ్రన్ లీడర్ జయసింహ చెప్పారు.

“అలా కాదు అనుకుంటే.. గిన్నిస్ వరల్డ్స్ రికార్డ్స్ ప్రతినిధులు మన వద్దకు వచ్చి, దగ్గరుండి ప్రదర్శనను పరిశీలించి రికార్డు నమోదు చేస్తారు. వెంటనే రికార్డు టైటిల్ మన చేతిలో పెడతారు.

అయితే, దీని కోసం కొంత డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ ప్రతినిధుల విమాన ప్రయాణ ఖర్చులు, హోటల్, ఫుడ్ వంటివి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కనీసం రూ.5-6 లక్షలు ఖర్చు అవుతుంది” అని జయసింహ చెప్పారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఫొటో సోర్స్, Getty Images

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆఫీస్ ఎక్కడ ఉంది?

1954లో లండన్‌లో పుట్టిన ఈ సంస్థ ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. ఈ సంస్థ అంతర్జాతీయ కార్యాలయాలు లండన్, న్యూయార్క్, బీజింగ్, టోక్యో, దుబాయ్‌లలో ఉన్నాయి.

ఒకప్పుడు ఈ సంస్థ ప్రాంతీయ కార్యాలయాలు ఇండియాలో ఉండేవి. కానీ, ప్రస్తుతం అప్లికేషన్ దగ్గరి నుంచి సర్టిఫికేషన్ ప్రాసెస్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటంతో ప్రస్తుతం ఇండియాలో ఎలాంటి కార్యాలయాలు లేవని జయసింహ చెప్పారు.

అప్లికేషన్స్ ప్రాసెస్‌లో ఎవరికైనా డౌట్ ఉంటే, ఇది వరకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు అప్లై చేసిన వారి సూచనలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, వెబ్ సైట్, గిన్నిస్ బుక్

ఫొటో సోర్స్, Guinnessworldrecords

ఫొటో క్యాప్షన్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌లోని వివరాలు

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సరికొత్త రికార్డులు..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం..

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 15కోట్ల 30 లక్షలకుగా బుక్స్‌ అమ్ముడయ్యాయి. 100కు పైగా దేశాలలో 40 పైగా భాషలలో విడుదల చేశారు.

2023లోనే 18 లక్షలకుపైగా బుక్స్ అమ్ముడయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ స్థాయిలో ఎందుకు అమ్ముడవుతున్నాయంటే, ప్రతి ఏడాది దాదాపు 80 శాతం కొత్త రికార్డులను బుక్‌లో నమోదు చేస్తారు.

69 ఏళ్లుగా ఈ సంస్థ రికార్డులు నమోదు చేస్తోంది. 2023 వరకు సుమారు 65 వేలకుపైగా రికార్డు టైటిల్స్ అందించింది.

ఒక్క 2023లోనే 215 దేశాల నుంచి 57వేలకుపైగా రికార్డు నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి 4,900కుపైగా రికార్డ్స్‌ ఆమోదించారు.

ప్రస్తుతం 17 దేశాల నుంచి 18 భాషలు మాట్లాడగలిగే 80 మందితో కూడిన న్యాయనిర్ణేతల బృందం ఉంది.

1999వరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్‌తో బుక్ విడుదల చేసేవారు. ఆ తరువాత 2000 సంవత్సరం నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌తో బుక్ విడుదల చేస్తున్నారు.

ఇప్పటికీ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనే పేరుతోనే ప్రచురిస్తున్నారు. వెబ్‌సైట్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఇలా అన్ని ప్లాట్‌ఫామ్స్ ఈ పేరుతోనే ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)