హేమ కమిటీ రిపోర్ట్: సూపర్ స్టార్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?

అమితాబ్ బచ్చన్ , రజనీకాంతో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హేమ కమిటీపై అమితాబ్ బచ్చన్ ఇప్పటి వరకు మాట్లాడలేదు, రజనీకాంత్ తనకు దాని గురించి తెలియదని అన్నారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మరోవైపు మలయాళ సినిమా రంగంలో మహిళల లైంగిక వేధింపులపై ఇటీవల వెలువడిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పటికే భారతదేశ సినీ పరిశ్రమ వర్గాలలో కల్లోలాన్ని సృష్టించింది.

అయితే దీనికి సంఘీభావం, మద్దతు తెలిపింది ఎక్కువగా మహిళలే. అందులోనూ స్టార్ హీరోయిన్లు లేరు. అలాగే స్టార్ హీరోలు కూడా. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమని విమర్శకులు అంటున్నారు.

కేరళ సినీ పరిశ్రమకు చెందిన 51 మంది ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా జరుగుతున్న లైంగిక దోపిడీని బట్టబయలు చేసింది.

‘‘కావాలనుకున్నప్పుడల్లా సెక్స్‌కు అందుబాటులో ఉండాలి’’ అని, పని కావాలనుకుంటే, “రాజీ పడాలి, సర్దుబాటు చేసుకోవాలి’’ అని కొందరు వ్యక్తులు మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో అన్నట్లు నివేదిక వెల్లడించింది.

ఒక ప్రముఖ నటుడి ఆదేశానుసారం, ఒక అగ్రనటిపై కొంతమంది పురుషులు లైంగిక దాడి చేసిన ఘటన తర్వాత మలయాళ సినిమాలలో పని చేసే మహిళల బృందం ఏర్పాటు చేసిన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ), ప్రభుత్వానికి ఒక పిటిషన్ సమర్పించడంతో, 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

290 పేజీల ఈ నివేదిక గత నెలలో విడుదలైంది. అయితే కొందరు బాధితుల పేర్లు, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరాలు దీని నుంచి మాయమయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘లోతుగా పాకిపోయిన తెగులు’

అయితే ఆగస్ట్ 19న రిపోర్ట్ విడుదలైనప్పటి నుంచి, సినీరంగంలోని అనేక మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. అనేకమంది నటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులపై డజనుకు పైగా పోలీసు ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఈ ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. కేరళ హైకోర్టు నివేదికలో పేర్కొన్న ఉదంతాలపై దర్యాప్తు చేయాలని సిట్‌ను కోరడంతో, బాధితులకు న్యాయం జరుగుతుందనే ఆశలు రేకెత్తాయి.

రిపోర్ట్ తర్వాత, దేశంలో అతి పెద్ద సినీ పరిశ్రమ , అత్యంత జనాదరణ పొందిన బాలీవుడ్‌తో సహా అన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలలోని మహిళలు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం మొదలైంది.

"భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ తెగులు చాలా లోతుగా పాకిపోయింది" అని సినీ విమర్శకురాలు, రచయిత్రి శుభ్రా గుప్తా బీబీసీతో అన్నారు.

“దేశంలో వేధింపులు ఎదుర్కోని ఒక్క నటీ కనిపించదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఫిర్యాదు చేస్తే, వాటిని పరిష్కరించేందుకు దశాబ్దాలు పడుతుంది’’ అన్నారామె.

మలయాళ సినీ పరిశ్రమ చాలా ప్రసిద్ధి చెందింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మలయాళ సినీ పరిశ్రమ ప్రజాదరణ పొందిన, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు ప్రసిద్ధి చెందింది

తెలంగాణ ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి

మలయాళ సినిమా రంగంలోని లైంగిక వేధింపులను వెల్లడించే అనేక విషయాలు టీవీలలో ప్రైమ్‌టైమ్ చర్చనీయాంశమయ్యాయి. కమిటీ నివేదికపై డబ్ల్యుసీసీ సభ్యురాలు దీదీ దామోదరన్ స్పందించారు.

"కొందరు మహిళలు తమకు ఎదురైన భయంకరమైన అనుభవాల కారణంగా ఎలా పరిశ్రమను వీడామో చెప్పారు. తమకు జరిగినవాటి గురించి వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవు. కానీ తమ అనుభవాలను చెప్పుకోవడం ద్వారా వాళ్లకు కొంచెం మానసిక ప్రశాంతత దొరికింది’’ అన్నారామె.

వాళ్లలో చాలామందిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా, వాళ్లు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాలను వెల్లడించారని ఆమె అన్నారు.

ఈ నివేదిక ఇతర చలనచిత్ర పరిశ్రమలలోనూ ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని ప్రాంతీయ సినీ పరిశ్రమలలోనూ సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్‌లు వెల్లువెత్తాయి.

తెలంగాణలో తెలుగు చిత్ర పరిశ్రమపై, రెండేళ్లుగా వెలుగు చూడని నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీపై చర్చించడానికి, 2018లో నటి శ్రీరెడ్డి బహిరంగంగా తన లోదుస్తులను విప్పి నిరసన తెలిపిన తర్వాత ఈ విచారణను చేపట్టారు.

తనుశ్రీ దత్తా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018లో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఒక నటుడిపై చేసిన ఆరోపణలతో భారతదేశంలో #MeToo ఉద్యమం మొదలైంది

‘ప్రతిస్పందిస్తేనే ఆశ్చర్యపోవాలి’

బెంగాలీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్లు నటి రితాభరి చక్రవర్తి తెలిపారు. ‘‘ఇది లైంగిక వేధింపులకు పాల్పడే మృగాల నుంచి పరిశ్రమను ప్రక్షాళన చేస్తుంది" అని ఆమె అన్నారు.

తమిళ, కన్నడ సినిమాల్లోని మహిళలూ తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ తమిళ నటి రాధికా శరత్‌కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, హేమ కమిటీ నివేదిక చాలా అవగాహన కల్పించిందని, ‘ఇకపై అలాంటి పనులు చేయాలంటే పురుషులు భయపడతారు’ అని అన్నారు.

కానీ పరిశ్రమలోని పురుషుల నుంచి మద్దతు లేకపోవడం తమకు నిరాశ కలిగించిందని దామోదరన్ అన్నారు.

మలయాళ సూపర్ స్టార్లు మోహన్‌లాల్, మమ్ముట్టి ఈ నివేదికను స్వాగతించారు. అయితే పరిశ్రమను దెబ్బతీసే పనులేమీ చేయకూడదని వారు అన్నారు.

"అభిమానులు ఈ హీరోలను ప్రాణాలకన్నా మిన్నగా పూజిస్తారు, వాళ్లు తమ సినిమాలలోలాగే ధైర్యాన్ని ప్రదర్శిస్తారని మేము ఎదురు చూస్తున్నాం" అని దామోదరన్ బీబీసీతో అన్నారు.

తమిళనాడులో నటులు, రాజకీయ నాయకులు కూడా అయిన కమల్ హాసన్, విజయ్‌లు మౌనంగా ఉన్నారు. ఇక నివేదిక విడుదలైన 10 రోజుల తర్వాత కూడా దాని గురించి ‘నాకు తెలీదు’ అంటూ వ్యాఖ్యానించి, రజనీకాంత్ విమర్శల పాలయ్యారు.

“మనలో ప్రతి ఒక్కరికీ వేధింపులు ఎదురవుతాయి, పురుషులకు దాని గురించి ఎలా తెలీకుండా ఉంటుంది? బహుశా వాళ్లు వాటిని పట్టించుకోకపోవచ్చు. వాళ్లు దానిని చూడకూడదని నిర్ణయించుకొని ఉండొచ్చు” అని బీబీసీతో అన్నారు రాధిక. "ప్రతిసారీ తమను తాము రక్షించుకోవాల్సిన బాధ్యత మహిళలపైనే పడటం చాలా విచారకరం" అన్నారామె.

బాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్లు - అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు కూడా దీనిపై మౌనం వహించడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు.

అయితే ఇది ఊహించని విషయమేమీ కాదని గుప్తా అన్నారు. "వాళ్లు ప్రతిస్పందించి ఉంటేనే నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. 2008లో ఒక సినిమా సెట్‌లో ఒక నటుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని నటి తనుశ్రీ దత్తా ఆరోపణలతో బాలీవుడ్‌లో #MeToo ఉద్యమం మొదలైన తర్వాత 2018లో ఏం జరిగిందో మనం చూశాము." అన్నారామె.

"కొద్ది కాలంపాటు ఆ ఉద్యమానికి మద్దతు లభించింది. బాలీవుడ్ దాని గురించి ఏదైనా చేస్తుందేమో అనిపించింది. కానీ తర్వాత పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. వేధింపులకు పాల్పడే అలాంటి నటులపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. వాళ్లంతా మళ్లీ తాము చేసిన పనులను మళ్లీ చేస్తూనే ఉన్నారు. ఫిర్యాదు చేసిన మహిళలకు ఇండస్ట్రీలో మళ్లీ పని దొరకలేదు’’అన్నారు గుప్తా.

కాస్టింగ్ కౌచ్ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పని దొరకదు అనే భయం?

బాలీవుడ్‌పై ఒక పెద్ద విమర్శ ఏమిటంటే, ఇతర పరిశ్రమలకు భిన్నంగా, అక్కడున్న ప్రముఖ నటీమణులెవ్వరూ లైంగిక వేధింపుల గురించి మాట్లాడ లేదు.

తోటి నటీమణుల నుంచి తనూశ్రీ దత్తా మద్దతు పొందలేకపోయారు. ఈ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఎవరూ తనను సినిమాలలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఆమె హేమా కమిటీ నివేదికను ‘పనికిరానిది’గా అభివర్ణించారు. మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించడానికి ఏ నివేదికా ఉపయోగపడలేదని ఆమె అంటున్నారు.

పెద్ద హీరోయిన్లు దీనిపై పెదవి విప్పకపోవడానికి కారణంగా, తమకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడే ఆలోచనేనని శుభ్రా గుప్తా అంటున్నారు.

అయితే, నివేదికకు వచ్చిన ప్రతిస్పందన తనలో ఆశలు రేకెత్తిస్తోందని దీదీ దామోదరన్ అన్నారు.

“భారతదేశంలోని చలనచిత్ర పరిశ్రమలో పితృస్వామిక వైఖరి, స్త్రీద్వేష వైఖరి విపరీతంగా కనిపిస్తుంది. కానీ మహిళలు తాము ఎదుర్కొనే సెక్సిజాన్ని, స్త్రీ ద్వేషాన్ని ఇలాగే కొనసాగించలేరు. పరిస్థితులు మారతాయి-మారక తప్పదు’’ అని దామోదరన్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)