టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ సముద్రం అడుగున పేలిపోతుందని ముందే తెలుసా? తీసేసిన ఉద్యోగి బయటపెట్టిన రహస్యాలు

Titan submersible,టైటాన్ సబ్‌మెర్సిబుల్‌

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, అనా ఫాగాయ్, నదీన్ యూసిఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో అన్ని భద్రతా ప్రమాణాలను ‘బైపాస్ చేయడం’ వల్ల దాని ప్రమాదం ‘‘అనివార్యం’’గా మారిందని ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు పబ్లిక్ హియరింగ్‌లో వెల్లడించారు.

ఓషన్‌గేట్ సంస్థ మాజీ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ లాక్‌రిడ్జ్ అమెరికా కోస్ట్ గార్డ్ ఇన్వెస్టిగేటర్లకు వాంగ్మూలం ఇస్తూ.. 2018లో తనను తొలగించడానికి ముందు దానిలోని భద్రతా సమస్యల గురించి తాను హెచ్చరించానని, కానీ సంస్థ తన హెచ్చరికలు విస్మరించిందని తెలిపారు.

2023 జూన్‌లో టైటానిక్ శిథిలాల వద్దకు వెళ్లే ప్రయత్నంలో ప్రయోగాత్మక డీప్-సీ క్రాఫ్ట్ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ అధిక పీడనానికి గురై పేలిపోవడంతో అందులో ఉన్న అయిదుగురు మరణించారు.

ఈ ప్రమాదంపై అమెరికా కోస్ట్ గార్డ్ విచారణలో భాగంగా సోమవారం పబ్లిక్ హియరింగ్‌ ప్రారంభమైంది. ఈ విచారణ 15 నెలలుగా కొనసాగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డబ్బు సంపాదించడంపైనే దృష్టి

కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని వెల్లడించినందుకు ఓషన్‌గేట్ నుంచి లాక్‌రిడ్జ్‌ను తొలగించగా, దానిని సవాలు చేస్తూ ఆయన కేసు వేశారు.

2018లో సంస్థ సీఈఓ స్టాక్‌టన్ రష్‌, టైటాన్ సబ్‌మెర్సిబుల్ నాణ్యతను తనిఖీ చేసి నివేదికను ఇమ్మని లాక్‌రిడ్జ్‌ను కోరారు.

అయితే లాక్‌రిడ్జ్ టైటాన్ డిజైన్‌పై పలు సందేహాలు వ్యక్తం చేశారని అమెరికా కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి.

కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన సబ్‌మెర్సిబుల్‌ నీళ్లలోకి వెళ్లిన ప్రతిసారీ కొంచెం దెబ్బతింటుందని లాక్‌రిడ్జ్ ముందే హెచ్చరించినట్లు పత్రాలు చెప్తున్నాయి.

ఓషన్‌గేట్ ఆలోచన ఎప్పుడూ ‘డబ్బు సంపాదించడం’పైనేనని.. భద్రత విషయాలపై సంస్థ చాలా తక్కువగా దృష్టి పెట్టిందని లాక్‌రిడ్జ్ చెప్పారు.

ఓషన్‌గేట్ సీఈఓకు చాలా "అహంకారం" అని ఆరోపించిన లాక్‌రిడ్జ్, టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ను అభివృద్ధి చేయడానికి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆయన నిరాకరించారని తెలిపారు.

"సరైన ఇంజినీరింగ్ సహకారం లేకుండా దానిని సొంతంగానే చేయగలమని వాళ్లు భావించారు" అని లాక్‌రిడ్జ్ తన వాంగ్మూలంలో తెలిపారు.

భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తడంతో 2016 నుంచి కంపెనీతో తన సంబంధాలు దెబ్బ తినడం ప్రారంభించాయని, తనపై ‘ట్రబుల్ మేకర్’ అని ముద్ర వేశారని అన్నారు.

లాక్‌రిడ్జ్‌తో పాటు, సహ వ్యవస్థాపకుడు గిల్లెర్మో సోహ్న్‌లీన్‌, మరో 10 మంది మాజీ ఓషన్‌గేట్ ఉద్యోగులు కోస్ట్ గార్డ్‌కు చెందిన మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ (ఎంబీఐ) ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు.

Photos of deceased in Titan submersible,ఫోటోలు

ఫొటో సోర్స్, Supplied via Retuers/AFP

ఫొటో క్యాప్షన్, ఎగువ ఎడమ నుంచి సవ్యదిశలో: స్టాక్‌టన్ రష్, హమీష్ హార్డింగ్, షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, పాల్-హెన్రీ నార్గోలెట్

సోమవారం అధికారులు టైటాన్, దాని మదర్ షిప్ పోలార్ ప్రిన్స్ మధ్య జరిగిన కమ్యూనికేషన్ పరిశీలించారు.

సబ్‌మెర్సిబుల్‌ పేలడానికి ముందు, చివరిగా "ఇక్కడ అంతా బాగుంది" అనే సందేశం పంపినట్లు వెల్లడైంది.

ఓషన్‌గేట్ మాజీ ఇంజనీరింగ్ డైరెక్టర్ టోనీ నిస్సేన్ ఈ హియరింగ్‌లో మాట్లాడుతూ.. టైటాన్ చివరి పర్యటనకు చాలా సంవత్సరాల ముందు తాను ఒకసారి ఆ సబ్‌మెర్సిబుల్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించినట్లు తెలిపారు.

అది నీళ్లలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉందంటూ సర్టిఫై చేయమని తనను ఒత్తిడి చేశారని వెల్లడించారు.

టైటాన్‌పై ఎప్పుడూ థర్డ్ పార్టీ పరీక్షలు జరపలేదని, దానిని భద్రపరచడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని, దానిని బయట గాలికే వదిలేశారని అధికారులు గుర్తించారు.

2021, 2022లో టైటాన్ చేపట్టిన 13 డైవ్‌ల సమయంలో, ఆ సబ్‌మెర్సిబుల్‌లో పరికరాలకు సంబంధించిన 118 సమస్యలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. వాటిలో - దాని బ్యాటరీలు డెడ్ కావడంతో, ప్రయాణికులు 27 గంటల పాటు నీళ్ల లోపలే ఉండిపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఓషన్‌గేట్ సీఈఓ, బ్రిటిష్ అన్వేషకుడు హమీష్ హార్డింగ్, ప్రముఖ ఫ్రెంచ్ డైవర్ పాల్ హెన్రీ నార్గోలెట్, బ్రిటిష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, ఆయన 19 ఏళ్ల కుమారుడు సులేమాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్నారు.

ఈ ప్రమాదం తర్వాత ఓషన్‌గేట్ అన్ని అన్వేషణ, వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)