లెబనాన్‌లో పేజర్‌లు ఎలా పేలాయి, ముందే పేలుడు పదార్థాలు అమర్చారా, లేదంటే టెక్స్ట్ మెసేజ్‌తో సిగ్నల్ పంపి పేల్చేశారా?

గాయపడినవారిని ఆసుపత్రులకు తీసుకెళ్తున్న అంబులెన్స్‌లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాయపడినవారిని ఆసుపత్రులకు తీసుకెళ్తున్న అంబులెన్స్‌లు
    • రచయిత, మాట్ మర్ఫీ, జో టిడే
    • హోదా, బీబీసీ న్యూస్

లెబనాన్‌లో మంగళవారం దేశవ్యాప్తంగా ఒకేసారి వేలాది పేజర్లు పేలడంతో వేల మంది గాయపడ్డారు.

సాయుధ హిజ్బుల్లా గ్రూప్ కమ్యూనికేషన్స్ కోసం ఉపయోగించే ఈ పేజర్లు అనూహ్యంగా పేలడంతో 9 మందికి పైగా మృతిచెందారు. సుమారు 2,800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఈ దాడులు ఎలా జరిగాయనేది ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. అత్యాధునిక పద్ధతుల్లో జరిగినట్లుగా కనిపిస్తున్న ఈ దాడులకు ఇజ్రాయెలే కారణమని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. కానీ, దీనిపై స్పందించడానికి ఇజ్రాయెల్ అధికారులు నిరాకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

లెబనాన్ రాజధాని బేరూత్‌, ఆ దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు పేలుళ్లు మొదలయ్యాయి. అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో పేలుళ్లు మొదలయ్యాయి.

ప్రజల జేబుల్లోంచి పొగలు రావడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పొగ కనిపించడానికి ముందు తుపాకీ పేలినట్లు, బాణసంచా కాల్చినట్లు చిన్నపాటి పేలుడు శబ్దాలు వినిపించాయని చెప్పారు.

సీసీ టీవీ ఫుటేజ్‌లోని ఓ క్లిప్‌లో దుకాణం దగ్గర నిల్చున్న ఒకరి ప్యాంట్ జేబులో పేలుడు జరిగి పొగ రావడం కనిపించింది.

పేలుళ్లు ప్రారంభమైనప్పటి నుంచి సుమారు గంట పాటు అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదైనట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.

పేలుళ్ల తరువాత కొద్దిసేపట్లోనే ప్రజలు ఏం జరుగుతోందో తెలియని గందరగోళం మధ్యే ఆసుపత్రులకు రావడం ప్రారంభించారు.

లెబనాన్ పేలుళ్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పేలుళ్లలో తమ ఆప్తులు గాయపడటంతో బేరూత్‌లోని ఓ ఆస్పత్రికి పరుగున వస్తున్న మహిళలు

పేజర్లు ఎలా పేలిపోయాయి?

పేజర్ల పేలుళ్ల ఘటనపై నిపుణులు ఆశ్చర్యపోయారు. పేజర్ల బ్యాటరీలు ఓవర్‌హీట్ అయ్యేలా హ్యాకింగ్ చేసి ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని చెబుతున్నారు.

పేజర్లు తయారుచేసినప్పుడు కానీ, తయారీ తరువాత వాటిని రవాణా చేసినప్పుడు కానీ వాటిని ట్యాంపర్ చేసి ఉంటారని మరికొందరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో ఇలాంటి ‘సప్లయ్ చైన్’ అటాక్స్ విషయంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. టెక్ ఉత్పత్తుల తయారీ సమయంలో కానీ ఆ తరువాత సరఫరా అయ్యేలోగా వివిధ దశల్లో ఎక్కడైనా హ్యాకర్లు యాక్సెస్ తీసుకున్న హైప్రొఫైల్ ఉదంతాలు ఇటీవలకాలంలో కొన్ని జరిగాయి.

కానీ, ఇలాంటివన్నీ ఇంతవరకు సాఫ్ట్‌వేర్ సంబంధిత అటాక్‌లే. హార్డ్‌వేర్ సప్లయ్ చైన్ అటాక్స్ మాత్రం చాలా అరుదు.

నిపుణులు భావిస్తున్నట్లు ఇది సప్లయ్ చైన్ అటాక్ కనుక అయితే దీనికోసం భారీ ఆపరేషనే చేపట్టి ఉంటారని అంచనా.

పేరు వెల్లడించడానికి ఇష్టపడని బ్రిటిష్ ఆర్మీకి చెందిన ఒక మాజీ ఆయుధ నిపుణుడు ‘బీబీసీ’తో మాట్లాడుతూ... ఒక ఫేక్ ఎలక్ట్రానిక్ భాగంలో 10 నుంచి 20 గ్రాముల శక్తిమంతమైన మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని నింపి వాటిని పేజర్లలో అమర్చి ఉంటారని.. అలా ముందే అమర్చిన పేజర్లకు ఒకేసారి ఆల్ఫాన్యూమరిక్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా సిగ్నల్ పంపించి పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ambulance

ఫొటో సోర్స్, Getty Images

బాధితులు ఎవరు, ఏమయ్యారు?

చనిపోయినవారిలో ఇద్దరు హిజ్బుల్లా ఎంపీల కుమారులు, మరో హిజ్బుల్లా సభ్యుడి కుమార్తె కూడా చనిపోయినవారిలో ఉన్నారని ఆ గ్రూప్‌తో బాగా సంబంధాలున్న ఒకరిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.

గాయపడినవారిలో లెబనాన్‌లో ఇరాన్ రాయబారి మొజాబా అమానీ ఉన్నారు. అయితే, ఆయన స్వల్పంగానే గాయపడ్డారని ఇరాన్ మీడియా పేర్కొంది.

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాకు ఈ దాడుల్లో ఎలాంటి గాయాలు కాలేదని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.

క్షతగాత్రుల్లో చాలామందికి చేతులు, ముఖానికి గాయాలైనట్లు లెబనాన్ పబ్లిక్ హెల్త్ మినిస్టర్ ఫిరాస్ అబియాద్ చెప్పారు.

‘ఆసుపత్రుల్లో ఉన్న క్షతగాత్రుల్లో చాలామంది సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. వారు హిజ్బుల్లా వంటి సంస్థలకు చెందినవారో కాదో చెప్పడం కష్టం’ అని ‘బీబీసీ న్యూస్ అవర్’ కార్యక్రమంలో ఆయన చెప్పారు.

కాగా లెబనాన్‌లోనే కాకుండా సిరియాలోనూ జరిగిన ఇలాంటి పేజర్ పేలుళ్లలో మరో 14 మంది గాయపడినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ తెలిపింది.

దాడులకు ఎవరు బాధ్యులు?

ఈ దాడులకు మేమే కారణమంటూ ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. కానీ, లెబనాన్ ప్రధాన మంత్రి, హిజ్బుల్లా గ్రూప్‌లు మాత్రం ఇజ్రాయెల్ దీనికి కారణమని ఆరోపించాయి.

లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటీ దీనిపై మాట్లాడుతూ.. ‘ఇవి లెబనాన్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తూ చేపట్టిన దాడులు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది నేరమే’ అన్నారు.

‘పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడులకు ఇజ్రాయెల్‌దే పూర్తి బాధ్యత’ అంటూ హిజ్బుల్లా ఒక ప్రకటనలో ఆరోపించింది.

అయితే, ఇజ్రాయెల్ ఇంతవరకు ఈ ఆరోపణలపై స్పందించలేదు. చాలా మంది నిపుణులు మాత్రం ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చు అంటున్నారు.

లాంక్‌షైర్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ సైమన్ మాబన్ దీనిపై మాట్లాడుతూ.. ‘తమ లక్ష్యాలను ట్రాక్ చేయడానికి ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడుకున్న ఉదంతాలు ఇంతకుముందు ఉన్నాయి. కానీ, ఈ స్థాయి దాడి మాత్రం ఇదే మొదటిసారి’ అన్నారు.

‘ఈ దాడితో హిజ్బుల్లా కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లోకి ఇజ్రాయెల్ బాగా చొరబడిందని అర్థమవుతోంది’ అని చాతామ్ హౌస్‌కు లీనా ఖతీబ్ అన్నారు.

pager

ఫొటో సోర్స్, Getty Images

పేజర్ అంటే ఏంటి? హిజ్బుల్లా పేజర్లు ఎందుకు వాడుతోంది?

ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరికరాలతో పోల్చితే పాతవిగా భావించే పేజర్లను హిజ్బుల్లా ఇప్పటికీ ఉపయోగిస్తోంది.

ఇజ్రాయెల్ తమ లొకేషన్ ట్రాక్ చేయకుండా తప్పించుకోవడానికి హిజ్బుల్లా ఈ పరికరాలను ఉపయోగిస్తోంది.

పేజర్ అనేది అక్షరాలు, అంకెలతో కూడిన(ఆల్ఫాన్యూమరిక్) మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు పంపించుకోవడానికి వీలున్న వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్స్ సాధనం.

ఇందులో మెసేజ్ పంపించడంతో పాటు మెసేజ్ రిసీవ్ చేసుకోవడం.. ఆ మెసేజ్ చదవడం, వాయిస్ అయితే వినడం సాధ్యమవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)