లెబనాన్‌లో బేరూత్ పేలుడు పరిణామం: ప్రజాగ్రహానికి తలొంచి ప్రధానమంత్రి, ప్రభుత్వం రాజీనామా

ఫొటో సోర్స్, Reuters
లెబనాన్ రాజధాని బేరూత్‌లో 200 మందికిపైగా మరణానికి కారణమైన పేలుళ్ల అనంతరం ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో అక్కడి ప్రభుత్వం రాజీనామా చేయక తప్పలేదు.
ఆ దేశ ప్రధాన మంత్రి హసన్ దియాబ్ నేషనల్ టీవీలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాజీనామాను ప్రకటించారు.
ప్రభుత్వంలో ఉన్నవారి నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఈ పేలుళ్లు జరిగాయని.. వారే అపరాధులని చాలామంది ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పేలుళ్ల తరువాత నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పోలీసులకు, వారికి మధ్య ఘర్షణలు జరిగాయి.
బేరూత్ రేవులో సరైన జాగ్రత్తలు లేకుండా నిల్వ చేసిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలిపోవడంతో ఈ పెను ప్రమాదం జరిగింది.
కాగా ప్రధాని హసన్, ఆయన మంత్రివర్గం రాజీనామా తరువాత అధ్యక్షుడు మైఖేల్ ఓన్ కొత్త మంత్రివర్గం ఏర్పడేవరకు ప్రస్తుత ప్రభుత్వమే కేర్ టేకర్ గవర్నమెంట్‌గా ఉండాలని కోరారు.
ప్రధాన మంత్రి ఏం చెప్పారు?
నెలల తరబడి ప్రతిష్టంభన తరువాత ఈ ఏడాది జనవరిలో ప్రధాన మంత్రిగా నియమితులైన హసన్ దియాబ్ తన రాజీనామా ప్రకటన సందర్భంగా మాట్లాడుతూ.. ''దేశాన్ని కాపాడే ప్రణాళికలు వేయడానికి చాలా కృషి చేశాను'' అన్నారు.
'కానీ ఇక్కడ దేశం కంటే అవినీతి పెద్దదిగా ఉంది. మార్పు దిశగా దేశం పురోగమించకుండా పెద్ద అడ్డుగోడ ఉంది. స్వీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్నిరకాల కుళ్లు విధానాలనూ ఆశ్రయించే ఒక వర్గం ఈ అడ్డుగోడను దృఢంగా ఉంచుతోంది.
మేం వారి ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తున్నామని వారికి తెలుసు. అంతేకాదు మేం సాధించిన ప్రధాన విజయం ఈ దేశాన్ని ఊపిరాడనివ్వకుండా చేసి మృత్యువు వరకు తీసుకెళ్లిన అవినీతి వర్గం నుంచి విముక్తి కల్పిస్తుండడం.
ఏడేళ్లుగా పొంచి ఉండి ఇప్పుడు బద్ధలైన ప్రస్తుత విపత్తుకు బాధ్యులైన వారు జవాబు చెప్పాలన్న ప్రజల డిమాండ్‌కు, నిజమైన మార్పు కావాలంటున్న వారి కోరికకు అనుగుణంగా మేం ఈ నిర్ణయం తీసుకున్నాం'' అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఏం జరగబోతోంది?
ఏళ్లుగా అవినీతిలో కూరుకుపోయిన లెబనాన్‌ను సంస్కరణల పథం పట్టించిన నాయకుడిగా ప్రధాని తనను తాను చెప్పుకొన్నారని బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్ టామ్ బాటెమన్ అన్నారు.
పార్లమెంటు ఇప్పుడు కొత్త ప్రధానిని నియమించాలి. నిరసనకారులు దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో అదే వర్గ రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రక్రియ ఈ నియామకం జరుపుతుంది.
లెబనాన్‌లోని సంక్లిష్ట రాజకీయ వ్యవస్థ కారణంగా ఇదంతా అంత తేలిగ్గా, వేగంగా జరిగే అవకాశాలు లేవు.
వేర్వేరు మత వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు లెబనాన్‌లో అధికారాన్ని పంచుకుంటారు.
దీనికితోడు 1975-90 యుద్ధం తరువాత పుట్టుకొచ్చిన అనేక మంది సైనిక నాయకులు రాజకీయాల్లో ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తమ గుప్పిట పెట్టుకున్నారు.
బలంగా వేళ్లూనుకున్న ఈ వ్యవస్థే దేశంలోని అవినీతికి కారణమని చాలామంది నిరసనకారులు నిందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
రాజీనామా నేపథ్యమేంటి?
కొన్నేళ్లుగా లెబనాన్ ప్రజల్లో ప్రభుత్వాలపై అసంతృప్తి పెరుగుతోంది. 2019లో ఆ దేశంలో వాట్సాప్‌పై పన్ను విధించాలని అనుకోగా ఆ నిర్ణయం ప్రజాగ్రహానికి దారితీసి అవినీతి, ఆర్థిక సంక్షోభాలకు వ్యతిరేక పోరాటంగా మారి అప్పటి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆ తరువాత కరోనావైరస్ మొదలయ్యాక నిరసనలు తగ్గాయి. అయితే, ఇటీవల అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో మళ్లీ నిరసనలు తీవ్రమయ్యాయి.
పాతుకుపోయిన అవినీతి, ఇష్టారాజ్యానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు ఉద్ధృత రూపం దాల్చాయి.
రాజకీయ పెద్దలపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తామన్న ప్రభుత్వ మాటలతో ఏమాత్రం సంతృప్తి చెందలేదు.
దీంతో గత ఏడాది నిరసనల అనంతరం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇప్పుడు తాజా నిరసనల ఫలితంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి.
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కటానికి మన్మోహన్ సింగ్ చెప్పిన మూడు సూత్రాలు
- LAC వద్ద చలికాలంలో పహరా కాసేందుకు భారత సైన్యం ఎలా సిద్ధమవుతోంది?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- మూడేళ్లుగా మూలనపడిన క్రేన్‌ను రిపేరు చేయాలనుకుంటే 11 మంది ప్రాణాలు పోయాయి
- సరిహద్దులో సేనల ఉపసంహరణపై భారత్, చైనా ల ప్రకటనల్లో ఎందుకింత తేడా
- జమ్ముకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది.. కశ్మీరీ పండిట్ల జీవితాలలో వచ్చిన మార్పేమిటి
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- కరోనావైరస్ వ్యాప్తి ఎప్పుడు ఆగుతుందో 'సెరో సర్వేలెన్స్' సర్వేతో తెలుసుకోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









