లెబనాన్: లాక్‌డౌన్‌తో నిండా మునిగిపోయిన దేశం

ఫొటో సోర్స్, AFP
లెబనాన్‌లో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం కొన్ని వేల మందిని పేదరికంలోకి నెట్టింది. దీంతో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనావైరస్ మహమ్మారి మొదలవడానికి ముందే లెబనాన్‌లో ఆర్ధిక సంక్షోభం మొదలైంది.
దేశ స్థూల జాతీయ ఉత్పత్తితో పోల్చి చూస్తే ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగిపోయాయి. జీడీపీ, రుణాల మధ్య వ్యత్యాసం అత్యధికంగా ఉన్న దేశాల్లో లెబనాన్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
దేశంలో నిరుద్యోగం 25 శాతం ఉండగా మూడో వంతు జనాభా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు.
గత ఏడాది ఆఖరులో అమెరికా పౌండ్‌తో లెబనాన్ పౌండ్ మారకం విలువను అదుపులో ఉంచడానికి, ప్రభుత్వ అప్పులు తీర్చడానికి దేశంలో వాణిజ్య బ్యాంకుల నుంచి మార్కెట్ రేటు కంటే అధికంగా వడ్డీకి తీసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంకు పొంజి తరహాలో చేసిన ఆర్ధిక నేరం కూడా దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవడానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అదే సమయంలో దేశ ప్రజలు కూడా కనీస అవసరాలను అందించలేని ప్రభుత్వ వైఫల్యాల పట్ల ఆగ్రహం చెంది, అసహనానికి గురయ్యారు.
ప్రజలు కరెంటు కోతలు, తాగు నీరు కొరత, బలహీనమైన ప్రజా వైద్య ఆరోగ్య వ్యవస్థ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
లెబనాన్‌లో ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి దేశంలో సంస్కరణలు చేపట్టకుండా అనేక ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తున్న అక్కడి పాలక పక్షం వారి సొంత ఖజానాని నింపుకోవడం పై దృష్టి పెట్టడమే దీనికంతటికీ కారణమని అక్కడి ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు నిందించారు.

ఫొటో సోర్స్, EPA
నిరసనలు ఎందుకు పెరిగాయి?
2019 అక్టోబర్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోవడంతో డాలరుతో లెబనాన్ పౌండ్ మారకం విలువ పడిపోవడం మొదలైంది. గత రెండు దశాబ్దాల్లో ఇలా జరగడం ఇది మొదటిసారి.
గోధుమ, ఇంధనం దిగుమతిదారులు వారి చెల్లింపులను డాలర్లలో చెయ్యాలని పట్టుపట్టడంతో వ్యాపార సంఘాలు నిరసనలకు దిగాయి.
అక్టోబర్ మధ్యలో ప్రభుత్వం పొగాకు, పెట్రోల్, వాట్సాప్ వాయిస్ కాల్‌లపై కొత్త సుంకాన్ని ప్రతిపాదించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
కొన్నేళ్లుగా అక్కడి సమాజంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఈ అంశాలన్నీ మరింత పెంచాయి.
కొన్ని వేల మంది లెబనాన్ ప్రజలు వీధుల్లోకి రావడంతో పశ్చిమ దేశాల మద్దతుతో ప్రధానిగా కొనసాగుతున్న సాద్ అల్-హరీరీ సహా యూనిటీ ప్రభుత్వ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
వర్గాల వారీగా నిరసనకారులు విడిపోయారు. దేశంలో 1975 - 1989 మధ్యలో జరిగిన అంతర్యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, EPA
లెబనాన్ చరిత్రలో మొదటిసారి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రమాదకరమైన స్థాయికి చేరాయని చెబుతూ విదేశీ అప్పులు తీర్చే విషయంలో దేశం తీవ్రంగా వెనుకపడినట్లు కొత్త ప్రధాని హసన్ దియాబ్ ప్రకటించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న లెబనాన్‌ను కరోనా మహమ్మారి మరింత సంక్షోభంలోకి నెట్టేసింది.
కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించి మరణాలు పెరిగిపోతున్న సమయంలో అక్కడ మార్చి నెల మధ్యలో లాక్‌డౌన్ విధించారు.
ఇది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను వీధుల్లోకి రాకుండా చేయడంతో పాటు ఆర్ధిక సంక్షోభాన్నీ ముదిరేలా చేసింది.
లెబనాన్ సంక్షేమ విధానాల్లోని లోపాలన్నిటినీ ఈ లాక్‌డౌన్ బయటపెట్టింది.
చాలా సంస్థలు తమ సిబ్బందిని పనుల నుంచి తొలగించాయి. కొన్ని సంస్థలు లాక్‌డౌన్ ఎత్తేసేవరకు జీతాలు ఇవ్వలేమని చెప్పాయి.
అధికారిక ఎక్స్చేంజి, బ్లాక్ మార్కెట్ ఎక్స్చేంజి మధ్యలో పౌండ్ విలువకున్న వ్యత్యాసాలు పెరిగిపోయాయి.
బ్యాంకులు పెట్టుబడులపై నియంత్రణలను కఠినతరం చేశాయి.
ధరలు విపరీతంగా పెరగడంతో చాలా కుటుంబాలకు నిత్యవసరాలు కొనుగోలు చేయడమూ భారంగా మారింది.
పెరుగుతున్న ఆర్ధిక కష్టాలు ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఏప్రిల్ నెలలో ట్రిపోలిలో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఒక యువకుడిని సైనికులు కాల్చి చంపారు. ఫలితంగా జరిగిన ఆందోళనల్లో ప్రజలు చాలా బ్యాంకులను తగలబెట్టారు.
ఆఖరికి ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభాన్ని రూపుమాపే దిశగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి 1000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్ కోరుతూ రికవరీ ప్రణాళికను ప్రకటించింది.
మే నెలలో కరోనావైరస్ లాక్ డౌన్ సడలించే సమయానికి , కొన్ని నిత్యవసరాల ధరలు రెండింతలు పెరిగాయి.
దేశం ఆహార కొరత ముప్పు ముంగిట ఉందని ఆ దేశ ప్రధాన మంత్రి ప్రకటించారు.
"లెబనాన్‌లో ఇప్పటికే చాలా మంది ప్రజలు మాంసం, పండ్లు, కూరగాయలు కొనడం మానేశారు. మరి కొద్ది రోజుల్లో రొట్టెలు కొనడం చాలామందికి కష్టమవుతుందని ‘వాషింగ్టన్ పోస్ట్’లో ప్రచురితమైన ఒక వ్యాసంలో రాశారు.

ఫొటో సోర్స్, AFP
లెబనాన్ ఎందుకు సమస్య పరిష్కారానికి కష్టపడుతోంది?
కొన్ని రాజకీయ వర్గాలు వారి స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండడంతో సమస్యల పరిష్కారం కష్టతరంగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
లెబనాన్ అధికారికంగా 4 ముస్లిం వర్గాలు, 12 క్రైస్తవ వర్గాలు, ధ్రూజ్ వర్గం, జుడాయిజంను గుర్తిస్తుంది.
దేశాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , పార్లమెంట్ స్పీకర్ పదవులు ప్రధానమైన మూడు మత శాఖలు మారనైట్ క్రిస్టియన్, షియా ముస్లిం, సున్ని ముస్లింలకే దక్కుతుంటాయి.
పార్లమెంట్‌లో ఉన్న 128 సీట్లకు క్రిస్టియన్లు, ముస్లింలు సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మతపరంగా ఇక్కడ స్పష్టమైన విభజన ఉండడంతో ఇతర దేశాల జోక్యానికి అవకాశమేర్పడుతోంది. ఇరాన్ మద్దతు గల హిజ్‌బుల్లా షియాని దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ సైనిక ఉద్యమంగా చూస్తారు.
దేశంలో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి , వివిధ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు వారు ప్రాతినిధ్యం వహించే మతాల ప్రయోజనాలను కాపాడుతున్నారు. చట్టపరంగా, చట్ట వ్యతిరేకంగా.. రెండు రకాలుగానూ ఆర్ధిక ప్రయోజనాలు పొందుతూ అధికారాన్ని, పలుకుబడిని కాపాడుకుంటుంటారు.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్-2019 అవినీతి విషయంలో 180 దేశాలకు గాను లెబనాన్‌కి 137వ ర్యాంకుని ఇచ్చింది. ఈ ర్యాంకింగులలో 180వ ర్యాంకులో ఉన్న దేశం అత్యంత అవినీతి దేశంగా పరిగణిస్తారు.
లెబనాన్ లో రాజకీయ పార్టీలు, పార్లమెంట్, పోలీస్ వ్యవస్థలతో సహా అన్ని స్థాయిల్లో అవినీతి పాతుకుపోయిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
లెబనాన్‌లో వివిధ రాజకీయ వర్గాలను పెంచి పోషించే నెట్‌వర్క్‌లు అక్కడి పాలనా వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








