లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు: 9మంది మృతి, ఇది ఇజ్రాయెల్ పనే అంటున్న హిజ్బుల్లా

లెబనాన్ సూపర్ మార్కెట్‌లో పేలుడు

ఫొటో సోర్స్, screengrab

ఫొటో క్యాప్షన్, లెబనాన్ సూపర్ మార్కెట్‌లో పేజర్ పేలుళ్లు (స్క్రీన్ గ్రాబ్)
    • రచయిత, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, లండన్

లెబనాన్‌లో పేజర్లు పేలాయి. ఈ పేలుళ్లలో ఓ చిన్నారి సహా 9మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఈ పేజర్లను సాయుధ గ్రూపు హిజ్బుల్లా సభ్యులు తమ మధ్య సమాచార మార్పిడికి వినియోగిస్తుంటారు.

లెబనాన్ రాజధాని బేరూత్ సహా, దేశవ్యాప్తంగా జరిగిన ఈ పేలుళ్లలో ఇరాన్ రాయబారి సహా మొత్తం 2,800 మంది గాయపడ్డారు.

‘‘ఈ పేజర్లు హిజ్బుల్లాలోని వివిధ యూనిట్లకు చెందిన ఉద్యోగులు, సంస్థలకు చెందినవి’’ అని హిజ్బుల్లా ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లెబనీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు బేరూత్‌లోని రెడ్‌క్రాస్ భవనం వద్దకు చేరుకుంటున్న ప్రజలు

ఈ పేలుళ్లకు ఇజ్రాయెలే కారణమని హిజ్బుల్లా ఆరోపించింది. ‘‘ఈ నేరపూరిత దాడికి తగిన బదులు తీర్చుకుంటామని’’ హెచ్చరించింది.

దీనిపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది.

ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో హిజ్బుల్లా దాడులను ఆపడం, నిర్వాసితులను సురక్షితంగా వెనక్కు తీసుకురావడం లక్ష్యమని ఈ పేలుళ్లకు కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ప్రకటించింది.

అక్టోబర్ 7న గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజు నుంచి ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుగుతున్నాయి.

ఇరాన్ అండదండలు ఉన్న పాలస్తీనా గ్రూప్‌కు మద్దతుగా తాము వ్యవహరిస్తున్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది.

ఈ రెండింటినీ ఇజ్రాయెల్, యూకే తదితర దేశాలు ఉగ్రవాద సంస్థలుగాపేర్కొంటూ వాటిని నిషేధించాయి.

లెబనాన్‌లో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఐరాస ప్రతినిధి అన్నారు.

అంబులెన్స్

ఫొటో సోర్స్, Getty Images

హిజ్బుల్లా పేజర్లు ఎందుకు వాడుతోంది?

లెబనాన్ ప్రజలు పేజర్ పేలుళ్లను నమ్మలేకపోతున్నారు. వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మొబైల్ ఫోన్లు హ్యాక్, ట్రాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో గ్రూప్ ఎక్కువగా ఉపయోగించే పేజర్లు రాజధాని బేరూత్, దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో పేలిపోయాయని హిజ్బుల్లా తెలిపింది.

ఓ సూపర్‌ మార్కెట్‌లో ఓ వ్యక్తి ప్యాంట్ జేబు వద్ద ఉన్న బ్యాగ్‌లో పేలుడు సంభవించడం, ఆ వ్యక్తి కిందపడి నొప్పితో అరవడం వీడియో ఫుటేజీలో కనిపించింది.

గాయపడినవారిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు. తమవారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆస్పత్రుల బయట బంధువులు వేచిచూస్తున్నారు.

బేరూత్‌లో అష్రాఫిహ్ జిల్లాలోని ఎల్‌ఏయూ వైద్య కేంద్రం ప్రధాన గేటును మూసివేశారు.

ప్రజలను పరిమిత సంఖ్యలో మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు.

‘కొన్ని దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి’ అని వైద్యకేంద్రం సిబ్బంది ఒకరు బీబీసీకి చెప్పారు.

‘గాయపడినవారిలో ఎక్కువమంది వేళ్లను పోగొట్టుకున్నారు. కొంతమందికి వేళ్లు పూర్తిగా పోయాయి’ అని తెలిపారు.

చాలామందికి నడుము, ముఖం, కళ్లు, చేతుల వద్ద గాయాలు అయ్యాయి.

పేలుళ్లలో ఇరాన్ రాయబారి అమానీ స్వల్పంగా గాయపడ్డారని ఆయన భార్య తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారని చెప్పారు.

ఈ ఘటనలో మొత్తం 8 మంది ఫైటర్లు మరణించారని హిజ్బుల్లా మీడియా కార్యాలయం తెలిపింది.

జెరూసలెం వెళ్లే మార్గంలో వారు వీరమణం పొందారని మాత్రమే పేర్కొంది కానీ, ఏ ప్రాంతంలో, ఎలాంటి పరిస్థితులలో చనిపోయారనే వివరాలు వెల్లడించలేదు.

చనిపోయినవారిలో హిజ్బుల్లా ఎంపీ అలీ అమ్మర్ కుమారుడు, బెకా లోయలో హిజ్బుల్లా సభ్యుడి పదేళ్ల కుమార్తె ఉన్నారని హిజ్బుల్లా సన్నిహిత వర్గాలు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపాయి.

ఆ తర్వాత మరో చట్టసభ సభ్యుడు హసన్ ఫడ్లల్లా కుమారుడు కూడా చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం అందిందని ఆ వర్గాలు తెలిపాయి.

సిరియాలోనూ..

ఇక సిరియాలోనూ పేజర్లు పేలి 14మంది గాయపడ్డారని యూకేలోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. ఇక్కడి అంతర్యుద్ధంలో ప్రభుత్వబలగాలతో కలిసి హిజ్బుల్లా పోరాడుతోంది.

ఈ ఘటనకు ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహించాలని హిజ్బుల్లా మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ పేలుళ్లకు ఇజ్రాయెలే కారణమని లెబనాన్ ప్రధాని ఆరోపించారు.ఇది లెబనాన్ సార్వభౌమత్వాన్నిఉల్లంఘించడమేనన్నారు.

ఇజ్రాయెల్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ, లెబనాన్‌కు తెలిపారు.

ఈ ఘటనలో తన ప్రమేయాన్ని అమెరికా ఖండించింది. ఉద్రిక్తతలను పెంచవద్దని ఇరాన్‌ను కోరింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)