సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం, ‘ట్విటర్ పిట్ట, చిట్టినాయుడు’ అంటూ కామెంట్లు, అసలేం జరిగిందంటే..

రేవంత్ రెడ్డి, కేటీఆర్

ఫొటో సోర్స్, Facebook

    • రచయిత, బి.నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

కేటీఆర్‌ను ‘ట్విటర్ పిట్ట’ అని సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డిని ‘చిట్టినాయుడు’ అంటూ కేటీఆర్ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

అసలు.. ఎవరు ఏమన్నారు? వారి వాదనలు ఏంటి? దీనిపై సోషల్ మీడియా యూజర్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

రాజీవ్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్

ఫొటో సోర్స్, X/@revanth_anumula

ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు?

సెప్టెంబర్ 16 సోమవారం తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు చేశారు.

"అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నానని ట్విటర్ పిట్ట చెబుతున్నారు. ఆ కంప్యూటర్‌ను పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. ఆయనే లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవానివి. రైల్వే స్టేషన్‌లో చాయ్, సమోసా అమ్ముకుంటూ సిద్ధిపేటలోనే ఉండేవానివి. ఐటీ రంగాన్ని ఈ దేశానికి రాజీవ్ గాంధీ పరిచయం చేశారు కాబట్టే ఐటీ శాఖ వచ్చింది. రాజీవ్ గాంధీ వల్లే నువ్వు ఐటీ మంత్రి అయ్యావ్. దేశ సమగ్రతను కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తప్పేముంది? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని దమ్ముంటే టచ్ చేసి చూడండి" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

బీబీసీ , బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

కేటీఆర్ ఏమన్నారు?

సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ 'ఎక్స్'లో స్పందించారు. ‘‘చిట్టినాయుడు సుభాషితాలు’’ అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు.

"కంప్యూటర్‌ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజ్. రాజీవ్ గాంధీ కంప్యూటర్‌ను దేశానికి పరిచయం చేశారని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమెటిక్ కాలిక్యులేటర్ (TIFRAC) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్ గాంధీ వయసు అప్పటికి 12 సంవత్సరాలు మాత్రమే. ఏదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు?నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్... వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి" అని కేటీఆర్ పోస్ట్ చేశారు.

ఈ గొడవకు కారణమేంటి?

సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందంటూ, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలుపుతూ సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో ప్రకటించారు.

అయితే, దీనిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ‘రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం? ఆయన విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అవుతుంది’’ అంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

తెలంగాణ సమాజ గౌరవాన్ని కాపాడేలా ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్నిపెట్టినా సరే, తాము అధికారంలోకి వచ్చాక గౌరవంగా వేరే చోటుకు తరలిస్తామని కేటీఆర్ అన్నారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఏం చేసిందని ప్రశ్నించారు. సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతామని ఆయన కొన్ని వారాల కిందట ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని చెప్పారు.

సెప్టెంబర్ 16న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ మాటల యుద్ధంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు?

గాంధీ కుటుంబం అంటే సీఎం రేవంత్ రెడ్డికి అసలు ప్రేమే లేదంటూ 'ఎక్స్'లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ పోస్ట్ చేశారు.

"రాజీవ్ గాంధీ జాతీయ వారసత్వాన్ని ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్ర గర్వానికి చిహ్నమైన తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు. ఈ చర్యల వల్ల తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ.. ఇద్దరికీ అవమానమే.

సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని, ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌ను అవమానించే బదులు, హైటెక్ సిటీ, ఎయిర్ పోర్టు తదితర ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించవచ్చు.

లేదు, సచివాలయంలోనే విగ్రహం పెట్టాలని భావిస్తే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట కాకుండా మిగతా ఖాళీ స్థలంలో పెట్టి ఉండాల్సింది.

అలా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యల్ని చూస్తుంటే, తెలంగాణ సమాజంలో కావాలనే అశాంతి రేపే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. రేవంత్ రెడ్డికి దూరదృష్టి లేదని, అహంకారపూరిత ధోరణితో ఉన్నారని, దిగజారుడు రాజకీయాలను అనుసరిస్తారని మరోసారి ఆయన నిరూపించారు.

కాబట్టి, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసకర చర్యలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి" అని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి దాసోజు శ్రవణ్ కుమార్ సూచించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సచివాలయం, ట్యాంక్ బండ్

ఫొటో సోర్స్, X/@revanth_anumula

ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

"ఉద్యమం పేరుతో ఆసుపత్రుల్లో దొంగ దీక్షలు చేసిన వాళ్లు సైతం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వం వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించి కూడా తిరిగి అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెబుతుంటే ఆయన మానసిక పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది" అని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

"దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలది. గాంధీ కుటుంబం ఇన్నేళ్లు దేశాన్ని పరిపాలించినప్పటికీ రాహుల్ గాంధీకి దిల్లీలో సొంత ఇల్లు లేదు. అలాంటి కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న అజ్ఞానులకు జ్ఞానోదయం కలగాలని కోరుకుంటున్నాను" అని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఈ వివాదంపై నెటిజన్లు ఏమంటున్నారంటే..

రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలపై నెటిజన్లు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. కొందరు రేవంత్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు కేటీఆర్‌కు మద్దతునిస్తున్నారు.

ట్విట్టర్, ఎక్స్ , సోషల్ మీడియా

ఫొటో సోర్స్, X/@VocalTelangana

"కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడి, సాధించిండు కాబట్టి నువ్వు GM అయినవ్. లేకపోతే ఆంధ్ర లీడర్లకు పదవుల కోసం ఊడిగం చేసేటోడివి" అని @Vocaltelangana అనే యూజర్ కామెంట్ చేశారు.

నెటిజన్స్, కామెంట్స్, ట్రెండింగ్

ఫొటో సోర్స్, X/@BankaRaju12

"నేను హైస్కూల్‌లో జీకే టాపర్‌. ఒక్క మార్కుతో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే.. కంప్యూటర్ ఎవరు కనిపెట్టారని. ఇప్పుడు ఈ వీడియో చూసిన తరువాత నేను ఆ ప్రైజ్ రిటర్న్ ఇవ్వలేకపోతున్నా..! ఎలా మరి..?" అని @BankaRaju12 అనే యూజర్ కామెంట్ చేశారు.

కంప్యూటర్, చార్లెస్ బాబేజ్, టాటా

ఫొటో సోర్స్, X/@Durgesh59573271

"రాజీవ్ గాంధీ కంప్యూటర్‌ను కనిపెట్టలేదు కానీ, ఆయన కంప్యూటర్, సాంకేతికత గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో ప్రాధాన్యంగా ఉండేవారు" అని @Durgesh59573271 కామెంట్ చేశారు.

దివంగత నేత, రాజకీయాలు, చర్చ

ఫొటో సోర్స్, X/ @Aditya497

ఫొటో క్యాప్షన్, దివంగత నేతపై రాజకీయ విమర్శలు వద్దంటున్న నెటిజన్

"దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ నాయకుడి చుట్టూ ఇలా రాజకీయ దుమారం రేపడం సరికాదు. రాజకీయం చేయడానికి సమాజంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వాటిపైకి వెళ్లండి, దీనిపై చేయొద్దు" అని @Aditya497 అనే మరో యూజర్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)