అరెకపూడి గాంధీ: ప్రజా పద్దుల కమిటీ అంటే ఏంటి? చైర్మన్ నియామకంలో వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, FB/Arekapudi Gandhi
- రచయిత, జి.వి. సాయినాథ్
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో ప్రజా పద్దుల సంఘం ( పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పీఏసీ) కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం నెలకొంది.
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీల మధ్య మాటల యుద్ధానికి దారి తీయడంతోపాటు కౌశిక్ రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ అనుచరులతో కలిసి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమస్య ఎక్కడ మొదలైంది?
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పేరును పీఏసీ సభ్యునిగా ఆ పార్టీ ప్రతిపాదించింది. ఆ తరువాత ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
ఇటీవల ఆయనను పీఏసీ చైర్మన్‌గా స్పీకర్ నియమించారు. దీంతో రెండు పార్టీల మధ్య వివాదం మొదలైంది.
‘‘ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారు?’’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు వంటి వారు ప్రశ్నించారు. అరెకపూడి గాంధీకి బీఆర్‌ఎస్ కండువా కప్పుతానంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనడం, ఆ తరువాత ఆయన ఇంటికి అరెకపూడి గాంధీ తన అనుచరులతో వెళ్లడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.
ఇద్దరి నేతల అనుచరుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ వివాదంలో నిరసనలకు దిగిన హరీశ్ రావు వంటి బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


ఫొటో సోర్స్, FB/Padi Kaushik Reddy
ఏంటీ ప్రజా పద్దుల కమిటీ?
ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను లెక్కించేందుకు పార్లమెంటు ఏర్పాటు చేసే కమిటీనే పీఏసీ. దేశానికి స్వతంత్రం రాక ముందు నుంచే పీఏసీలు ఉన్నాయి.
బ్రిటిష్ పాలనాకాలంలో మాంటిగ్యు-చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల్లో భాగంగా 1921లో తొలిసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేశారు. నాడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చెందిన ఫైనాన్స్ మెంబర్ దానికి చైర్మన్‌గా ఉంటూ ఉండేవారు.
ఆ కమిటీ నిర్వహణకు కావాల్సిన సహాయాన్ని ఆర్థికశాఖ చూసుకుంటూ ఉండేది.
దేశానికి స్వతంత్రం వచ్చాక కేంద్ర ఆర్థికశాఖా మంత్రి పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించడం మొదలైంది. 1949 వరకు ఇదే పద్ధతి కొనసాగింది.
అయితే ఆర్థిక మంత్రి ప్రభుత్వంలో భాగంగా ఉంటారు. అలాంటి వ్యక్తి తమ ప్రభుత్వ పనితీరును ఎంతవరకు పారదర్శకంగా మదింపు చేయగలరు? అనే ప్రశ్న తలెత్తడంతో 1950 జనవరి 26 తరువాత అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ఆ వ్యవస్థలో మార్పులు చేశారు.
పీఏసీ చైర్మన్‌గా ఆర్థిక మంత్రిని తొలగించారు. పీఏసీని పార్లమెంటరీ కమిటీగా మార్చి దాన్ని లోక్‌సభ స్పీకర్ పరిధిలోకి తీసుకొచ్చారు. దానికి చైర్మన్‌ను నియమించే అధికారం స్పీకర్‌కు అప్పగించారు.
విధులు ఏంటి?
పీఏసీ ప్రధాన విధులు:
- ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలను లెక్కించడం
- ఆదాయ వ్యయాల్లో లోపాలు, తప్పులు, దుబారా ఖర్చులు, లెక్కా పత్రం లేని ఖర్చులు వంటి వాటిని పరిశీలించి పార్లమెంట్, అసెంబ్లీల ముందు పెట్టడం.
- కాగ్ నివేదికను పరిశీలించడం.
- ప్రభుత్వ వార్షిక ఆర్థిక ఖాతాలను చెక్ చేయడం.
- ప్రభుత్వ శాఖల్లోని ఆర్థిక అవకతవకలను కనిపెట్టడం, రెవెన్యూ రసీదులను పరిశీలించడం
- పన్ను ఎగవేతలు, సుంకాలు విధించకపోవడం వంటివాటిని తనిఖీ చేయడం
ఏ శాఖైనా బడ్జెట్‌కి అనుగుణంగా ఖర్చు చేస్తుందా లేదా అని తనిఖీలు చేసే అధికారం పీఏసీకి ఉంటుంది.
పార్లమెంటు ఆమోదించిన, మంజూరు చేసిన డబ్బును ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు సక్రమంగా ఖర్చు చేస్తున్నాయా లేదా అనేది పరిశీలించడం ఈ సభ్యుల ప్రధాన విధి.
ఆయా లెక్కలకు సంబంధించి తనిఖీలు చేసే విస్తృత అధికారం ఆ సభ్యులకు ఉంటుంది. ఆర్థిక జవాబుదారీతనాన్ని నిర్ధరించడంలో ఈ పీఏసీ కీలకపాత్ర పోషిస్తుంది.

ఫొటో సోర్స్, FB/Arekapudi Gandhi
ఎలా నియమిస్తారు?
లోక్‌సభ బిజినెస్ రూల్ 308 ప్రకారం ప్రతి ఏడాది పీఏసీని ఏర్పాటు చేస్తూ ఉంటారు. గరిష్ఠంగా 22 మంది ఎంపీలను సభ్యులుగా నియమిస్తారు. లోక్‌సభ నుంచి 15 మంది రాజ్యసభ నుంచి ఏడుగురిని తీసుకుంటారు.
కమిటీలో సభ్యులుగా ఉన్న వారిలో లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని చైర్మన్‌గా నియమిస్తారు స్పీకర్. 1966-67 వరకు అధికార పార్టీకి చెందిన సభలోని సీనియర్ సభ్యుడిని పీఏసీకి చైర్మన్‌గా స్పీకర్ నియమించే వారు.
1967లో తొలిసారి ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని చైర్మన్‌గా నియమించారు. నేటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ కమిటీలో సభ్యులు మంత్రులుగా ఉండకూడదు.
కేంద్ర ప్రభుత్వ పీఏసీలను అనుసరించే రాష్ట్రాల్లో కూడా ఆ కమిటీల ఏర్పాటు 1950 తర్వాత మొదలైంది.
తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్ 250, 263 ప్రకారం పీఏసీని ఏర్పాటు చేస్తారు. ఇందులో 13 మంది సభ్యులు ఉంటారు. 9 మంది శాసనసభ నుంచి నలుగురు శాసనమండలి నుంచి ఉంటారు.
అలాగే అసెంబ్లీ కమిటీల్లో ఒకటిగా ఏర్పాటయ్యే ఈ పీఏసీ కమిటీల్లో 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభలో ఆయా పార్టీల బలాన్ని బట్టి సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ కమిటీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వడం పీఏసీ నిర్మాణంలో మొదటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం.

ఫొటో సోర్స్, FB/Padi Kaushik Reddy
‘‘నిబంధనల మేరకు కరెక్టే గాని నైతికంగా తప్పు’’
పీఏసీ చైర్మన్ నియామకంలో వివాదాలు తొలిసారేమీ కాదు.
2019లోనూ పీఏసీ చైర్మన్ ఎంపిక మీద వివాదం చెలరేగింది. నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఓవైసీని పీఏసీ చైర్మన్‌గా నియమించింది.
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కున్న 19 మంది సభ్యుల్లో 13 మంది బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 6కు పడిపోయింది. నాడు అసెంబ్లీలో 7గురు సభ్యులున్న ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి దక్కింది.
అయితే బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్న ఎంఐఎం పార్టీ సభ్యుడిని పీఏసీ చైర్మన్ చేశారంటూ నాడు విమర్శలొచ్చాయి. కానీ ప్రతిపక్షంలో ఎక్కువ మంది సభ్యులున్న పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సమర్థించుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న పీఏసీ చైర్మన్ ఎంపిక, తదనంతర పరిణామాలపై ఏపీకి చెందిన పీఏసీ మాజీ సభ్యుడు ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్పందించారు.
‘‘తెలంగాణలో అరెకపూడి గాంధీ ఎంపిక సాంకేతికంగా సబబే. కానీ అధికార పక్షాన్ని అనుసరించే వారిని పీఏసీ చైర్మన్‌గా నియమించడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు’’ అని లక్ష్మణరావు తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














