‘మేం ఎవరికీ వ్యతిరేకం కాదు’ అని క్వాడ్ సమావేశంలో మోదీ ఎందుకు అన్నారు?

ఫొటో సోర్స్, @narendramodi
డెలావర్‌లో జరిగిన క్వాడ్ నేతల సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు.
భారత్ నుంచి ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
‘ప్రపంచమంతా టెన్షన్లు, ఘర్షణలు నెలకొన్న సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ఆధారంగా చేసుకుని క్వాడ్ ముందుకు వెళ్లడం మొత్తం మానవ సమాజానికి ఎంతో ముఖ్యం’’ అని ప్రధాని మోదీ చెప్పారు.
‘‘మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. చట్టంపై ఆధారపడిన ఒక అంతర్జాతీయ వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం ఇస్తున్నాం. అన్ని సమస్యల శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నాం’’ అని మోదీ అన్నారు.
దీంతో పాటు, క్వాడ్ గ్రూప్‌లోని దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
ఆ ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం గురించి ప్రస్తావించాయి. ఈ ప్రకటనపై ఇప్పటి వరకు చైనా స్పందించలేదు.


ఫొటో సోర్స్, @narendramodi
‘దక్షిణ చైనా సముద్ర’ అంశంపై ఆందోళన
బైడెన్ స్వస్థలంలో నిర్వహించిన క్వాడ్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు ఇదే చివరి సమావేశం.
క్వాడ్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించిన మోదీ, ఈ సమావేశం నిర్వహించినందుకు జో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
‘‘మీ నేతృత్వంలో 2021లో తొలి క్వాడ్ సమావేశం జరిగింది. స్వల్ప వ్యవధిలో అన్ని వైపుల నుంచి మీ సహకారాన్ని మేం పొందాం’’ అని మోదీ అన్నారు.
‘‘దీనిలో మీరు వ్యక్తిగతంగా కీలక పాత్ర పోషించారు. క్వాడ్ పట్ల మీ నిబద్ధతకు, నేతృత్వానికి, సహకారానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా’’ అని ప్రధాని అన్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు నాలుగు దేశాల కూటమిగా ఈ సంస్థ ఏర్పాటైంది.
ఈ సంస్థ మొదలైనప్పటి నుంచి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు పలు ఒప్పందాలు చేసుకుంటూ వచ్చింది.
సమావేశం ముగిసిన తర్వాత క్వాడ్ నేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, తూర్పు, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఉగ్రవాదంపై చర్చ
‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మేం సంస్కరిస్తాం’ అని క్వాడ్ నేతలు చెప్పారు.
భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని సంయుక్త ప్రకటనలో క్వాడ్ నేతలు కోరుకున్నారు. ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించాలని క్వాడ్ నేతలు తమ ప్రకటనలో ప్రస్తావించారు.
క్వాడ్ నేతలు సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదం, హింసను కూడా తీవ్రంగా విమర్శించారు.
‘‘క్రాస్-బోర్డర్ టెర్రరిజంతో సహా ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా మేం గట్టిగా ఖండిస్తాం. ముంబయి 26/11, పఠాన్‌కోట్ వంటి ఉగ్రవాద దాడులను మేం ఖండిస్తున్నాం’’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై ఆందోళనలు
యుక్రెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై కూడా క్వాడ్ నేతలు తమ సంయుక్త ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి లాంచ్‌లను, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను పలుమార్లు ఉల్లంఘిస్తూ అణు ఆయుధాలను ప్రయోగించడం కొనసాగించడాన్ని క్వాడ్ నేతలు తమ ప్రకటనలో ఖండించారు.
‘‘అంతర్జాతీయ శాంతికి, స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా ఈ ప్రయోగాలు ఉంటున్నాయి. ఐరాస భద్రతా మండలి కింద తన బాధ్యతలన్నింటికీ ఉత్తర కొరియా కట్టుబడి ఉండాలి. కవ్వింపు చర్యలను ఆపేయాలి. చర్చలలో పాల్గొనాలి’’ అని క్వాడ్ నేతలు చెప్పారు.
క్వాడ్ అనే పదం ‘క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్’లోని క్వాడ్రిలేటరల్ నుంచి వచ్చింది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి.
2004 సునామీ తర్వాత క్వాడ్ లాంటి ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన చర్చకు వచ్చింది.
ఆ సమయంలో భారత్ ఈ సునామీ వల్ల ప్రభావితమైన దేశాలలో సహాయ, ఉపశమన చర్యలకు నేతృత్వ వహించింది. ఈ గ్రూప్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు చేరాయి.
ఈ గ్రూప్ ఐడియా ఘనత అంతా జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకే దక్కుతుంది.
2006 నుంచి 2007 మధ్య క్వాడ్ స్థాపనకు షింజో అబే కీలకంగా వ్యవహరించి పునాది వేశారు.
2007 ఆగస్టులో మనీలాలో ఉన్నత స్థాయి అధికారులతో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ తొలి అనధికారిక సమావేశం నిర్వహించింది.

ఫొటో సోర్స్, @narendramodi
ద్వైపాక్షిక చర్చలలో..
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాను ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో కలిశారు.
భారత్, జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య పురోగతిపై ఇరు దేశాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జపాన్ ప్రధాని అందించిన సహకారానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.
రాజకీయ, వ్యూహాత్మక, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, పరిశోధనా వంటి విషయాల్లో ద్వైపాక్షిక సహకరాన్ని పెంపొందించుకోవడంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.
వీటితో పాటు, వాతావరణ మార్పు, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రజా సంబంధాలు వంటి విషయాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంపై కూడా చర్చించారు.
రెండు దేశాల ప్రధానమంత్రులు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయిలకు తీసుకెళ్లేందుకు, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇరు నేతలు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














