గెర్డా ఫిలిప్స్‌బోర్న్: జర్మనీ నుంచి వచ్చిన ఈమెను భారత్‌లో ‘అక్క’ అని అంటారు, ఎందుకంటే..

ఫొటో సోర్స్, Family of Muhammad Mujeeb
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
దిల్లీలోని ఒక ముస్లిం శ్మశానవాటికలో ఒక సమాధి ప్రత్యేకంగా ఉంటుంది.
ఆ సమాధి మీద ఉర్దూలో అక్షరాలు రాసి ఉంటాయి. ఆ అక్షరాల కింద ‘గెర్డా ఫిలిప్స్‌బోర్న్’ అనే పేరు ఇంగ్లిష్‌లో ఉంటుంది. తర్వాత ‘ఆపా జాన్’ అని కూడా రాసి ఉంటుంది. ఆపా జాన్ అంటే అక్క అని అర్థం.
జర్మనీలో జన్మించిన ఒక యూదు మహిళ గెర్డా ఫిలిప్స్‌బోర్న్ సమాధి అది.
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుల సమాధులు ఉన్న ఈ ప్రదేశంలో ఆమె సమాధి ఉండటం చాలా అసాధారణం కూడా.
జామియా మిలియా ఇస్లామియా అనేది ఒక అగ్రశ్రేణి ముస్లిం యూనివర్సిటీ. భారత స్వాతంత్ర్య ఉద్యమంతోనూ ఈ విశ్వవిద్యాలయానికి సంబంధాలు ఉన్నాయి.
ఆ రాజకీయ క్రియాశీలత వారసత్వాన్ని ఈ యూనివర్సిటీ విద్యార్థులు కొనసాగిస్తున్నారు.
2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు తెలిపారు.

మరి, ఒక యూదు మహిళ సమాధి, ఆమె మాతృభూమికి ఏమాత్రం సంబంధం లేని దిల్లీలో ఎందుకు ఉంది?
దీనికి సమాధానం స్నేహానికి అర్థం వెతుకుతున్న ఒక స్త్రీ అన్వేషణలో దొరుకుతుందని ‘‘జామియాస్ ఆపా జాన్: ద మెనీ లైఫ్‌వరల్డ్స్ ఆఫ్ గెర్డా ఫిలిప్స్‌బోర్న్’ అనే పుస్తక రచయిత మార్గరెట్ పెర్నౌ చెప్పారు.
మార్గరెట్ పెర్నౌ దశాబ్ద కాలం పాటు జామియాపై అధ్యయనం చేశారు. తన పరిశోధన సమయంలో ఎన్నోసార్లు గెర్డా ఫిలిప్స్‌బోర్న్ పేరును విన్నానని, అయినప్పటికీ ఆమె జీవితంలో చాలా విషయాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయని మార్గరెట్ చెప్పారు.
ఇప్పటికీ చాలామంది విద్యార్థులకు గెర్డా గురించి, యూనివర్సిటీకి ఆమె చేసిన సేవల గురించి తెలియదు.
జర్మన్ ‘మేమ్‌సాబ్’ నుంచి జామియా ‘ఆపా జాన్’ వరకు గెర్డా ఫిలిప్స్‌బోర్న్ ప్రయాణం 1933లో మొదలైంది. చదువుకోవడం కోసం బెర్లిన్‌కు వెళ్లిన ముగ్గురు భారతీయులు జాకీర్ హుస్సేన్, ముహమ్మద్ ముజీబ్, అబిద్ హుస్సేన్‌లతో ఆమెకు స్నేహం ఏర్పడింది. తర్వాత, ఆమె భారత్‌కు వచ్చారు.
ఈ ముగ్గురు పురుషులే జామియా యూనివర్సిటీకి ప్రధాన వ్యవస్థాపకులుగా మారారు. భారత రాజకీయ చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఇందులో జాకీర్ హుస్సేన్ 1967లో భారత మూడవ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.

ఫొటో సోర్స్, Margrit Pernau
1920లు, 30లలో వేర్వేరు దేశాల పౌరుల మధ్య స్నేహాలు ఉండటమే చాలా అరుదు. అలాంటిది ముగ్గురు పురుషులు, ఒక మహిళ మధ్య ఆత్మీయ స్నేహాన్ని అప్పట్లో ఎవరూ ఊహించలేరు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మమేకమైన ఆ ముగ్గురు వ్యక్తులు తరచుగా గెర్డాతో మాట్లాడుతుండేవారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి దోహదపడేలా ఒక సంస్థను నిర్మించాలనే తమ ప్రణాళికలను ఆమెతో పంచుకునేవారు.
అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో చాలా తక్కువ విశ్వవిద్యాలయాలు ఉండేవి. ముస్లిం అబ్బాయిలు, అమ్మాయిలు తమంతటతాముగా విద్యను అభ్యసించే ప్రదేశంగా జామియాను తీర్చిదిద్దాలని వారు కోరుకున్నారు. ఫలితంగా భారత స్వాతంత్ర్య సంగ్రామంలో యువత క్రియాశీల పాత్ర పోషించగలరని వారు భావించారు. ఈ సంస్థ హిందూ ముస్లింల మధ్య ఐకమత్యాన్ని, మాతృభూమి పట్ల ప్రేమను పెంపొందించాలని వారు కోరుకున్నారు.
ఈ ప్రణాళికలు గెర్డా ఫిలిప్స్‌బోర్న్‌ను బాగా ఆలోచింపజేశాయి. 1895లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె పారిశ్రామికీకరణ, యుద్ధం, యూదు వ్యతిరేక ఉద్యమం ద్వారా తన జీవితం, తన చుట్టూ ఉన్న ప్రపంచం మారడాన్ని చూశారు.
అణచివేతకు గురి కావడం, స్వేచ్ఛను కోరుకోవడం, మార్పుకు నాంది పలకాలనే కోరికతో పనిచేయడం ఎలా ఉంటుందో ఆమె స్వయంగా అర్థం చేసుకున్నారని పెర్నౌ రాశారు.
జామియా నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేసేందుకు తన ముగ్గురు స్నేహితులు బెర్లిన్‌ను వదిలి తమ సొంత దేశానికి వెళ్లిపోయిన వెంటనే ఆమె కూడా భారత్‌కు పయనమయ్యారు.
సందడిగా, ఆధునికంగా ఉండే బెర్లిన్ నుంచి పేదరికంలో మగ్గుతున్న ఒక దేశానికి తరలి వెళ్లడం అంత తేలికేం కాదు. అందుకే భారత్‌కు రావొద్దంటూ జాకీర్ హుస్సేన్ అనేకసార్లు ఆమెకు సూచించారని పెర్నౌ రాశారు.
‘‘జాకీర్ హుస్సేన్‌తో పాటే భారత్‌కు వస్తానని ఆమె అనేకసార్లు ఆయనను అడిగారు. అయితే, భారత్‌కు రావొద్దంటూ ఆమెకు ఆయన సలహాలు, హెచ్చరికలు, ఉపదేశాలు ఇచ్చారు’’ అని పెర్నౌ పేర్కొన్నారు.
‘‘ఆ కాలంలో, కొంతమంది హిందువులు, ముస్లింలు తమ ఇంటి మహిళలు ఇతర పురుషులు లేదా అపరిచితుల దృష్టిలో పడకుండా ఉంచేందుకు పర్దా పద్ధతిని అనుసరించేవారు. అలాంటి పరిస్థితుల్లో, పెళ్లికాని, తోడులేని ఒక యువతి జామియాలో ఎలా కుదురుకుంటారోనని గెర్డా గురించి ముహమ్మద్ ముజీబ్ ఆశ్చర్యపోయేవారు’’ అని పెర్నౌ తన పుస్తకంలో రాశారు.
గెర్డా ఫిలిప్స్‌బోర్న్ ముందు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు.
ఆమె కొన్ని నెలల్లోనే జామియాలో స్నేహితులను సంపాదించుకున్నారు. యూనివర్సిటీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో బోధించడం కూడా మొదలుపెట్టారు. అక్కడ పనిచేసే ఇతర టీచర్ల తరహాలోనే చాలా తక్కువ జీతానికి ఆమె పనిచేశారు. ఆ సంస్థ సేవకు తన జీవితాన్ని అంకితం చేయడానికి ఆమె సిద్ధమయ్యారు.
విద్యార్థులకు చదువును సంతోషంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు జర్మనీలోని కిండర్‌గార్టెన్స్‌లో పొందిన బోధనా అనుభవాన్ని ఆమె ఇక్కడ ఉపయోగించారు. పిల్లల హాస్టల్‌కు వార్డెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారికోసం ఆమె ఆపా జాన్ (అక్క) అవతారమెత్తారని పెర్నౌ పేర్కొన్నారు.
పిల్లలకు తలంటు స్నానాలు చేయించడం, తలకు నూనె రాయడం వంటి పనులు కూడా ఆమె చేసేవారు. పిల్లలను అక్కున చేర్చుకునేవారు.
‘‘ఆమె సంరక్షణలోని చిన్న పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు చాలా శ్రద్ధగా, ప్రేమగా వారిని చూసుకునేవారు. తల్లిని మరిపించేవారు’’ అని పెర్నౌ రాశారు.

ఫొటో సోర్స్, Payam-e ta'lim
సమాజంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని జామియాలోని అమ్మాయిలు, మహిళలను ఫిలిప్స్‌బోర్న్ ప్రోత్సహించారు. పాయమ్-ఎ-టాలిమ్ అనే చిన్నపిల్లల జర్నల్‌కు సంబంధించిన ఎడిటోరియల్ బృందంలో కూడా ఆమె పనిచేశారు. ఈ జర్నల్‌లో ఆమె మహిళల ఆసక్తులు, అభిరుచులకు సంబంధించిన కథనాలను రాశారు. జర్నల్ కోసం కథనాలు రాయాలని బాలికలను ప్రోత్సహించారు.
జామియాలో పిల్లల కోసమే కాకుండా, యూనివర్సిటీ కోసం నిధుల సేకరణలోనూ వ్యవస్థాపకులకు ఆమె సహాయపడ్డారు. ప్రసంగాలను రాసి ఇవ్వడం, బోధన లేదా రాజకీయ సంబంధిత అంశాల్లో కూడా ఆమె ముందుండి పని చేశారు.
భారత్‌కు వచ్చిన ఏడేళ్ల తర్వాత ఆమె చేసే పనికి అవరోధాలు ఏర్పడ్డాయి.
జర్మనీతో బ్రిటన్ యుద్ధం కారణంగా, బ్రిటిష్ ఇండియాలో ఉన్న జర్మన్ పౌరులను అనుమానించారు. వారిని అరెస్ట్ చేసి శిబిరాల్లో నిర్బంధించారు. ఆ శిబిరాల్లో వారికి నీరు, బ్లాంకెట్లు, ఆహారం వంటి కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేవు.
1940లో ఫిలిప్స్‌బోర్న్‌ను కూడా అలాంటి ఒక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ప్రాణభయాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆ శిబిరంలోని సహచరుల్లో ధైర్యాన్ని నింపడం, అనారోగ్యానికి గురైన వారి బాగోగులు చూడటం వంటి పనులు చేశారు.
శిబిరంలో నిర్బంధించిన రెండు నెలల తర్వాత ఆమె గ్యాస్ట్రిక్ అల్సర్ బారిన పడ్డారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి, మళ్లీ శిబిరానికే తీసుకొచ్చారు సిబ్బంది. అక్కడ ఆమె ఏడాది కాలం నివసించారు.
శిబిరం నుంచి విడుదలయ్యాక ఆమె మళ్లీ జామియాకు వెళ్లారు. అక్కడ తన పనిని కొనసాగించారు. కానీ, ఆమెకు ఉన్న అల్సర్ కాస్తా క్యాన్సర్‌గా మారడంతో ఆమె ముందులా చురుగ్గా అన్ని పనుల్లో పాల్గొనలేకపోయారు.
తర్వాత ఆమె చాలా బలహీనపడ్డారు. కానీ పాయమ్-ఎ-టాలిమ్‌లో తన కథనాల ద్వారా పిల్లలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించారు.
1943 ఏప్రిల్‌లో ఫిలిప్స్‌బోర్న్ మరణించారు. జామియా కుటుంబాల కోసం కేటాయించిన శ్మశానంలో ఆమెను ఖననం చేశారు.
‘‘తన ఇంటికి, కుటుంబానికి చాలా మైళ్ల దూరంలో ఆమె చనిపోయారు. కానీ, తన చుట్టూ తనను ప్రేమించే వారు ఉన్నారు’’ అని గెర్డా మరణం గురించి హమీద్ చెప్పారు.
ఆమె మరణించిన చాలా కాలం తర్వాత కూడా ‘అపా జాన్’గా ఆమె లెగసీ, జామియా కారిడార్లలో సజీవంగా ఉంది. ఆమె పేరు మీద హాస్టల్, డే కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














