కాలం వింత: రెండు నిమిషాలలో ఐదు నిమిషాలను అనుభవిస్తే..

ఆగస్టులో మరణించిన ఫ్రెంచి శాస్త్రవేత్త మిషల్ సిఫెర్

ఫొటో సోర్స్, Getty Images

మీకు సెల్ ఫోన్ లేదా వాచ్‌ ఉంటే, టైమ్ ఎంతో తెలుసుకోవడానికి బహుశా మీరు రోజూ ఎన్నోసార్లు వాటిని చూసుకొంటుంటారు.

కాలం మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో అందరికీ తెలిసిందే. అందుకే పురాతన కాలంలోనూ సూర్యుడిని రెఫరెన్సుగా ఉపయోగించి, సమయాన్ని తెలుసుకునేవాళ్లు.

కానీ, పగలు ఎప్పుడు, రాత్రి ఎప్పుడు అన్న విషయం మనకు తెలియకపోతే ఎలా? సమయాన్ని ట్రాక్ చేసే పరికరం మన దగ్గర లేకుంటే?

ఇదే ప్రశ్నను 1960లలో మిషల్ సిఫెర్ అనే యువ ఫ్రెంచ్ జియాలజిస్ట్ తనకు తాను వేసుకున్నారు.

అంతరిక్షాన్ని జయించడానికి అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య స్పేస్ రేస్ జరుగుతున్న నేపథ్యంలో, సిఫెర్‌కు ఈ సందేహం తలెత్తింది.

1961లో సోవియట్ యూనియన్‌కు చెందిన యూరీ గగారిన్ 108 నిమిషాలు భూమి చుట్టూ తిరిగి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు అయ్యారు.

మానవులు అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపితే ఏం జరుగుతుంది? అని సిఫెర్ ఆలోచించారు. ఇది మన ‘స్లీప్ సైకిల్‌’ను ఎలా ప్రభావితం చేస్తుంది?

ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఆయన భూ గ్రహం బయటకు ప్రయాణించలేదు కానీ, భూగర్భంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

బీబీసీ వాట్పాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సిఫెర్ జులై 16, 1962న భూగర్భ గుహలోకి ప్రవేశించి, సెప్టెంబర్ 17న బయటకు వచ్చారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిఫెర్ 1962 జులై 16న భూగర్భ గుహలోకి ప్రవేశించి, సెప్టెంబర్ 17న బయటకు వచ్చారు

కేవ్ మ్యాన్

ఆగస్టు 25న, 85 ఏళ్ల వయసులో మరణించిన సిఫెర్, ఒక స్పీలియాలజిస్ట్, అంటే గుహలను అధ్యయనం చేసే శాస్త్రవేత్త.

1962లో, కేవలం 23 ఏళ్ల వయసులో, ఆయన మానవ క్రోనోబయాలజీ చరిత్రలోని అత్యంత ప్రసిద్ధ ప్రయోగాలలో ఒకదాన్ని రూపొందించారు. ఆయన తాను కనుగొన్న విషయాల ఆధారంగా, జీవ లయల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.

ఇందుకోసం ఒక ప్రయోగంలో భాగంగా, ఆయన 130 మీటర్ల అడుగున ఉన్న ఒక గుహలో రెండు నెలలపాటు ఒంటరిగా గడిపారు. ఆ సమయంలో కేవలం మైనింగ్ కార్మికులు వాడే ఒక దీపం మాత్రం తన వద్ద ఉంచుకున్నారు. ఆహారాన్ని వండుకోవడానికి, డైరీ రాయడానికి, చదువుకోవడానికి ఆయన దానినే ఉపయోగించే వారు.

"నేను చీకటిలో గడియారం లేకుండా, కాలం తెలియకుండా జీవించాలని నిర్ణయించుకున్నాను" అని 2008లో క్యాబినెట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

సిఫెర్ ఆల్ఫ్‌లోని భూగర్భ హిమానీ నదంపై ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

"నేను గుహ ప్రవేశ ద్వారం వద్ద ఒక టీమ్‌ను ఉంచాను. నేను నిద్ర మేల్కొన్నప్పుడు, తిన్న తర్వాత, నిద్రపోయే ముందు వాళ్లకు చెబుతాను. వాళ్లు నన్ను పిలవడానికి వీలు లేదు, నాకు బయట సమయం ఎంత అయిందో వాళ్లు చెప్పకూడదు," అని ఆయన వివరించారు.

ఈ విధంగా, మానవులకు "జీవ గడియారం" ఉంటుందని ఆయన నిరూపించగలిగారు.

అయితే, మన దైనందిన జీవితంలో జరిగే విధంగా ఈ జీవగడియారం 24 గంటల రోజు ప్రకారం ఉండదు అని తెలుసుకోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

భూగర్భంలో ఉండగా మెల్లగా గడిచిన సమయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూగర్భంలో ఉండగా మెల్లగా గడిచిన సమయం

ఆగిపోయిన సమయం

గుహలో ఉన్న ఎనిమిది వారాలలో, సిఫెర్ తన శరీరం కోరినప్పుడు మాత్రమే తిని, నిద్రపోయేవారు.

ఆయన అలా చేసిన ప్రతిసారీ గుహ ముందున్న తన టీమ్‌కు చెప్పేవారు. దానితో పాటు ఆయన మరో రెండు పరీక్షలూ చేసేవారు – ఒకటి, తన పల్స్‌ను లెక్కించడం; రెండు, 1 నుంచి 120 వరకు లెక్క పెట్టడం.

ఈ రెండో పరీక్ష అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలలో ఒకదానికి దారి తీసింది.

ప్రతీ సెకనుకు ఒక అంకె చొప్పున 120 వరకు లెక్కించడం సిఫెర్ లక్ష్యం. అయితే ఆయన టీమ్ బయట వాస్తవ సమయాన్ని రికార్డ్ చేయగా, సిఫెర్ కాలాన్ని చాలా నెమ్మదిగా లెక్కిస్తున్నాడని వాళ్లు గ్రహించారు.

"120కి లెక్కించడానికి నాకు ఐదు నిమిషాలు పట్టింది. మరో మాటలో చెప్పాలంటే, నేను రెండు నిమిషాలను మానసికంగా ఐదు నిమిషాలుగా అనుభవించాను."

ఎట్టకేలకు సిఫెర్ గుహ నుంచి బయటకు వచ్చినప్పుడు కాలం మందగించిందనే భావన నిర్ధారణ అయింది. రెండు నెలలు గడిచినా, సిఫెర్ మాత్రం ఒక నెలే అయిందని భావించారు.

"నా సైకలాజికల్ సమయం సగం తగ్గింది," అని ఆయన అన్నారు.

మానసిక కాలం ప్రభావాన్ని విశ్లేషించడానికి సిఫెర్ అర్ధ శతాబ్దం పాటు అనేక ప్రయోగాలు చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మానసిక కాలం ప్రభావాన్ని విశ్లేషించడానికి సిఫెర్ అర్ధ శతాబ్దం పాటు అనేక ప్రయోగాలు చేశారు

48 గంటల అంతర్గత గడియారం

సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ద్వారా ప్రకృతి మార్గనిర్దేశం చేసే సిర్కాడియన్ రిథమ్స్ లేకుంటే, మన శరీరంలో దాదాపు 48 గంటల కాలచక్రంలో పనిచేసే అంతర్గత గడియారం ఉందని సిఫెర్ పరిశోధనలు సూచించాయి.

ఈ ఫ్రెంచ్ స్పీలియాలజిస్ట్ తన 50 ఏళ్లకు పైగా కెరీర్‌లో తనపై, ఇతరులపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ సిద్ధాంతానికి ఊతం లభిస్తోంది.

1962 తర్వాత ఆయన కొందరు వాలంటీర్లతో ఇలాంటి మరో ఐదు ప్రయోగాలు చేశారు. అవి ఒక్కొక్కటి మూడు నుంచి ఆరు నెలల పాటు కొనసాగాయి.

చివరకు ఈ 48 గంటల కాలచక్రం అందరి అనుభవంలోకి వచ్చిందని సిఫెర్ గుర్తించారు.

"వాళ్లు 36 గంటల పాటు నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉన్న తర్వాత, 12 నుంచి 14 గంటలు నిద్రపోయారు," అని ఆయన వివరించారు.

"ఈ ఆవిష్కరణ తర్వాత, ఫ్రెంచ్ సైన్యం నాకు చాలా నిధులు ఇచ్చింది. ఒక సైనికుడు మేల్కొన్న స్థితిలో అతని కార్యాచరణను ఎలా మెరుగుపరచవచ్చో విశ్లేషించాలని వాళ్లు కోరారు," అని సిఫెర్ క్యాబినెట్ మ్యాగజైన్‌కు వెల్లడించారు.

ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ మరొక కారణంతోనూ ఈ ప్రయోగాలపై ఆసక్తి చూపింది. వాళ్లు తాము ప్రారంభించిన అణు జలాంతర్గామి కార్యక్రమంలోని సుదీర్ఘ మిషన్ నావికుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు.

అలాగే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైతం దీర్ఘకాల అంతరిక్ష యాత్రల ప్రభావాలను అర్థం చేసుకోవాలనుకుంది.

ఈ రెండూ సిఫెర్ రెండవ ప్రాజెక్ట్‌కు నిధులు చేకూర్చాయి. ఆయన 1972లో మళ్లీ భూగర్భంలోకి వెళ్లారు, కానీ ఈసారి అమెరికాలో, అదీ చాలాకాలం పాటు.

టెక్సాస్‌లోని డెల్ రియో సమీపంలోని మిడ్‌నైట్ కేవ్‌లో ఆరు నెలలు గడపడం ఆ ప్రయోగ లక్ష్యం.

కాలం అంటే మనకు తెలుసా?

"మానసిక సమయంపై వృద్ధాప్య ప్రభావాన్ని అధ్యయనం చేయడం నాకు ఇష్టం. నా మెదడు కాలాన్ని గ్రహించే విధానంలో ఏవైనా మార్పులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ప్రతి పది లేదా పదిహేను సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రయోగం చేయాలనుకున్నాను," అని సిఫెర్ వివరించారు.

"నాకు తప్ప భూగర్భంలో ఉన్న మిగతా వాలంటీర్లందరికీ నలభై ఎనిమిది గంటల నిద్ర/మేల్కొనే చక్రం ఎందుకు అనుభవంలోకి వచ్చింది?" అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని ఆయన ఈ ప్రయోగం చేశారు.

205 రోజులు కొనసాగిన ఈ ప్రయోగంలో, ఆయనకూ ఈ 48 గంటల కాలచక్రం అనుభవంలోకి వచ్చింది. అయితే అన్నిసార్లూ కాదు.

"నేను ముప్పై ఆరు గంటలు మేల్కొన్నాను, పన్నెండు గంటల నిద్రపోయాను. ఆ సుదీర్ఘమైన రోజులకు, ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉండే రోజులకు మధ్య తేడాను నేను గుర్తించలేకపోయాను," అని సిఫెర్ అన్నారు.

"కొన్నిసార్లు నేను రెండు గంటలు లేదా పద్దెనిమిది గంటలు నిద్రపోయేవాణ్ని, కానీ నేను తేడాను చెప్పలేను. ఇది మనమందరం అంగీకరించాల్సిన అనుభవం అని నేను భావిస్తున్నాను," అని ఆయన అన్నారు.

"ఇది మానసిక కాల సమస్య. ఇది మానవుల సమస్య. కాలం అంటే ఏమిటి? మనకు తెలీదు." అని సిఫెర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)