ఆంధ్రప్రదేశ్: ఎన్డీయే కూటమి వంద రోజుల పాలన ఎలా ఉంది?

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, TELUGU DESAM PARTY(TDP)

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది.

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయగా, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యారు.

మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో సీఎం సహా 21 మంది టీడీపీకి చెందినవారు కాగా ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీకి చెందిన వారు.

మరి 100 రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం ఈ కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? ఒకసారి చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా వివాదస్పాదమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అదొక ప్రధానాంశంగా నిలిచింది.

అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నాడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు ప్రకటించారు.

అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, UGC

మారిన ఇసుక పాలసీ

గత ప్రభుత్వ హయాంలో బాగా విమర్శల పాలైన ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది. ‘ఉచిత’ ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది.

వినియోగదారుల నుంచి స్థానిక సంస్థల సీనరేజీ, రవాణా రుసుము మాత్రమే వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

అయితే, రవాణా చార్జీల విషయంలో కొన్నిచోట్ల విమర్శలు వచ్చాయి.

దీంతో మరోసారి సమీక్ష చేసిన రాష్ట్రమంతటా ఆన్‌లైన్ పర్మిట్ విధానం తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, UGC

తెరుచుకున్న అన్న క్యాంటీన్లు

రూ.5 రూపాయలకు టిఫిన్, భోజనం అందించే ‘అన్న క్యాంటీన్ల’ను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించింది.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014 -19) చివర్లో ప్రారంభమైన ఈ క్యాంటీన్లను జగన్ ప్రభుత్వంలో మూసివేశారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ వాటిని తెరిచారు.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, UGC

ఆరు గ్యారెంటీల సంగతి ఏంటి?

2024 ఎన్నికల్లో చంద్రబాబు ఆరు గ్యారెంటీలను బాగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని చెప్పారు.

ఆరు గ్యారంటీలు:

1. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి

2. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు

3. స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.3000

4. ప్రతి మహిళకు నెలకి రూ. 1500

5. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం

6. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం

అయితే ఇంతవరకు ఈ హామీలు అమలు కాలేదు. వాటి మీద కసరత్తు జరుగుతోందని త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి బీబీసీకి తెలిపారు. దసరా నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని అన్నారు.

ఇది ఇలా ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి.

ఆదాయం వచ్చే శాఖలపై పాలసీలు రూపొందించడంలో ఇప్పటికీ కాలయాపన జరుగుతోంది. ప్రధానంగా ఎక్సైజ్, మైనింగ్, ఇరిగేషన్ వంటి కీలక శాఖల పనితీరును పరిగెత్తించడంలో తాత్సారం జరుగుతోందనే విమర్శలున్నాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, FACEBOOK/GADDERAMMOHAN

విమర్శలేంటి?

చంద్రబాబు నాయుడుకి పాలనా వ్యవహారాలపై గట్టిపట్టు ఉంటుందనే వాదనలకు భిన్నంగా ఈ వందరోజుల పాలన ఉందని విమర్శకులు అంటున్నారు.

చాలామంది అధికారులు ఇంకా నిర్లిప్తంగా ఉన్నారంటూ స్వయంగా చంద్రబాబునాయుడే అన్నారు.

విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ స్పందన ఒక రోజు ఆలస్యమైందన్న విమర్శలున్నాయి.

ప్రమాద తీవ్రతను అంచనా వేసి ప్రజలను ముందుగానే హెచ్చరించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, FB/YSRCPOFFICIAL

వైసీపీ ఆరోపణలేంటి...?

ఇక ప్రతిపక్షనేతల మీద రకరకాల కేసులు, అరెస్టులతో పోయిన వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ‘ప్రతీకార రాజకీయాలు’ చేస్తోందనే విమర్శలు వచ్చాయి.

చట్టప్రకారం తాము చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ చెబుతున్నా, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు...కొందరు మంత్రులు, అధికారుల గురించి మాట్లాడుతూ ‘రెడ్ బుక్’ ప్రస్తావన తెచ్చేవారు.

చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడును పుంగనూరుకు రాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు యాత్రపై అప్పట్లో రాళ్ల దాడి జరిగింది.

అదే తరహాలో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డిని ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరుకి వెళ్లకుండా తిరుపతిలోనే అడ్డుకున్నారని, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఇక గతంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలను ఒక్కొక్కరినీ అరెస్టు చేసి జైలుకు పంపడం, చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చి స్టేషన్‌కి పిలిపించి విచారించడం, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జోగి రమేశ్ కుమారుడిని అరెస్టు చేయడం...ఇవన్నీ నిబంధనల మేరకే జరిగాయని టీడీపీ నేతలు చెబుతున్నా...ఇవన్నీ కక్షపూరిత రాజకీయాల్లో భాగమేనని వైసీపీ ఆరోపిస్తోంది.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, FB/TDP

వంద రోజుల్లో ఎన్నో చేశాం: టీడీపీ

164 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి 100 రోజుల్లో ఎన్నో హామీలు అమలు చేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు.

“ఈ వంద రోజుల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం మళ్లీ ఓ నమ్మకాన్ని కలిగించింది. గతంలో వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు సాగదీసిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. ఈ రోజున ముఖ్యమంత్రి అయిన నెలలోనే రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచిన చంద్రబాబు ప్రభుత్వాన్నీ చూస్తున్నారు. ఇలా 100 రోజుల్లో ఎన్నో రకాల ఘనతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం సాధించింది” అని పట్టాభి అన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి ప్రభుత్వం

ఫొటో సోర్స్, YSJagan/FB

ఏం సాధించారని ఈ సంబరాలు?: వైసీపీ

“ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి...ఈ వంద రోజుల్లో ఏమీ చేయలేక పోయింది. ఎన్నికల సమయంలో ఏ హామీలు ఇచ్చారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అమలు చేశారు? అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అమలవుతున్న కార్యక్రమం ఏదైనా ఉందంటే అది రెడ్ బుక్ ఒక్కటే’’ అని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు.

వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారని విష్ణు విమర్శించారు.

పాలన కంటే ప్రతీకారం పైనే ఎక్కువ దృష్టి ...

ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి. కృష్ణంరాజు ఎన్డీయే వందరోజుల పాలనపై స్పందించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన చూస్తే పరిపాలన కంటే ప్రతీకారం పైనే పాలకులు ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని అన్నారు.

‘‘చంద్రబాబు నాయుడు గతంలోని తన స్వభావానికి విరుద్ధంగా ఈసారి ప్రత్యర్థులపై ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారు. ప్రతిదానికీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ముందు తాము ఇచ్చిన హామీలు అమలుపై సీఎం దృష్టి సారించాలి. ఇసుక పాలసీ అమలుపై మొదట్లో విమర్శలు వచ్చినా ఇప్పుడు ఫరవాలేదనే మాట వినిపిస్తోంది. బెజవాడ వరదల విషయంలో తొలిరోజు ప్రభుత్వం విఫలమైనప్పటికీ తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవాన్ని రంగరించి సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు’’ అని కృష్ణంరాజు బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)