ఆంధ్రప్రదేశ్: బీజేపీ నుంచి మంత్రి పదవి పొందిన ఒకే ఒక్కడు.. ఎవరీ సత్యకుమార్ యాదవ్?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఒకే ఒక్కరికి అవకాశం దక్కింది.
ఆయనే ధర్మవరం నుంచి గెలిచిన వై.సత్యకుమార్ యాదవ్.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఒకప్పుడు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన సత్యకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వరకూ ఎదిగారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగానూ ఉన్నారు.
సత్యకుమార్ యాదవ్ స్వస్థలం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన గడేకల్లు.
కడప జిల్లా ప్రొద్దుటూరు, తెలంగాణలోని నాగర్ కర్నూలులో పాఠశాల విద్య.. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చెన్నైలోని ఐటీఎంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు.
ప్రస్తుతం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి లా కోర్సు చదువుతున్నారు.


ఫొటో సోర్స్, FB/satyakumar.bjp
భాషపై పట్టుతో..
సత్యకుమార్ యాదవ్‌కు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీలో మంచి పట్టుంది.
1993 సమయంలో వెంకయ్య నాయుడు తన కోసం పర్సనల్ అసిస్టెంట్‌ను వెతుకుతున్న క్రమంలో సత్యకుమార్ యాదవ్ పరిచయం అయ్యారు.
అలా ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరారు. దాదాపు పాతికేళ్ల పాటు పనిచేశారు.
వెంకయ్య నాయుడు వివిధ హోదాల్లో ఉన్నప్పుడు ప్రైవేటు కార్యదర్శిగా, అదనపు ప్రైవేటు కార్యదర్శిగా, సీనియర్ ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు.
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కొద్దిరోజులు ఓఎస్డీగానూ చేశారు.
ఆ తర్వాత బీజేపీలో చేరారు.
2018లో జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు సత్యకుమార్.
ఇప్పటి వరకు మూడుసార్లు ఆ పదవి చేపట్టారు.
కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలికుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహ ఇన్ఛార్జిగా, అండమాన్-నికోబార్ ఇన్ఛార్జిగానూ ఉన్నారు.
సంస్కృతి ఫౌండేషన్ తరఫున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, SATYA KUMAR Y/FACEBOOK
లోక్‌సభ అనుకుంటే అసెంబ్లీకి...
ధర్మవరం అసెంబ్లీ సీటు విషయంలో సత్యకుమార్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని.. అసెంబ్లీకి పోటీ చేశారు.
అప్పటికే అక్కడ టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ ఇన్చార్జిగా ఉన్నారు.
ఆయన బరిలో దిగుతారని పార్టీ నాయకులు భావించారు.
పొత్తుల్లో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ.
అప్పటికే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారయణ (వరదాపురం సూరి) బీజేపీలో ఉన్నప్పటికీ మధ్యేమార్గంగా సత్యకుమార్‌కు టికెట్ కేటాయించింది అధిష్ఠానం.
ప్రచారంలో దూకుడు మీదున్న ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై చివరి నిమిషంలో బరిలో నిలిచారు సత్యకుమార్ యాదవ్. పోటాపోటీగా జరిగిన పోరులో కేతిరెడ్డిపై 3,734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సత్యకుమార్‌కు రూ.11.04 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నాయి.
ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SATYA KUMAR Y/FACEBOOK
సీనియర్లను కాదని..
బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన వారిలో కామినేని శ్రీనివాస్, సీహెచ్.ఆదినారాయణ రెడ్డి, పి.విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వంటి సీనియర్లు ఉన్నారు.
వీరిలో కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
సుజనా చౌదరి కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేశారు.
అయినప్పటికీ, కేబినెట్‌లో చోటు విషయంలో మొదటిసారి గెలిచిన సత్యకుమార్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









