ప్లాన్‌కన్నా ముందే పేజర్ పేలుళ్లు, ఇది మొసాద్ పనేనా ? హిజ్బుల్లాకు ఇది షాక్ అవుతుందా....

లెబనాన్, హిజ్బుల్లా, మొసాద్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, లెబనాన్ ఆర్మీ పహారా

లెబనాన్‌లో పేజర్లు పేలుళ్ల వెనక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ హస్తం ఉందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్ దీనిపై స్పందించ లేదు.

హిజ్బుల్లాకు చెందిన వేలపేజర్లలో పేలుడుపదార్థాలు ఉంచిన మొస్సాద్...లెబనాన్ అంతటా వాటిని పేల్చివేసిందని తెలుస్తోంది.

మరోవైపు బుధవారం కూడా కొన్ని పేలుళ్లు జరిగాయని, వందల సంఖ్యలో పేజర్ యూజర్లు గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

పేజర్లను కొన్ని నెలల కిందటే దేశంలోకి తీసుకొచ్చామని లెబనీస్ భద్రతా విభాగం సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు.

పేజర్లను ఇప్పుడు పేల్చాలన్న ప్రణాళిక లేకపోయినప్పటికీ హిజ్బుల్లా తమ పథకం గురించి తెలుసుకుంటుందేమోనన్న అనుమానంతో ముందుగానే ఇజ్రాయెల్ వాటిని పేల్చివేసిందని ఇజ్రాయెల్, అమెరికా బలగాలకు చెందిన విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లెబనాన్, హిజ్బుల్లా, మొసాద్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Joy Chiang/BBC

ఫొటో క్యాప్షన్, పేజర్లతో గోల్డ్ అపోలో సంబంధాలపై తైపీ పోలీసుల దర్యాప్తు

‘పేజర్లు తయారుచేసిన హంగేరీ సంస్థ’

తేలిగ్గా ట్రాక్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈ ఏడాది ప్రారంభంలో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించిన తర్వాత హిజ్బుల్లా పేజర్లు ఉపయోగిస్తోంది.

ఈ పేజర్లను తైవాన్‌కు చెందిన కంపెనీ తయారుచేసినట్టు భావించగా, ఈ ప్రచారాన్ని తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో ఖండించింది. పేజర్ల తయారీలో తమ పాత్రేమీ లేదని, హంగేరీ సంస్థ వాటిని తయారుచేసిందని వెల్లడించింది.

అత్యంతశక్తిమంతమైన 20గ్రాముల పేలుడుపదార్థాలను పేజర్లలో ఉంచారని పేలుడు పదార్థాల నిపుణులు బీబీసీతో చెప్పారు.

గాయపడ్డవారిలో బేరూత్‌కు చెందిన వారు ఎక్కువమంది ఉన్నారు. దక్షిణ లెబనాన్‌లో 750 మంది, బేరూత్ ప్రాంతంలో దాదాపు 1,750 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరాస్ అబియాద్ చెప్పారు.

గాయపడ్డవారిలో 10శాతం మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిలో కొందరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని తెలిపారు. చాలా మందికి ముఖంపై గాయాలవ్వడంతో వారికి వెంటిలేషన్ అమర్చారు.

దాదాపు 100 ఆస్పత్రుల్లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారిలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఇరాన్, సిరియాలకు తరలించారు. మరణించిన వారిలో ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.

లెబనాన్, హిజ్బుల్లా, మొసాద్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Google

అంధులుగా మారిన బాధితులు

బాధితుల్లో చాలామంది కళ్లకు గాయాలయ్యయి. మంగళవారం (సెప్టెంబరు 17) మధ్యాహ్నం ఓ పీడకలలా ఉందని బేరూత్‌లోని మౌంట్ లెబనాన్ యూనివర్శిటీ ఆస్పత్రి కంటి వైద్యనిపుణులు ప్రొఫెసర్ ఎలియాస్ వర్రాక్ చెప్పారు.

25 ఏళ్ల తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు తాను తొలగించిన కళ్లతో పోలిస్తే..పేజర్ పేలుళ్ల తర్వాత తొలగించిన కళ్ల సంఖ్య ఎక్కువని ఆయన చెప్పారు.

చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, బాధితుల్లో ఎక్కువమంది 20లలో ఉన్న యువకులని వారిలో కొందరికి రెండు కళ్లూ తొలగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

మొసాద్ ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

హిజ్బుల్లాపై ఒత్తిడి పెరిగిందా?

తైవాన్‌లో తయారు చేసిన 5,000పేజర్లలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ తక్కువ మొత్తంలో పేలుడుపదార్థాలు ఉంచిందని లెబనాన్ భద్రతాసంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్‌తో అన్నారు.

పేజర్ పేలుళ్ల తర్వాత హిజ్బుల్లా నేతల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగిందని అమెరికా థింక్ ట్యాంక్ ‘ద అట్లాంటింక్’ కౌన్సిల్‌కు చెందిన సీనియర్ విశ్లేషకులు నికోలస్ బ్లాన్‌ఫోర్డ్ అన్నారు. అక్టోబరులో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య సంక్షోభం మొదలైనప్పటినుంచి గమనిస్తే ఇది వారికి అత్యంత భయానకమైన సమయంగా ఆయన అభివర్ణించారు.

పరిస్థితిని సమీక్షించేందకు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ కమాండర్లతో సమావేశమైనట్లు ఇజ్రాయెల్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. కానీ, అందులో పేజర్ పేలుళ్ల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.

ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని చెప్పడమే ఈ సమావేశం ఉద్దేశం. ప్రజల కోసం కూడా భద్రతా మార్గదర్శకాలు/హెచ్చరికలను ఇజ్రాయెల్ విడుదల చేయలేదు. అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచించింది.

పేజర్‌ దాడులకు ఒక రోజు ముందు లెబనాన్‌తో సరిహద్దుల్లో వైమానిక దాడి జరిపి ముగ్గురు ఉగ్రవాదులను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దీనిని ధృవీకరించింది. అదే సమయంలో, ఇజ్రాయెల్ సైనికులు, సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు హిజ్బుల్లా మీడియా కార్యాలయం తెలిపింది.

అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, లెబనాన్‌లో దాదాపు 589 మంది మరణించారు. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిలో ఎక్కువ మంది హిజ్బుల్లా ఫైటర్లే.

తమవైపు 25 మంది పౌరులు, 21 మంది సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.

(అదనపు రిపోర్టింగ్ ఫ్రాన్సిస్ మావో)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)