బురదలో మియన్మార్.. 200 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిక్ మార్ష్ & బీబీసీ బర్మీస్
- హోదా, సింగపూర్, బ్యాంకాక్
యాగి టైఫూన్ కారణంగా మియన్మార్‌లో 220మందికి పైగా మృతి చెందారు.
దాదాపు 80 మంది గల్లంతయ్యారని ఆ దేశ సైనిక ప్రభుత్వం చెప్పింది.
సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఈ టైఫూన్ ఉత్తర వియత్నాం, లావోస్, థాయిలాండ్, మియన్మార్‌లలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
యాగి టైఫూన్ కారణంగా ఈ దేశాల్లో 500 మందికిపైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ఈ టైఫూన్ కారణంగా మియన్మార్‌లో భారీ వరదలతో పాటు కొండచరియలు విరిగిపడడం, బురద ప్రవాహం ముంచెత్తడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.
కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో 226 మందికి పైగా మరణించారు.
లక్షలాది ఎకరాల్లోని పంట నాశనమైంది. మియన్మార్‌లో ప్రస్తుతం సుమారు 50 లక్షల మందికి ఆహారం, తాగునీరు, ఆశ్రయం, దుస్తులు అత్యవసరమని ఐక్యరాజ్య సమితి సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్ రాజధాని నేపిడాతో పాటు 9 రాష్ట్రాల్లో ఈ టైఫూన్ ప్రభావం తీవ్రంగా ఉంది.
అలాగే, మియన్మార్‌లో ఇర్రావాడి నది పరివాహక ప్రాంతాలలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది.
2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసి సైనిక పాలన మొదలైనప్పటి నుంచి అంతర్యుద్ధంతో మియన్మార్ సతమతమవుతోంది.
సైన్యం, వివిధ గ్రూపుల మధ్య పోరాటంలో వేలాది మంది బలయ్యారు.
లక్షలాది మంది బలవంతంగా తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్యం గతేడాది తమ పట్టు కోల్పోవడంతో పాలనలో అస్థిరత ఏర్పడింది.
దీంతో మారుమూల గ్రామాలతో కమ్యూనికేషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ జరిగిన ప్రాణనష్టం గురించి సమాచారం ఆలస్యంగా అందుతోంది.

ఫొటో సోర్స్, Marga Ambulance & Rescue

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలి కాలంలో మియన్మార్ ఎదుర్కొన్న అంత్యత దారుణమైన విపత్తులలో ఈ వరదలు ఒకటని ఐక్యరాజ్య సమితి చెప్పింది.
వరదల కారణంగా రోడ్లు నాశనమవడం, వంతెనలు కూలిపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలతో దాదాపు 6,30,000 మంది ఇబ్బందిపడుతున్నారని డిజాస్టర్ రెస్పాన్స్ ఏజెన్సీ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం రెబల్ ఆర్మీ ఆధీనంలో ఉన్న షాన్ రాష్ట్రంపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది.
మొత్తం ఇళ్లన్నీ బురదలో కూరుకుపోయాయని దక్షిణాది రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఓ వలంటీర్ బీబీసీ బర్మీస్ తో చెప్పారు.
"ఇప్పటి వరకు వందకుపైగా మృతదేహాలను వెలికితీశాం. అందులో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇంకా 200 మంది కోసం వెతుకుతున్నాం" అని ఆ వలంటీర్ చెప్పారు.
‘నా జీవితంలో ఈ స్థాయిలో వరద విధ్వంసం ఎప్పుడూ చూడలేదు’ అని ఈశాన్య షాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చెప్పారు.
"ఈశాన్య ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాలవారికి అత్యవసరంగా ఆహారం అందించాలి. కానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు. యుద్ధం, వరదల కారణంగా ఎక్కడికక్కడ దారులు మూసుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని రెబల్స్ ఆధీనంలోని కరేని రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారి ఖోన్ మాటియా బీబీసీ బర్మీస్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తమకు సాయం అందిచాలని మిలటరీ కోరింది. ఇది చాలా అరుదు.
అయితే భారత్ తప్ప వేరే దేశాలేవీ మియన్మార్ సైన్యం చేసిన ఈ అభ్యర్థనకు స్పందించలేదు.
భారత్ ఆహారం, దుస్తులు, మందులను మియన్మార్‌కు సాయంగా అందించింది.
యాగి టైఫూన్ కారణంగా థాయిలాండ్‌లో 10 మంది, లావోస్‌లో ఒకరు మరణించారు.
వియత్నాంలో మరణాల సంఖ్య 292 కాగా 38 మంది గల్లంతయ్యారు. రెండు లక్షలకుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట నాశమైంది.వీటితో పాటు అనేక ఉత్పత్తి తయారీ కేంద్రాలు భారీ స్థాయిలో నాశనమయ్యాయని అధికారులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














