జానీ మాస్టర్‌పై పోక్సో కేసు, ఆచూకి కోసం గాలిస్తున్న పోలీసులు

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Jani Master/FB

ఫొటో క్యాప్షన్, జానీ మాస్టర్
    • రచయిత, బి.నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌ అలియాస్ షేక్ జానీ బాషాపై పోక్సో కేసు నమోదయింది. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారని లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొనడంతో పోక్సో కేసు నమోదు చేశారు.

పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ఒకరు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు.

21 ఏళ్ల ఆ యువతి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ పని చేస్తున్నారు.

ఇప్పుడు ఫిర్యాదు చేసిన యువతికి జానీ మాస్టర్‌తో 2017లో పరిచయం ఏర్పడింది.

ఆ తరువాత 2019లో జానీ మాస్టర్ టీమ్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఆమె చేరారు.

ఓ షూటింగ్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు అక్కడ హోటల్‌లో తనపై జానీ మాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం (సెప్టెంబరు 15)న ఫిర్యాదు చేశారు.

పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించారు’

షూటింగ్ కోసం ముంబయి వెళ్లినప్పుడు జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని బాధితురాలు చెప్పినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

‘ఈ విషయం ఎవరికైనా చెబితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని జానీ మాస్టర్ బెదిరించారు. ఆ తర్వాత కూడా అనేకసార్లు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారు. షూటింగ్ సెట్‌లోని వ్యానిటీ వ్యాన్‌లోనూ బలవంతం చేసేవారు. ఒప్పుకోకపోతే సెట్‌లో అందరి ముందు అవమానకరంగా మాట్లాడేవారు, అసభ్యకరంగా తాకేవారు’ అని బాధితురాలు చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

అంతేకాదు, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలిని జానీ మాస్టర్ బలవంతం చేశారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు రాశారు.

ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధితురాలు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయడం మానేశారని.. మరో చోట జాబ్ చేస్తున్నారని ఎఫ్ఐఆర్‌లో ఉంది.

తన దగ్గర ఉద్యోగం మానేసినప్పటికీ జానీ మాస్టర్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారని, మతం మారాలంటూ బెదిరించారని ఎఫ్ఐఆర్‌లో రాశారు.

జానీ మాస్టర్ భార్య పలుమార్లు బాధితురాలిని కొట్టినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఆగస్టు 28న ఓ అనుమానాస్పద పార్శిల్ బాధితురాలి ఇంటికి వచ్చిందని.. 'కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ బట్ బీ వెరీ కేర్‌ఫుల్' అని దానిపై రాసి ఉందని బాధితురాలు చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, TFCC

ఫొటో క్యాప్షన్, మహిళా కొరియోగ్రాఫర్ నుంచి ఫిర్యాదు అందుకున్నామన్న తెలుగు ఫిలిం చాంబర్

జానీ మాస్టర్‌పై ఫాస్ట్‌ట్రాక్ విచారణ

టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ మంగళవారం(సెప్టెంబరు 17) ప్రెస్‌మీట్ నిర్వహించింది.

వేధింపులు ఎదుర్కొన్న సమయంలో అమ్మాయి మైనర్ అని, ఆమెకు న్యాయ సహాయం అవసరమని ప్యానల్ సభ్యురాలు ఝాన్సీ చెప్పారు.

"పని ప్రదేశంలో వేధింపులు ఎదురవుతున్నట్లు బాధితురాలు మొదటగా చాంబర్‌ను ఆశ్రయించారు.

ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చింది. ఈ అంశంపై రెండు వర్గాల వాదనలు విన్నాం.

మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం. 90 రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం.

ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలు ఎవరైనా సరే... లైంగిక వేధింపులు ఎదుర్కొంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం" అని ఝాన్సీ చెప్పారు.

ఇలాంటి కేసుల కోసమే ప్యానల్‌ ఏర్పాటుచేశామని, 90 రోజుల్లో దీనికి పరిష్కారం చూపిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

9849972280 నంబర్‌కు వాట్సాప్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు

తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎవరైనా లైంగిక వేధింపులు ఎదుర్కొంటే ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ను ఆశ్రయించొచ్చని చాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ తెలిపారు.

తెలుగు ఫిల్మ్ చాంబర్ బయట ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు ఫిర్యాదుల పెట్టె ఉంటుందని, అందులో ఫిర్యాదులు వేయొచ్చని చాంబర్ సూచించింది.

పోస్ట్‌లో అయితే ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్ డి.రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబిలీహిల్స్, హైదారాబాద్-500096’ అడ్రస్‌కు పంపొచ్చు.

9849972280 నంబర్‌కు వాట్సాప్‌లోను, [email protected] మెయిల్ ఐడీకి కూడా ఫిర్యాదులు పంపించొచ్చు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, JANASENA

జానీ మాస్టర్‌ను దూరంపెట్టిన జనసేన

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జానీ మాస్టర్ జనసేన తరఫున పని చేశారు.

అయితే, ఇప్పుడు ఆయనపై లైంగిక దాడి కేసు నమోదవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది.

తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.

లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఈ ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్, ఆయన కుటుంబీకులతో మాట్లాడేందుకు ‘బీబీసీ తెలుగు’ ప్రయత్నించింది.

జానీ మాస్టర్, ఆయన భార్య ఇద్దరికీ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా వారి నుంచి ఇంతవరకు స్పందన రాలేదు.

వారి నుంచి స్పందన వస్తే ఆ వివరాలు ఈ కథనంలో జోడిస్తాం.

బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధింపులు: చిన్మయి

"రిపోర్టు ప్రకారం చూస్తే బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగికంగా వేధించడం మొదలుపెట్టారని అర్థమవుతుంది. ఈ కఠిన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉండాలని కోరుకుంటున్నాను" అని సింగర్ చిన్మయి ఎక్స్‌లో స్పందించారు.

"నిందితుడైన షేక్ జానీని మాస్టర్ అని పిలవడం సరికాదు. మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి" అని నటి పూనమ్ కౌర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)