‘సీఎం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది’

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

‘తిరుమల లడ్డూ కల్తీ’ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు.. ‘కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి’ అంటూ వ్యాఖ్యానించింది.

సోమవారం కోర్టులో జరిగిన విచారణ వివరాలను బీబీసీ ప్రతినిధి ఉమాంగ్ పోద్దార్ అందించారు.

లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ చేపట్టాలంటూ మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్, సుదర్శన్ టీవీ న్యూస్ యాంకర్ సురేష్ చవాన్కే తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ బీఆర్ గవాయీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, టీటీడీలకు ధర్మాసనం కీలక ప్రశ్నలు వేసింది.

ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.

లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యి ఇదే అనడానికి ఆధారాలేంటి? అని అడిగింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదులు చేశారని సిద్ధార్థ్ లూత్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రుచిగా లేవని చెబుతున్న లడ్డూలను నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పరీక్షల కోసం పంపించారా? అని కోర్టు ప్రశ్నించింది.

'ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ' అని ప్రాథమికంగా ఆధారాలు లేవని బెంచ్ పేర్కొంది. అయితే కొన్ని బ్యాచ్‌ల నెయ్యి కల్తీ అయినట్లు ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయని, అయితే ఈ బ్యాచ్‌లలోని నెయ్యిని ప్రసాదం తయారీలో ఉపయోగించారా? లేదా అనేది స్పష్టంగా తెలియదని పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు ముఖ్యమంత్రి ప్రకటన చేశారని ఆ విషయాన్ని నోట్ చేసుకుంటున్నట్లు కోర్టు తెలిపింది. విచారణ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఉన్నత స్థాయి వ్యక్తులు కోట్లాది మంది మనోభావాలను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడం సరికాదని ధర్మాసనం సూచించింది.

సీఎం విలేఖరులకు చెప్పడానికి ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది.

కల్తీ జరుగుతోందని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకటన చేయగా, తిరుపతి తిరుమల దేవస్థానం ఈవో అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేశారని ధర్మాసనం గుర్తించింది.

కేసులో రాష్ట్ర ప్రభుత్వ సిట్ సరిపోతుందా లేదా స్వతంత్ర విచారణ కూడా అవసరమా అనే దానిపై తమకు సహాయం చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

తిరుమల లడ్డూ, టీటీడీ, పాలకమండలి

ఫొటో సోర్స్, RAJESH

అసలు వివాదం ఎక్కడ మొదలైంది

తిరుమల లడ్డూ చుట్టూ వివాదం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.

అమరావతిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై స్పందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, ChandrababuNaidu

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు

అసలు చంద్రబాబు ఏమన్నారు?

ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఆ క్రమంలో ఆయన తిరుమల లడ్డూ తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

‘తిరుమల లడ్డూను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాం. కానీ, అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధేస్తోంది. నాసిరకమైన ఇన్‌గ్రీడియెంట్సే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ను వాడారు. మేం నాణ్యత పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైనా ఉంది’ అన్నారు చంద్రబాబు.

వైసీపీ ఏమంటోంది?

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

‘‘తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

తిరుమల, లడ్డూ, టీటీడీ, పాలకమండలి

ఫొటో సోర్స్, RAJESH

ఇంకా ఎవరేమన్నారు

అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జులై 23న నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నెయ్యిలో కల్తీపై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడారు.

టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ జరిగిందని తెలిపారు.

నెయ్యి సరఫరా చేసే అయిదుగురు సప్లయర్లలో ఒకరి వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పారు.

చంద్రబాబు వ్యాఖ్యలు నిజమని, వైసీపీ హయాంలో జంతువుల నెయ్యితో లడ్డూ తయారుచేశారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆరోపించారు.

తిరుమల, లడ్డూ, టీటీడీ, పాలకమండలి

ఫొటో సోర్స్, FB/Sharmila

సీబీఐ విచారణ జరిపించాలి: షర్మిల

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి ఆరోపించారు.

లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారని సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని.. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని లేదా సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

తనిఖీల తర్వాతే నెయ్యి వినియోగం: టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు

తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానించడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు.

టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరిస్తారని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, తనిఖీలు చేసిన తర్వాతే వాటిని వినియోగిస్తారని గుర్తుచేశారు.

ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందన్నారు.

టీటీడీ నుంచి రోజుకొక బృందం ప్రతిరోజూ సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు.

చర్యలు తీసుకోవాలి: బీజేపీ

తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉపయోగించడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

హిందూ సమాజం మొత్తం ఈ ఘటనను ఖండిస్తోందన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అప్పటి అధికారులపై చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

తిరుమల, లడ్డూ, టీటీడీ, పాలకమండలి

ఫొటో సోర్స్, ANI

ల్యాబ్ పరీక్షల్లో తేలిందిదే: ఆనం

టీటీడీ పంపిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపారని టీడీపీ ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.

ఈ ల్యాబ్‌లో పరిశీలించిన శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు ఉన్నట్లు నివేదికల్లో ఉందన్నారు.

‘ఎస్’ వాల్యూ నిర్దేశించిన పరిధిలో లేకపోతే దాన్ని ఫారిన్ ఫాట్‌గా భావిస్తారు.

ప్రామాణిక ‘ఎస్’ వాల్యూ దాదాపు 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి.

సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, ఫిష్ ఆయిల్, పామాయిల్ వంటివాటి నుంచి తయారయ్యేవాటిని ఫారిన్ ఫాట్‌గా భావిస్తారు.

ఈ నివేదికపై మరిన్ని వివరాలు తెలసుకునేందుకు ఎన్డీడీబీని ‘బీబీసీ’ సంప్రదించింది. అయితే, అక్కడి అధికారులు తమకు వచ్చే శాంపిళ్ల వివరాలు వెల్లడించలేమని చెప్పారు. తమకు ఒక శాంపిల్ వచ్చినట్లు చెప్పినప్పటికీ అందులో ఏం తేలిందో చెప్పడానికి అధికారి నిరాకరించారు.

సెంటర్‌ ఫర్‌ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్‌ ల్యాబ్‌కు వచ్చే శాంపిళ్ల వివరాలు రహస్యంగా ఉంటాయని, ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు తెలియవని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

పవిత్రమైన లడ్డూ తయారు చేయిస్తున్నాం: చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై గురువారం చంద్రబాబు మరోసారి స్పందించారు. కోట్లాదిమంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని, ఇప్పుడన్నీ సరిచేసి నాణ్యమైన ముడిసరుకు ఇచ్చి, పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)